Begin typing your search above and press return to search.

తెలంగాణలో ఆమె పోటీపై హైప్.. హడావుడేనా?

అసలు ఏ విషయమూ నిర్ధారణ కాకున్నా.. రోజుకో నియోజకవర్గం పేరును ప్రస్తావిస్తూ హడావుడి చేస్తోంది.

By:  Tupaki Desk   |   5 Jan 2024 8:08 AM GMT
తెలంగాణలో ఆమె పోటీపై హైప్.. హడావుడేనా?
X

అదిగో ఆమె మెదక్ నుంచి బరిలో దిగుతారు..? ఇదిగో మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తారు.. కాదుకాదు చూడండి ఖమ్మం నుంచి రంగంలోకి దూకుతారు.. లేదులేదు అసలు ఈసారి ఆమె పోటీనే చేయరు.. అనారోగ్యంతో ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొంటున్నారు.. దేశంలో ఏ నాయకుడు, నాయకురాలి పోటీ గురించి రాని ఊహాగానాలు ఆమె విషయంలో వస్తున్నాయి.. వీటిలో నిజం ఏమిటో కానీ.. మీడియా హైప్ మాత్రం మామూలుగా లేదు. అసలు ఏ విషయమూ నిర్ధారణ కాకున్నా.. రోజుకో నియోజకవర్గం పేరును ప్రస్తావిస్తూ హడావుడి చేస్తోంది.

వస్తే సంచలనమే..

తెలంగాణలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించింది. దీంతో దక్షిణాదిలో కర్ణాటక తర్వాత రెండో రాష్ట్రాన్ని ఖాతాలో వేసుకుంది. ఇక మిగిలింది కేరళనే. ఏపీపై ఎలాగూ ఆశలు లేవు. కాగా, ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ తెలంగాణ నుంచి ఎంపీగా పోటీ చేస్తారనే కథనాలు వస్తున్నాయి. టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సైతం.. తమ అగ్ర నేతను రాష్ట్రం నుంచి పోటీ చేయాలని కోరుతూ తీర్మానం చేసి పంపింది. మరోవైపు పీసీసీ సమావేశం కూడా ఈ మేరకు తీర్మానం చేసింది. అయితే, ఇంతకూ సోనియా ఎక్కడినుంచి బరిలో దిగుతారనేది మాత్రం స్పష్టం కాలేదు. 2004 నుంచి సోనియా వరుసగా ఐదుసార్లు (2006 ఉప ఎన్నిక సహా) యూపీలోని రాయ్ బరేలీ నుంచి ఎంపీగా ఎన్నికవుతూ వస్తున్నారు. తాజాగా తెలంగాణలో అధికారంలోకి వచ్చాక సోనియా మెదక్ నుంచి పోటీ చేస్తారని ప్రాచారం జరిగింది. దీనికితోడు ఆమె అత్తగారు ఇందిరాగాంధీ 1980లో మెదక్ నుంచి గెలిచారు. మెదక్ ఎంపీగా ఉండగానే ఆమె ప్రధాని బాధ్యతల్లో కొనసాగుతూ దారుణ హత్యకు గురయ్యారు. అలాంటి స్థానంలో సోనియా పోటీ అంటే అది సంచలనమే.

వలస గుమ్మంలో..

తాజాగా సోనియాగాంధీ ఖమ్మం నుంచి లోక్ సభ బరిలో దిగుతారంటూ కథనాలు వస్తున్నాయి. ఖమ్మంలో ఎలాగూ బీఆర్ఎస్ బలహీనమే. కమ్యూనిస్టులు కాంగ్రెస్ వైపే ఉంటారు. కాంగ్రెస్ కు మొదటినుంచి ఖమ్మం జిల్లా పెట్టని కోట. ఇన్ని సమీకరణాల మధ్యన సోనియాగాంధీని ఖమ్మం నుంచి పోటీ చేయిస్తే సులువుగా గెలవచ్చని కూడా రాష్ట్ర నేతలు భావిస్తున్నారు. సోనియా తెలంగాణలో ఎక్కడ పోటీ చేసినా గెలుపు పక్కా. కానీ మెదక్ కంటే ఖమ్మం అయితే మరీ సులువు. ఎందుకంటే.. ప్రాంతాలకు అతీతంగా నాయకులను ఆదరించడం ఖమ్మం వాసుల లక్షణం. నాదెండ్ల భాస్కరరావు, రేణుకా చౌదరి ఇలానే ఎంపీలుగా గెలుపొందారు.

తెలంగాణ ఇచ్చిన సోనియాపై పోటీ ఉంటుందా..?

ఎవరెన్ని చెప్పినా తెలంగాణ ఏర్పాటుకు సోనియా గాంధీ పట్టుదలే కారణం. ఆమె లేకుంటే ప్రత్యేక రాష్ట్రం వచ్చేదే కాదనేది సత్యం. అలాంటి సోనియా గాంధీ తెలంగాణలో ఎంపీగా పోటీ చేస్తే పార్టీలకు అతీతంగా ఆమెకు ఓట్లు పడడం ఖాయం. బీఆర్ఎస్ శ్రేణులు సైతం సోనియాకే ఓటేస్తాయనడంలో సందేహం లేదు. సోనియాపై అసలు బీఆర్ఎస్ అభ్యర్థినే నిలపకపోవచ్చు కూడా. బీజేపీ మాత్రం కచ్చితంగా పెద్ద నాయకుడినే దింపే వీలుంటుంది.