Begin typing your search above and press return to search.

విశాఖకు దిగ్గజ ఐటీ సంస్థ.. హుద్ హుద్ దెబ్బకు అప్పుడు ఖాళీ, ఇప్పుడు మళ్లీ ఎంట్రీ!

ఐటీ మంత్రి లోకేశ్ ఆహ్వానం మేరకు ఐబీఎం విశాఖలో కార్యాలయం తెరవాలని అనుకుంటోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

By:  Tupaki Gallery Desk   |   12 Feb 2026 6:04 PM IST
విశాఖకు దిగ్గజ ఐటీ సంస్థ.. హుద్ హుద్ దెబ్బకు అప్పుడు ఖాళీ, ఇప్పుడు మళ్లీ ఎంట్రీ!
X

విశాఖ నగరానికి మరో ఐటీ దిగ్గజం రానుంది. రాజధాని అమరావతిలో క్వాంటం కంప్యూటర్ ఏర్పాటు చేస్తున్న ఐబీఎం.. విశాఖలోనూ తమ క్యాంపస్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఐటీ మంత్రి లోకేశ్ ఆహ్వానం మేరకు ఐబీఎం విశాఖలో కార్యాలయం తెరవాలని అనుకుంటోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. తాత్కాలిక కార్యాలయం ప్రారంభానికి కో-వర్కింగ్ స్పేస్ కోసం వెతుకుతున్న ఐబీఎం ప్రతినిధులు శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి తగిన భూములను ఇప్పటికే పరిశీలించి ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే విశాఖ ఐటీ హబ్ లో టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి ఎన్ఎన్సీలు తమ క్యాంపస్ లు నిర్మిస్తున్నాయి. కాగ్నిజెంట్ తాత్కాలిక కార్యాలయం ఇప్పటికే ప్రారంభించగా, టీసీఎస్ నేడో రేపో క్యాంపస్ ఓపినింగ్ కు సన్నాహాలు చేస్తోంది. అదేవిధంగా ఇన్ఫోసిస్ సైతం విశాఖ కార్యాలయాన్ని విస్తరించాలని నిర్ణయించిందని అంటున్నారు. ఈ క్రమంలోనే ప్రతిష్ఠాత్మక ఐబీఎం కూడా విశాఖ వైపు చూస్తోందన్న ప్రచారం టెక్ ఉద్యోగుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. దిగ్గజ సంస్థలు అన్నీ విశాఖకు క్యూ కడుతుండటంతో స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

విశాఖ ఐటీ కారిడార్ లో 20 ఎకరాల స్థలం కేటాయించాల్సిందిగా ఐబీఎం ప్రతినిధులు వీఎంఆర్డీఏ అధికారులను సంప్రదించినట్లు ప్రచారం జరుగుతోంది. అధికారుల సూచనలతో ఐబీఎం ప్రతినిధులు విశాఖ-భీమిలి మార్గంలో అనువైన స్థలాలను పరిశీలించారని చెబుతున్నారు. నిజానికి ఐబీఎం విశాఖకు కొత్త కాదు. 2011లోనే ఐబీఎం విశాఖలో తన కార్యాలయాన్ని తెరిచింది. అయితే 2014లో వచ్చిన హుద్ హుద్ తుఫాన్ తాకిడితో ఐబీఎం కార్యాలయం పూర్తిస్థాయిలో దెబ్బతింది. ఆ తర్వాత పునరుద్ధరణ పనులు చేయకుండా ఐబీఎం విశాఖ నుంచి నిష్క్రమించిందని గుర్తు చేస్తున్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో కెనెక్సా అనే ఐటీ కంపెనీకి రుషికొండ ఐటీ హిల్స్ లో 25 ఎకరాలను కేటాయించారు. ఆ సంస్థ కొన్నాళ్లు ఐటీ కార్యాలయాన్ని నడిపి ఆ తర్వాత ఐబీఎంకు విక్రయించిందని స్థానికులు చెబుతున్నారు. అయితే ఎకరాకు 100 మంది చొప్పున 25 ఎకరాలకు 2,500 మందికి ఐటీ ఉద్యోగాలు కల్పించాలని అప్పట్లో ప్రభుత్వం షరతు విధించడంతో ఐబీఎం వెనక్కి తగ్గింది. కెనెక్సా నుంచి తీసుకున్న 25 ఎకరాల్లో దాదాపు 21.80 ఎకరాలను ప్రభుత్వానికి తిరిగి అప్పగించిందని చెబుతున్నారు.

మిగిలిన 3.2 ఎకరాల్లో ఐబీఎం కార్యాలయం ప్రారంభించి కార్యకలాపాలను నడిపింది. అయితే 2014లో విశాఖను కుదిపేసిన హుద్ హుద్ తుఫాన్ వల్ల ఐబీఎం కార్యాలయం తీవ్రంగా నష్టపోయింది. దీంతో ఐబీఎం తన కార్యాలయాన్ని ఇన్ఫినిటీ అనే సంస్థకు విక్రయించి విశాఖ నుంచి వైదొలగిందని చెబుతున్నారు. ఇది జరిగిన పదేళ్లకు మళ్లీ విశాఖపై ఐబీఎం దృష్టి పెట్టింది. మంత్రి లోకేశ్ సూచనలతో విశాఖ ఐటీ కారిడార్ లో భారీ క్యాంపస్ నిర్మాణానికి ముందుకొచ్చినట్లు చెబుతున్నారు.

ఇక ప్రస్తుతం శాశ్వత కార్యాలయం నిర్మాణానికి రెండు మూడేళ్ల సమయం పట్టే అవకాశం ఉండటంతో అద్దె భవనాల్లో తాత్కాలిక క్యాంపస్ ప్రారంభానికి ఐబీఎం యోచిస్తున్నట్లు చెబుతున్నారు. ఐస్రౌపట్ అనే సంస్థ కూడా విశాఖలో బ్రాంచి ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోగా, తాత్కాలికంగా కార్యకలపాల నిర్వహణకు నగరంలోని ఇసుకతోట జంక్షన్ లో లాన్సమ్ బిల్డింగ్ లో ఒక ప్లోర్ అద్దెకు తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ సంస్థ ఐటీ కంపెనీలకు కో-వర్కింగ్ స్పేస్ సమకూర్చుతుంటుందని అంటున్నారు. దీంతో ఐబీఎం కూడా ఇసుకతోటలోని లాన్సమ్ బిల్డింగ్ లో కో-వర్కింగ్ స్పేస్ ను తీసుకోవాలని ప్లాన్ చేస్తోందని చెబుతున్నారు.