మీ శరీరంలో అత్యంత ప్రమాదకరమైన 'సైలెంట్ కిల్లర్'ని గుర్తించారా?
హైపర్‌టెన్షన్ ముందస్తు హెచ్చరికల్లో కనిపించే మరో ముఖ్యమైన లక్షణం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం .. గుండె వేగంగా కొట్టుకోవడం.
By: Sivaji Kontham | 17 Jun 2026 5:00 AM ISTప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో మారుతున్న జీవనశైలి, విపరీతమైన మానసిక ఒత్తిడి కారణంగా చాలామంది రకరకాల ఆరోగ్య సమస్యల భారిన పడుతున్నారు. వీటిలో అన్నింటికంటే ప్రమాదకరమైనది... నిశ్శబ్దంగా ప్రాణాలు తీసేది `హైపర్‌టెన్షన్` (అధిక రక్తపోటు). వైద్య పరిభాషలో దీనిని `సైలెంట్ కిల్లర్` అని పిలుస్తారు. ఎందుకంటే ఈ వ్యాధి శరీరంలోకి ప్రవేశించినప్పుడు ఎలాంటి పెద్ద సంకేతాలు కనిపించవు. అయితే ముంబైకి చెందిన ఒక ప్రముఖ వైద్యుడు తెలిపిన వివరాల ప్రకారం.. చాలామంది తమకు హైపర్‌టెన్షన్ ఉందని నిర్ధారణ కాకముందే కొన్ని సాధారణ లక్షణాలను అనుభవిస్తారని.... కానీ వాటిని కేవలం అలసటగా భావించి నిర్లక్ష్యం చేస్తారని హెచ్చరిస్తున్నారు.
సాధారణంగా ప్రజలు నిర్లక్ష్యం చేసే ప్రాథమిక లక్షణాలలో తరచుగా వచ్చే తలనొప్పి అత్యంత ముఖ్యమైనది. ముఖ్యంగా ఉదయం నిద్ర లేవగానే తల వెనుక భాగంలో నొప్పిగా అనిపించడం అధిక రక్తపోటుకు ప్రధాన సంకేతం కావచ్చు. దీనితో పాటు తరచుగా కళ్లు తిరగడం లేదా తల తేలికగా అయిపోయినట్లు అనిపించడాన్ని చాలామంది ఆఫీస్ ఒత్తిడి లేదా సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల వచ్చిందని సరిపెట్టుకుంటారు. కానీ ఇలాంటి చిన్న చిన్న మార్పులను గమనించి వెంటనే అప్రమత్తం కాకపోతే భవిష్యత్తులో అది తీవ్రమైన గుండె జబ్బులకు దారితీసే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.
హైపర్‌టెన్షన్ ముందస్తు హెచ్చరికల్లో కనిపించే మరో ముఖ్యమైన లక్షణం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం .. గుండె వేగంగా కొట్టుకోవడం. చిన్నపాటి శారీరక శ్రమ చేసినా లేదా మెట్లు ఎక్కినా విపరీతంగా రొప్పడం.. ఛాతీలో ఏదో తెలియని అసౌకర్యం కలగడం వంటివి రక్తపోటు పెరుగుతోందనడానికి సంకేతాలు. అలాగే కొందరిలో ఎలాంటి కారణం లేకుండానే ముక్కు నుండి రక్తం కారుతుంది. ఇలాంటి అసాధారణ మార్పులు సంభవించినప్పుడు శరీరం మనకు ప్రమాద సంకేతాలను పంపుతోందని గ్రహించాల్సి ఉంటుంది.
దృష్టి లోపాలు.. వినికిడి సమస్యలు కూడా అధిక రక్తపోటుతో ముడిపడి ఉంటాయని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రక్తపోటు విపరీతంగా పెరిగినప్పుడు కంటి చూపు మసకబారడం లేదా కళ్ల ముందు ఏదో నల్లటి చుక్కలు తిరుగుతున్నట్లు అనిపించడం జరుగుతుంది. అలాగే చెవులలో ఏదో వింత శబ్దం రావడం కూడా హైపర్‌టెన్షన్ లక్షణమే. ఈ లక్షణాలన్నింటినీ సాధారణ అలసటగా లేదా వయసు రీత్యా వచ్చే మార్పులుగా భావించి నిర్లక్ష్యం చేయడం వల్ల.. లోపల వ్యాధి మరింత ముదిరిపోయి ఒక్కసారిగా పక్షవాతం లేదా కిడ్నీలు పాడైపోయే స్థితికి చేరుకుంటుంది.
ఈ ప్రమాదకరమైన ఆరోగ్య పరిస్థితి నుండి బయటపడటానికి ముందస్తు గుర్తింపు.. జీవనశైలిలో మార్పులు మాత్రమే ఏకైక మార్గం. ముంబై వైద్యుడి సూచనల ప్రకారం.. 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా రక్తపోటు (బీపీ) పరీక్షలు చేయించుకోవడం అలవాటు చేసుకోవాలి. ఆహారంలో ఉప్పు శాతాన్ని తగ్గించడం, ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం, ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండటం ద్వారా హైపర్‌టెన్షన్‌ను నియంత్రణలో ఉంచుకోవచ్చు. శరీరంలో కనిపించే చిన్న మార్పును కూడా నిర్లక్ష్యం చేయకుండా.. సమయానికి వైద్యుడిని సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ `సైలెంట్ కిల్లర్` భారి నుండి మన ప్రాణాలను కాపాడుకోవచ్చు.
