వాయుసేన నమ్మిన బంటు కుప్పకూలింది..
సరకు రవాణా కార్యక్రమంలో భాగంగా వెళ్లిన ఈ విమానం, తిరిగి రన్‌వేపై ల్యాండ్ అవుతున్న తరుణంలో ఒక్కసారిగా ప్రమాదానికి గురైంది.
By: A.N.Kumar | 14 Jun 2026 1:17 AM ISTఅస్సాంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన ఏఎన్-32 రవాణా విమానం కుప్పకూలిన ఘటనలో ఐదుగురు వైమానిక సిబ్బంది ప్రాణాలు కోల్పోగా.. కోపైలట్ తీవ్ర గాయాలతో బయటపడ్డారు. ఈ విషాద ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. వైమానిక దళ సమాచారం ప్రకారం.. అస్సాంలోని జోర్హాట్ వైమానిక స్థావరంలో ఈ ప్రమాదం సంభవించింది. సరకు రవాణా కార్యక్రమంలో భాగంగా వెళ్లిన ఈ విమానం, తిరిగి రన్‌వేపై ల్యాండ్ అవుతున్న తరుణంలో ఒక్కసారిగా ప్రమాదానికి గురైంది.
ఎయిర్‌బేస్ లోపలికి వస్తున్న క్రమంలోనే విమానంలో భారీగా మంటలు చెలరేగాయని, ఆ వెంటనే అది రన్‌వేపైనే కుప్పకూలిపోయిందని తెలుస్తోంది. ప్రమాద తీవ్రతకు విమానం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
రంగంలోకి సహాయక బృందాలు
ప్రమాదం జరిగిన వెంటనే జోర్హాట్ స్థావరంలోని రక్షణ, భద్రతా బలగాలు, అగ్నిమాపక సిబ్బంది యుద్ధప్రాతిపదికన రంగంలోకి దిగారు. మంటలను అదుపు చేస్తూ సహాయక చర్యలు చేపట్టారు. విమానంలో ప్రయాణిస్తున్న ఆరుగురు సిబ్బందిలో ఐదుగురు అక్కడికక్కడే మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. తీవ్రంగా గాయపడిన కోపైలట్‌ను వెంటనే సమీప ఆస్పత్రికి తరలించి ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
ఉన్నత స్థాయి విచారణకు ఆదేశం
ఈ ఘోర ప్రమాదంపై భారత వైమానిక దళం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మరణించిన సిబ్బంది కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించింది. ప్రమాదానికి గల అసలు కారణాలను సాంకేతిక లోపమా లేక వాతావరణ పరిస్థితులా? అన్వేషించేందుకు వాయుసేన ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. విచారణ నివేదిక వచ్చిన తర్వాతే ప్రమాదం వెనుక ఉన్న అసలు కారణాలు వెలుగులోకి రానున్నాయి.
భారత వాయుసేనలో 'ఏఎన్-32' ప్రాధాన్యత
భారత వైమానిక దళంలో అత్యంత నమ్మకమైన, దృఢమైన సైనిక రవాణా విమానంగా ఆంటోనోవ్-32 కు పేరుంది. రెండు ఇంజిన్లు కలిగిన ఈ 'టర్బోప్రాప్' విమానం ఎన్నో దశాబ్దాలుగా వాయుసేనకు కీలక సేవలందిస్తోంది. ఇది సుమారు 7.5 టన్నుల బరువైన యుద్ధ సామాగ్రిని లేదా సరకును మోసుకెళ్లగలదు. ఒకేసారి 50 మంది ప్రయాణికులను లేదా 42 మంది పారాట్రూపర్‌లను తరలించేలా దీనిని డిజైన్ చేశారు. భౌగోళికంగా ఎత్తైన ప్రదేశాలు, కఠినమైన ఎయిర్ ఫీల్డ్‌లు, విపరీతమైన ఉష్ణమండల వాతావరణంలోనూ ఇది సమర్థంగా పనిచేస్తుంది. దేశంలో వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు మారుమూల ప్రాంతాల బాధితులకు ఆహారం, మందులు ఎయిర్ డ్రాప్ చేయడానికి వాయుసేన దీనినే విస్తృతంగా వాడుతుంది.
గతంలోనూ AN-32 విమానాలు కొన్ని ప్రమాదాలకు గురైన నేపథ్యంలో తాజా ఘటన వాయుసేన భద్రతా ప్రమాణాలపై మరోసారి చర్చకు దారితీసింది. ఎంతో నమ్మకమైన రక్షణ విమానం ఎయిర్‌బేస్ లోపలే రన్‌వేపై కుప్పకూలడం దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది.
