Begin typing your search above and press return to search.

నేనూ డీప్ ఫేక్ బాధితుడినే.. మోదీ; ఏఐ దుర్వినియోగంపై ఆందోళన

ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) ఆధారంగా సాగే డీప్ ఫేక్ ఎంతవరకు వచ్చిందో వివరిస్తూ.. తానూ దాని బారిన పడ్డానని మోదీ పేర్కొన్నారు.

By:  Tupaki Desk   |   17 Nov 2023 9:30 AM GMT
నేనూ డీప్ ఫేక్ బాధితుడినే.. మోదీ; ఏఐ దుర్వినియోగంపై ఆందోళన
X

పలు భాషల్లో నటిస్తూ.. దేశంలోనే టాప్ హీరోయిన్ గా ఉన్న రష్మిక... ఎక్కువ శాతం ఛాతీ కనిపించేలా ఉన్న నల్లటి జిమ్ దుస్తుల్లో లిఫ్ట్ లోకి ఎక్కుతున్నట్లుగా ఓ వీడియో.. ఆ తర్వాత మరో స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ను అసభ్యంగా చూపుతూ ఓ వీడియో.. వెటరన్ నటి కాజల్ దుస్తులు మార్చకుంటున్నట్లుగా మరో వీడియో... చూడగానే నిజమే అని మన్నలి భ్రమించేలా చేసే ఇలాంటి వీడియోలు ఇప్పుడు పెద్ద ఎత్తున కలకలం రేపుతున్నాయి. వాటి బారిన పడిన నటీమణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంటే.. సమాజం ఎటు పోతున్నదంటూ ఆవేదన చెందుతున్నవారు మరికొందరు. దీనంటికీ కారణం.. డీఫ్ ఫేక్ టెక్నాలజీ. సోషల్ మీడియాలో ఇటీవల ఇలాంటి వీడియోలు తీవ్ర కలవరం కలిగిస్తున్నాయి. అందులోనూ డీప్ ఫేక్ బారినపడుతున్నది సినిమా స్టార్లు, సెలబ్రిటీలే కావడంతో మరింత సంచలనంగా మారింది. ఇదిప్పుడు సాక్షాత్తు దేశ ప్రధాని మోదీనీ కదలించింది

నేనూ బాధితుడినే..

ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) ఆధారంగా సాగే డీప్ ఫేక్ ఎంతవరకు వచ్చిందో వివరిస్తూ.. తానూ దాని బారిన పడ్డానని మోదీ పేర్కొన్నారు. శుక్రవారం బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో ఆయన పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు. ‘డీప్‌ ఫేక్‌ వీడియోలు వ్యవస్థకు పెనుముప్పు. సమాజంలో గందరగోళానికి కారణమవుతున్నాయి. ‘నేను పాట పాడినట్లు కొందరు ఇటీవల వీడియో వైరల్ చేశారు. తెలిసినవాళ్లు దానినని నాకు పంపారు. ఇలాంటి డీప్‌ ఫేక్‌ వీడియోలపై మీడియా, జర్నలిస్టులు.. ప్రజలను చైతన్యం చేయాలి. అభివృద్ధి చెందుతున్న సాంకేతికత వల్ల ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలి, వాటి నుంచి ఎలా అప్రమత్తంగా ఉండాలన్న దానిపై అవగాహన కల్పించాలి’’ అని ప్రధాని సూచించారు.

చాట్ జీపీటీ.. హెచ్చరించు..

డీఫ్ ఫేక్ వీడియోలు వైరల్ అయితే ఏం చేయాలి..? మొన్నటివరకు అయితే ఎవరికీ ఏమీ తెలియదు. అసలు ఇలాంటి సమస్యే లేదు. మరిప్పుడు ఒక్కొక్కరుగా స్టార్లు దాని బారినపడుతుండడంతో చర్చనీయాంశం అవుతోంది. దీంతో ఏం చేయాలో కూడా మోదీ చెప్పారు. డీప్ ఫేక్ వీడియోలు వైరల్‌ అయినప్పుడు ఫ్లాగ్‌ చేసి, వార్నింగ్‌ ఇవ్వాలని చాట్‌ జీపీటీ బృందాన్ని తాను కోరినట్లు ప్రధాని వెల్లడించారు. డీఫ్ ఫేక్ వీడియోలపై ఇప్పటికే చాలా దుమారం రేగుతోంది. అయితే, దీనిపై చట్టాలు కూడా కఠినంగానే ఉన్నాయి. రష్మిక వీడియో బయటకు వచ్చిన సందర్భంలో.. కేంద్ర ఐటీ శాఖ తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. ఎవరైనా, ఏదైనా కమ్యూనికేషన్‌ పరికరం లేదా కంప్యూటర్‌ వినియోగించి వ్యక్తులను మోసం చేస్తే మూడేళ్ల దాకా జైలు శిక్ష, రూ.లక్ష వరకు జరిమానా విధించే నిబంధనను గుర్తుచేసింది. కాగా, అనంతరం మార్ఫింగ్‌ ఫొటోలు, వీడియోలపై ఎక్స్‌(ట్విటర్‌), ఇన్‌ స్టాగ్రాం, ఫేస్‌ బుక్‌ తదితర సోషల్ మీడియా సంస్థలకు గైడ్ లైన్స్ ఇచ్చింది. ఇలాంటి ఫొటోలపై ఫిర్యాదు అందిన 36 గంటల్లోపు తొలగించాలని ఆదేశించింది. నిబంధనలు పాటించకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.