Begin typing your search above and press return to search.

నెలల్లోనే ఇరాన్‌ అణు కార్యక్రమం... ఐఏఈఏ అధిపతి షాకింగ్ వ్యాఖ్యలు!

ఇలా రకరకాల అభిప్రాయాలు, విశ్లేషణలు తెరపైకి వస్తోన్న నేపథ్యంలో తాజాగా అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) నుంచి కీలక అప్ డేట్ వచ్చింది.

By:  Tupaki Desk   |   1 July 2025 12:00 AM IST
నెలల్లోనే ఇరాన్‌  అణు కార్యక్రమం... ఐఏఈఏ అధిపతి షాకింగ్  వ్యాఖ్యలు!
X

ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య జరిగిన యుద్ధంలో అమెరికా ఎంట్రీ ఇచ్చి.. టెహ్రాన్ లోని అణుకేంద్రాలే లక్ష్యంగా బంకర్‌ బస్టర్‌ బాంబులు, తోమహాక్‌ క్షిపణులు ప్రయోగించి దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే... ఈ దాడుల్లో ఆ అణు కేంద్రాలు ఎంతవరకు దెబ్బతిన్నాయనే విషయంపై మాత్రం క్లారిటీ రావడం లేదు. ఈ సమయంలో... ఐఏఈఏ సంచలన అప్ డేట్ ఇచ్చింది.

అవును... ఇరాన్ పై అమెరికా చేపట్టిన 'ఆపరేషన్‌ మిడ్‌ నైట్‌ హ్యామర్‌’ పేరిట ఇరాన్‌ లోని ఫోర్డో, నతాంజ్‌, ఇస్ఫహాన్‌ అణుకేంద్రాలపై బీ-2 స్పిరిట్‌ బాంబర్లతో తమ సైన్యం భారీ దాడులకు పాల్పడిందని.. ఈ దాడుల్లో ఆయా అణుకేంద్రాలు నాశనమయ్యాయని.. ఇప్పట్లో ఇరాన్ అణ్వాయుధాలు చేసుకునే ఛాన్స్ లేదని, ఆ సామర్థ్యం పూర్తిగా పోయిందని ట్రంప్ చెబుతున్నారు.

మరోవైపు... ఇరాన్ లో అణుకేంద్రాలపై అమెరికా దాడులు అంత ప్రభావం చూపించలేదని.. వాటిని ధ్వంసం చేయాలంటే అమెరికా బాంబుల స్థాయి సరిపోదని చైనా నిపుణులు తెలిపారు. ఆ దాడుల వల్ల ఇరాన్‌ కు పరిమితంగానే నష్టం వాటిల్లిందని వెల్లడించారు. దీనికి తోడు... ఈ దాడుల్లో ఇరాన్‌ కు జరిగిన నష్టంపై పెంటగాన్‌ కు చెందిన డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఓ నివేదిక తయారుచేసింది.

ఇందులో భాగంగా.. ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ అంటూ అమెరికా జరిపిన దాడుల్లో ఇరాన్‌ కు పరిమితమైన నష్టం మాత్రం వాటిల్లిందని.. ఈ నేపథ్యంలో ఇరాన్ కొన్ని నెలల్లోనే తన కార్యక్రమాలను తిరిగి ప్రారంభించేసుకోవచ్చని తెలిపింది! మరోవైపు తమ అణుకేంద్రాలపై అమెరికా చేసిన దాడులతో తీవ్ర నష్టం వాటిల్లినట్లు ఇరాన్ అంగీకరించింది.

ఇలా రకరకాల అభిప్రాయాలు, విశ్లేషణలు తెరపైకి వస్తోన్న నేపథ్యంలో తాజాగా అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) నుంచి కీలక అప్ డేట్ వచ్చింది. ఇందులో భాగంగా.. ఇరాన్‌ అణుకేంద్రాలపై అమెరికా చేసిన దాడుల ప్రభావం కొన్ని నెలలు మాత్రమే ఉంటుందని ఐఏఈఏ అధిపతి రఫేల్‌ గ్రాసీ పేర్కొన్నారు. దీంతో.. ఈ విషయం సంచలనంగా మారింది.

ఇదే సమయంలో... టెహ్రాన్‌ మరికొన్ని నెలల్లోనే అణు ఇంధనం శుద్ధి చేయడాన్ని ప్రారంభించగలదని చెప్పిన రఫేల్... నిజం చెప్పాలంటే.. అంతా మాయమైపోయిందని, అక్కడేమీ మిగల్లేదని ఎవరూ చెప్పలేరని.. అమెరికా రెండు అణుకేంద్రాలపై 14 బంకర్‌ బస్టర్‌ బాంబులు వేసిందని.. తీవ్రంగా నష్టం వాటిల్లిందని అన్నారు.

అయితే... ఆ దాడిలో ఆ అణుకేంద్రాలు పూర్తిగా నాశనమైపోలేదని రాఫేల్‌ గ్రాసీ పేర్కొన్నారు. ఆ రెండు కేంద్రాల్లో 18,000 సెంట్రిఫ్యూజ్‌ లు ఉండొచ్చని గతంలో ఆయన అంచనా వేశారు. మరోవైపు యురేనియం శుద్ధి ప్రక్రియ ఎప్పటికీ ఆగదని.. శాంతియుత అణు కార్యక్రమం కోసం ఇలా చేసే హక్కు ఇరాన్‌ కు ఉందని తేల్చిచెప్పారు ఇరాన్‌ దౌత్యవేత్త అమిర్‌ సయిదీ ఇరావని. ఈ నేపథ్యంలో అమెరికా నుంచి ఎలాంటి రియాక్షన్ రావొచ్చనేది ఆసక్తిగా మారింది.