Begin typing your search above and press return to search.

నేనే సీఎం : రేవంత్ నుంచి జానారెడ్డి దాకా...!

ఆయన హైదరాబాద్ కి చెందిన దివ్యాంగురాలు రజని కి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తొలి ఉద్యోగం ఆమెకే ఇస్తామని హామీ ఇచ్చారు.

By:  Tupaki Desk   |   18 Oct 2023 3:59 AM GMT
నేనే సీఎం : రేవంత్ నుంచి జానారెడ్డి దాకా...!
X

తెలంగాణా కాంగ్రెస్ నాయకులకు కి గట్టి నమ్మకం వచ్చేసింది. ధీమా కూడా పెరిగిపోయింది. ఎంతలా అంటే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అయితే డిసెంబర్ 9న సీఎం గా ప్రమాణం చేయబోతున్నట్లుగా ప్రకటించారు. డేట్ టైం మాత్రమే కాదు ఎల్బీ స్టేడియం అని వేదిక కూడా డిక్లేర్ చేశారు. అంటే రేవంత్ రెడ్డి తానే సీఎం కాబోతున్నాను అన్న ధీమాగా ఉన్నారని అర్ధం.

ఆయన హైదరాబాద్ కి చెందిన దివ్యాంగురాలు రజని కి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తొలి ఉద్యోగం ఆమెకే ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు కాంగ్రెస్ మానిఫెస్టో మీద సంతకం చేసి మరీ ఆమెకు ఇచ్చారు. ఆయన గత రెండు రోజుల నుంచి డిసెంబర్ 9న ప్రమాణం అంటున్నారు. నిజంగా చూస్తే రేవంత్ రెడ్డికే సీఎం పదవి దక్కాలి. ఆయన పీసీసీ చీఫ్ గా ఉన్నారు. పార్టీ కోసం కష్టపడుతున్నారు.

అయితే కాంగ్రెస్ లో ఇలాటివి ఎంతవరకూ పట్టించుకుంటారు అన్న మాట కూడా ఉంది. కర్నాటక ఎన్నికలనే తీసుకుంటే పీసీసీ చీఫ్ గా డీకే శివకుమార్ ఉంటే సీఎల్పీ లీడర్ గా సిద్ధరామయ్య ఉన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ కి మెజారిటీ రాగానే ఇద్దరూ సీఎం పదవి కోసం పోటీ పడ్డారు. అయితే చివరికి రాజీ ఫార్ములాను కుదుర్చింది అధినాయకత్వం. అలా తొలి మూడేళ్ల పదవీకాలం సిద్ధరామయ్యకు, ఆ మీదట రెండేళ్ళు డీకే శివకుమార్ కి ఇవ్వడానికి నిర్ణయించారు.

మరి తెలంగాణాలో చూసుకుంటే సీఎల్పీ నేతగా మల్లు భట్టి విక్రమార్క ఉన్నారు. ఆయన కీలకమైన సామాజికవర్గానికి చెందిన వారు. దళితులకు అవకాశం ఇస్తే కనుక ఆయనకే కాంగ్రెస్ సీఎం ఇవ్వాలి. ఆయన సైతం రేవంత్ తో సమానంగా పాదయాత్ర చేస్తూ వచ్చారు. పార్టీ ఆయనను బాగా గౌరవిస్తుంది. ఈ ఇద్దరూ ముందు కనిపిస్తున్నా వెనుక చాలా మంది ఉన్నారు. అందులో కోమటి రెడ్డి వెంకట రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వి హనుమంతరావు, మధు యాష్కీ, రేణుకా చౌదరి ఇలా లిస్ట్ చాలానే ఉంది.

ఇపుడు ఒక సీనియర్ నేత జానారెడ్డి తన మనసులో మాటను బయట పెట్టుకున్నారు. తాను 56 ఏళ్లుగా రాజకీయల్లో ఉంటున్నాను అని ఆయన బయోడేటా బయటకు తీశారు. 21 ఏళ్ళకే రాను రాజకీయాల్లోకి వచ్చానని తాను 36 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేశానని, అనేక శాఖలు అంటే ఒక్క సీఎం పోస్ట్ తప్ప అన్నీ నిర్వహించాను అని జానారెడ్డి చెప్పుకొస్తున్నారు. సీఎంలుగా చేసిన వారు ఎవరూ తనలా అన్ని శాఖలు చూసిన అనుభవం కలిగిన వారు కాదని అంటున్నారు.

తాను సీఎం కావాలి అన్నది ప్రజల కోరిక అంటున్నారు. చిత్రమేంటి అంటే ఆయన తాజా ఎన్నికల్లో పోటీ చేయడంలేదు, ఆయన చిన్న కుమారుడు కుందూరు జై వీర్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. అయితే కాంగ్రెస్ రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. పార్టీ ఎవరినైనా కోరుకుంటే వారు ముందు ముఖ్యమంత్రి అయిపోతారు. ఆ తరువాత ఎమ్మెల్సీ సీటు ద్వారా అయినా చట్ట సభలలో ప్రవేశిస్తారు. సో జానారెడ్డి ఆశలు పదిలంగానే ఉన్నాయని అంటున్నారు.

మొత్తానికి కాంగ్రెస్ గెలుస్తుంది అన్న సర్వేలు ఆ పార్టీ నేతల సీఎం కోరికలను బయటపెడుతున్నాయి. నిజానికి ఉమ్మడి ఏపీలో జానారెడ్డి సీఎం రేసులో ఉన్నారు. అలాగే వీ హనుమంతరావు వంటి వారు పాత కాపులే. మరి నాడు కోరిక తీరలేదు. గత రెండు ఎన్నికల్లో బీయారెస్ గెలిచింది. ఈసారి ఢంకా భజాయించి కాంగ్రెస్ గెలుస్తుంది అని అంటున్న నేపధ్యంలో రాజకీయ జీవిత చరమాంకంలో ఉన్న నేతలు అంతా సీఎం కోసం ఆరాటపడుతున్నారు. చూడాలి మరి డిసెంబర్ 3 తరువాత ఏమి జరుగుతుందో.