Begin typing your search above and press return to search.

వైసీపీలో చేరిన కీలక ఐఏఎస్‌.. అక్కడి నుంచే పోటీ!

వచ్చే ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి ఇంతియాజ్‌ ను వైసీపీ తరఫున బరిలో దించుతారని టాక్‌ నడుస్తోంది.

By:  Tupaki Desk   |   29 Feb 2024 2:37 PM IST
వైసీపీలో చేరిన కీలక ఐఏఎస్‌.. అక్కడి నుంచే పోటీ!
X

ఆంధ్రప్రదేశ్‌ లో అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఇంతియాజ్‌ అధికార వైసీపీలో చేరారు. ఆయనకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌ రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌ పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి ఇంతియాజ్‌ ను వైసీపీ తరఫున బరిలో దించుతారని టాక్‌ నడుస్తోంది.

వైసీపీ ఏర్పడ్డాక జరిగిన ఎన్నికల్లో 2014, 2019లో వైసీపీ తరఫున కర్నూలు నుంచి ఎస్వీ మోహన్‌ రెడ్డి, హఫీజ్‌ ఖాన్‌ గెలుపొందారు. 2014లో కర్నూలులో వైసీపీ తరఫున గెలిచిన ఎస్వీ మోహన్‌ రెడ్డి ఆ తర్వాత టీడీపీలోకి ఫిరాయించారు. మళ్లీ 2019 ఎన్నికల తర్వాత వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రసుతం ఆయన కూడా కర్నూలు సీటును ఆశించారు.

మరోవైపు 2019లో కర్నూలు నుంచి వైసీపీ తరఫున హఫీజ్‌ ఖాన్‌ పోటీ చేసి గెలుపొందారు. ఆయన కూడా ఈ సీటును ఆశిస్తున్నారు. అయితే వైసీపీ అధినేత జగన్‌ వీరిద్దరిని కాదని.. ప్రస్తుతం పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ఫ్‌) సీఈవోగా, భూపరిపాలన శాఖ అదనపు కార్యదర్శిగా, మైనార్టీ శాఖ కార్యదర్శిగా పలు బాధ్యతలు నిర్వహిస్తున్న సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఇంతియాజ్‌ ను ఎంపిక చేశారని అంటున్నారు.

ఈ నేపథ్యంలో ఇంకా పదవీకాలం ఉన్నప్పటికీ, ప్రస్తుతం సీనియర్‌ ఐఏఎస్‌ గా కీలక పదవుల్లో కొనసాగుతున్నప్పటికీ ఇంతియాజ్‌ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌) తీసుకున్నారు. ఈ మేరకు ఇందుకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవడం.. ప్రభుత్వం వెంటనే ఆమోదించడం జరిగిపోయాయి. ఈ విషయాన్ని కేంద్ర సిబ్బంది, వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సైతం రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి నోటిఫికేషన్‌ కూడా జారీ చేశారు.

కాగా ఇంతియాజ్‌ గతంలో కృష్ణా జిల్లాతోపాటు పలు జిల్లాలకు కలెక్టర్‌ గా పనిచేశారు. ఇంతియాజ్‌ స్వస్థలం కర్నూలు జిల్లాలోని కోడుమూరు. కర్నూలు అసెంబ్లీ స్థానంతోపాటు పార్లమెంటు స్థానం పరిధిలో భారీగా ఉన్న ముస్లింల ఓటర్లను ఆకట్టుకోవడానికి వైసీపీ ఇంతియాజ్‌ కు సీటు ఇస్తుందని తెలుస్తోంది.