Begin typing your search above and press return to search.

సంపన్నులే కానీ సింఫుల్ గా దండల పెళ్లి చేసుకున్న ఐఏఎస్ జంట

సమాజానికి ఆదర్శంగా ఉండేలా వ్యవహరిస్తున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సంఖ్య అంతకంతకూ ఎక్కువ అవుతోంది.

By:  Garuda Media   |   20 Feb 2026 11:35 AM IST
సంపన్నులే కానీ సింఫుల్ గా దండల పెళ్లి చేసుకున్న ఐఏఎస్ జంట
X

సమాజానికి ఆదర్శంగా ఉండేలా వ్యవహరిస్తున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సంఖ్య అంతకంతకూ ఎక్కువ అవుతోంది. సంపద ఉన్నప్పటికి ఆడంబరాలకు పోకుండా వీలైనంత తక్కువ ఖర్చుతో పెళ్లిళ్లు చేసుకుంటున్న వైనం ఆసక్తికరంగామారుతోంది. ఇటీవల కాలంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ లు ఇదే తరహాలో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. తాజాగా ఈ జాబితాలోకి చేరారు 2023 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారులు మాధవ్ భరద్వాజ్, అదితి వాష్ట్యేలు. వీరిద్దరూ వేర్వేరు రాష్ట్రాల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఇందుకు రాజస్థాన్ లోని అల్వార్ జిల్లా కలెక్టరేట్ వేదికైంది. ఎలాంటి హడావుడి, ఆడంబరాలు లేకుండా వీరి పెళ్లి సింఫుల్ గా రెండు దండలు మార్చుకోవటంలో పూర్తైంది.

మాధవ్ భరద్వాజ్ విషయానికి వస్తే ఆయన ఇప్పుడు రాజస్థాన్ లోని అల్వార్ సబ్ కలెక్టర్ (తెలుగు రాష్ట్రాల్లో ఈ పోస్టును ఇలా పిలుస్తుంటారు)గా వ్యవహరిస్తున్నారు. అయితే.. రాజస్థాన్ లో దీన్ని ఎస్ డీఎంగా (సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్) వ్యవహరిస్తారు. 2022 సివిల్ సర్వీసెస్ పరీక్షలో 536వ ర్యాంక్ ను సాధించారు. రాజస్థాన్ జైపూర్ లోని మాల్వియా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ చేశారు. తన సొంత రాష్ట్రమైన రాజస్తాన్ కేడర్ లో ఉన్నారు. గ్రాడ్యుయేషన్ తర్వాత మైక్రోసాఫ్ట్ లో జాబ్ చేశారు. ఆకర్షణీయమైన జీతం వస్తున్నా.. ఆయన గురి మాత్రం సివిల్స్ మీద ఉండేది. చివరకు అనుకున్నట్లే ఐఏఎస్ కలను నిజం చేసుకున్నారు.

అదితి వ్యాష్ట్రే విషయానికి వస్తే ఆమె 2022లో జరిగిన సివిల్స్ లో 57వ ర్యాంక్ ను సాధించారు. తొలి ప్రయత్నంలో ఆమె అత్యున్నత ర్యాంక్ ను సాధించటం గమనార్హం. ఉత్తరప్రదేశ్ లోని అలీఘర్ కు చెందిన ఆమె ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక మిరిండా హౌస్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి అనంతరం ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో పీజీ చేశారు.ఆమె తండ్రి ఒక వ్యాపారి. ప్రస్తుతం గుజరాత్ కేడర్ అధికారిణిగా పని చేస్తున్నారు. వీరిద్దరి ప్రేమకథ ముస్సోరిలోని టైనింగ్ లో మొదలైంది. అనంతరం పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. సింఫుల్ గా దండలు మార్చుకొని అనంతరం సాదాసీదా కారులో వెళ్లిన ఈ ఐఏఎస్ జంట ఉదంతం అందరిని ఆకర్షిస్తోంది.