పాక్ ఆర్మీ ఆయువుపట్టుపై కొట్టిన ఐఏఎఫ్ చీఫ్ వ్యూహం
ఈ దాడి తీవ్రతకు పాక్ ఆర్మీ చీఫ్ ఆసీమ్ మునీర్ బంకర్‌లో మూడు గంటలపాలు తలదాచుకోవాల్సి వచ్చిందట.
By: Tupaki Desk | 15 May 2025 6:00 AM ISTపాక్ మిలిటరీకి కుంభస్థలం వంటిది రావల్పిండి సమీపంలోని చక్లాలా స్థావరం. ఇక్కడి ఆర్మీ చీఫ్ ప్రధాన కార్యాలయంతోపాటు.. వాయుసేన బేస్ కూడా ఉంది. దీనికి అత్యంత సమీపంలోనే కీలకమైన న్యూక్లియర్ ప్లానింగ్ కమాండ్ కూడా ఉంది. ఇలాంటి చోట భారత వాయుసేన దాడి చేసి.. పాక్ నైతిక స్థైర్యాన్ని తుత్తునియలు చేసింది.
రావల్పిండిలోని నూర్‌ఖాన్ వైమానిక స్థావరంపై దాడికి సంబంధించిన ప్లానింగ్‌ను ఎయిర్ ఫోర్స్ చీఫ్, ఎయిర్ చీఫ్‌మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ (ఏపీ సింగ్) స్వయంగా పర్యవేక్షించారట. ఆయన ప్లానింగ్‌కు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించినట్లు సమాచారం. ఈ దాడికి వ్యూహాన్ని అమలు చేయడానికి అవసరమైన పైలట్లను ఏపీ సింగ్ స్వయంగా ఎంపిక చేశారు. ఇక దాడికి సంబంధించిన నియమనిబంధనలు వారికి స్పష్టంగా వెల్లడించి దాడికి పంపారట.
శనివారం అర్ధరాత్రి దాటాక 2 గంటల సమయంలో పాక్ సైనిక నగరమైన రావల్పిండి పేలుళ్లతో కంపించిపోయింది. క్షిపణులు, విమానాల హోరుతో అక్కడున్నవారు కంపించిపోయారు. ఇక్కడ మొత్తం మూడు ప్రదేశాలపై భారత్ క్షిపణులు, డ్రోన్లు విరుచుకుపడినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారని ఆంగ్ల వార్తా సంస్థ రాయిటార్స్ కథనంలో పేర్కొంది. రెండు భవనాల పైకప్పులు, ఓ రీఫ్యూయలర్ ట్యాంకర్ హ్యాంగర్‌ను క్షిపణులు తాకినట్లు చెబుతున్నారు. ఆ సమయంలో అక్కడి విమానం గాల్లో ఉందని అంటున్నారు. ఈ దాడి జరిగిన ప్రదేశానికి పాక్ న్యూక్లియర్ ప్లానింగ్ విభాగం కేవలం మైలు దూరం మాత్రమే ఉంది. భారత వాయుసేన ఈ దాడికి బ్రహ్మోస్ క్షిపణిని వినియోగించి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ దాడి తీవ్రతకు పాక్ ఆర్మీ చీఫ్ ఆసీమ్ మునీర్ బంకర్‌లో మూడు గంటలపాలు తలదాచుకోవాల్సి వచ్చిందట. ప్రస్తుతం ఆయన అధికారిక నివాసాన్ని కూడా ఓ సేఫ్ హౌస్‌కు మార్చుకోవాల్సి వచ్చిందని ప్రచారం జరుగుతోంది.
- అమర్‌ప్రీత్‌కు ఘనమైన చరిత్ర
1964లో జన్మించిన అమర్ ప్రీత్ సింగ్ 1984లో వాయుసేనలో పైలట్‌గా చేరారు. ఆయన నేషనల్ డిఫెన్స్ అకాడమీ, డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్, నేషనల్ డిఫెన్స్ కాలేజీల్లో విద్యాభ్యాసం చేశారు. ఆయన క్వాలిఫైడ్ ఇన్‌స్ట్రక్టర్. అంతేకాదు టెస్ట్ పైలట్‌గా కూడా పనిచేశారు. మొత్తం 5,000 ఫ్లయింగ్ అవర్స్ అనుభవం ఆయన సొంతం.
వాయుసేనలో ఆయన 40 ఏళ్ల కెరీర్‌లో వివిధ రకాల కీలక బాధ్యతలను నిర్వహించారు. మాస్కోలో చేపట్టిన మిగ్-29 విమానాల అప్‌గ్రేడ్ ప్రాజెక్టులో కీలక భూమిక పోషించారు. ఇక తేజస్ విమానాల పరీక్షల సమయంలో నేషనల్ ఫ్లైట్ టెస్ట్ సెంటర్ ప్రాజెక్టు డైరెక్టర్‌గా పనిచేశారు.
