Begin typing your search above and press return to search.

హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇల్లు బఫర్ జోన్ లో ఉందా?

కొద్దికాలంగా వార్తల్లో నిలిచిన హైడ్రా.. దసరా తర్వాత నుంచి తన దూకుడు తగ్గించటం తెలిసిందే.

By:  Tupaki Desk   |   25 Nov 2024 10:29 AM IST
హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇల్లు బఫర్ జోన్ లో ఉందా?
X

కొద్దికాలంగా వార్తల్లో నిలిచిన హైడ్రా.. దసరా తర్వాత నుంచి తన దూకుడు తగ్గించటం తెలిసిందే. నిత్యం హెడ్ లైన్స్ లో కనిపించిన హైడ్రా మీద తొలుత వచ్చిన పాజిటివ్ కంటే నెగిటివ్ ఎక్కువ కావటం.. అదే ఊపును కొనసాగిస్తే.. ప్రభుత్వానికి తీరని డ్యామేజ్ జరుగుతుందన్న ఒత్తిడితో హైడ్రా స్పీడ్ కు బ్రేకులు వేయటం తెలిసిందే. హైడ్రా సంచలనాలకు కర్త.. కర్మ.. క్రియ మొత్తం రంగనాథ్.

హైదరాబాద్ మహానగరం పరిధిలోని చెరువుల బఫర్ జోన్ లో నిర్మించిన నిర్మాణాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవటం తెలిసిందే. ఇందులో భాగంగా పలు కట్టడాలను నేలమట్టం చేసిన వైనం పెను సంచనలంగా మారింది. ఇదిలా ఉండగా.. అక్రమ నిర్మాణాలపై చట్టపరమైన చర్యలు తీసుకునే రంగనాధ్ సొంతిల్లు అక్రమ నిర్మాణమని.. ఆయన ఉంటున్న ఇల్లు బఫర్ జోన్ పరిధిలో ఉన్నట్లుగా పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

దీనికి సంబంధించిన కథనాలు ఈ మధ్యన సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై ఆయన స్పందించకపోవటంతో యూసఫ్ గూడ సమీపంలోని ఆయన ఉండే ఇల్లు బఫర్ జోన్ పరిధి కిందకే వస్తుందన్న ప్రచారానికి చెక్ చెబుతూ తాజాగా రంగనాథ్ రియాక్టు అయ్యారు. ఒక సుదీర్ఘ వివరణతో పాటు.. తాను చెబుతున్న అంశాలకు బలం చేకూరేలా గూగల్ మ్యాప్ తో పాటు.. మరికొన్ని పత్రాల్ని జారీ చేశారు.

యూసఫ్ గూడ సమీపంలోని మధురానగర్ లో తాము నివసిస్తున్న ఇల్లు.. బఫర్ జోన్ పరిధిలో లేదన్న రంగనాథ్.. ‘‘1980లో మా తండ్రి సుబ్బయ్య ఈ ఇంటిని నిర్మించారు. అప్పటి నుంచి అదే ఇంట్లో ఉంటున్నాం. క్రిష్ణకాంత్ పార్కు దిగువన వేల ఇళ్ల తర్వాత మా ఇల్లు ఉంటుంది. మా ఇల్లు బఫర్ జోన్ లో ఉందని కొన్ని సోషల్ మీడియాలతో పాటు.. పత్రికల్లో వచ్చిన వార్తల్లో నిజం లేదు’’ అంటూ స్పష్టం చేశారు.