ఐఏఎస్ లు ఈ కాళ్లు మొక్కడం ఏంటి?
సీఎం రేవంత్ కాళ్లు మొక్కిన ఐఏఎస్ వ్యవహారం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. విమర్శలు వెల్లువెత్తాయి.
By: Tupaki Desk | 21 May 2025 4:15 PM ISTసీఎం రేవంత్ కాళ్లు మొక్కిన ఐఏఎస్ వ్యవహారం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. విమర్శలు వెల్లువెత్తాయి. నాగర్‌కర్నూల్ జిల్లా మాచారంలో జరిగిన ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాళ్లు మొక్కిన ఐఏఎస్ అధికారి శరత్ చర్య తీవ్ర చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) రామకృష్ణారావు ఐఏఎస్ అధికారులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. హోదాను, వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.
సోమవారం నాగర్‌కర్నూల్‌లో 'ఇందిర సౌర గిరి జలవికాసం' పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ శరత్, సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశంసలతో ముంచెత్తడమే కాకుండా ఆయన కాళ్లు మొక్కారు. ఈ దృశ్యం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒక ఐఏఎస్ అధికారి తన హోదాను మరిచి ఈ విధంగా ప్రవర్తించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అధికారులు తమ హోదాకు తగిన విధంగా నడుచుకోవాలని, ఈ విధమైన శైలి సరికాదని ఆయన మందలించినట్లు సమాచారం. సీఎం సూచనల మేరకు సీఎస్ రామకృష్ణారావు ఐఏఎస్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఆల్ ఇండియా సర్వీసెస్ (ప్రవర్తనా) నియమావళి 1968 లోని 3(1) నిబంధన ప్రకారం, ఆల్ ఇండియా సర్వీసెస్ సభ్యుడు విధుల పట్ల అంకిత భావంతో ఉండాలని, సర్వీస్ హోదాకు తగనిది ఏది చేయవద్దని సీఎస్ రామకృష్ణారావు ఈ సందర్భంగా ఐఏఎస్‌లకు సూచించారు. అనుచిత ప్రవర్తన వల్ల ఐఏఎస్‌ల ప్రతిష్ట దెబ్బతింటుందని, ప్రజల్లో వారి పట్ల విశ్వాసం సన్నగిల్లుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని సీఎస్ తీవ్ర స్వరంతో హెచ్చరించారు.
ఈ ఘటనతో తెలంగాణ ప్రభుత్వంలో అధికారుల ప్రవర్తనపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు తమ వృత్తిపరమైన గౌరవాన్ని నిలబెట్టుకోవాలని, ప్రజా సేవలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఈ సంఘటన మరోసారి గుర్తుచేసింది. ప్రభుత్వ ఉన్నతాధికారుల తీరుపై ప్రజల్లో పెరిగిన నిఘాకు ఈ పరిణామం నిదర్శనంగా నిలుస్తోంది.
