హైడ్రా కమిషనర్ గన్‌మెన్ ఆత్మహత్యాయత్నం: ఆర్థిక ఇబ్బందులా? మరేదైనా కారణమా?
హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్ మెన్ కృష్ణచైతన్య సర్వీస్ రివాల్వర్ తో తనపై తానే కాల్చుకుని ఆత్మహత్యాయత్నం చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
By: A.N.Kumar | 22 Dec 2025 12:03 AM ISTహైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్ మెన్ కృష్ణచైతన్య సర్వీస్ రివాల్వర్ తో తనపై తానే కాల్చుకుని ఆత్మహత్యాయత్నం చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇంట్లో ఈ విషయం గమనించిన కుటుంబ సభ్యులు అతడిని హుటాహుటిన సమీపంలోని కామినేని ఆస్పత్రికి తరలించారు. బుల్లెట్లు శరీరాన్ని దూసుకుపోవడంతో అతడికి తీవ్ర అంతర్గత గాయాలు అయ్యాయి. అధిక రక్తస్రావం కావడంతో పరిస్థితి విషమంగా మారిందని.. ప్రస్తుతం వైద్యులు శస్త్రచికిత్సలు నిర్వహిస్తూ చికిత్స అందిస్తున్నారని సమాచారం.
ఈ ఘటన తర్వాత కమిషనర్ రంగనాథ్ తో పాటు కృష్ణ చైతన్య కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడారు. అయితే వారి ప్రకటనలు పరస్పరం భిన్నంగా ఉండడంతో అసలు నేపథ్యం ఏంటన్నదానిపై అనుమానాలు మొదలయ్యాయి.
రంగనాథ్ ఏమన్నారు?
ఆసుపత్రిలో కృష్ణ చైతన్య కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం రంగనాథ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘కృష్ణ చైతన్య ఆర్థిక సమస్యలతో ఇబ్బందిపడుతూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని తెలిపారు. బెట్టింగ్ యాప్స్ కు అలవాటు పడి భారీగా డబ్బు నష్టపోయాడని..ఆర్థిక ఒత్తిడి తట్టుకోలేక కొన్ని రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు చెప్పారు. ఈ ఘటనను వేరేకోణంలో చూడవద్దని మీడియాను ఆయనను కోరారు.
కృష్ణ చైతన్య తండ్రి వాదన ఏమిటి?
అయితే కృష్ణ చైతన్య తండ్రి మాత్రం పూర్తిగా భిన్నంగా స్పందించారు. తన కుమారుడికి బెట్టింగ్ యాప్స్ లేదా గేమింగ్ యాప్స్ ఆడే అలవాటులేదని.. పెద్దగా ఆర్థిక సమస్యలు కూడా లేవని స్పష్టం చేశారు. విధుల్లో చేరేందుకు సర్వీస్ తుపాకీ తీసుకెళ్లాడని కానీ ఇలా జరుగుతుందని తాముఊహించలేదన్నారు. ఈ ఘటన వెనుక అసలు కారణాలు ఏమిటో పోలీసులు లోతుగా దర్యాప్తు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
రాజకీయ , మీడియా కోణాలు
ఈ ఘటన నేపథ్యంలో కొందరు మీడియా సంస్థలు.. ముఖ్యంగా గులాబీ అనుకూల మీడియా హైడ్రాలో పనిచేయడం వల్లే పని ఒత్తిడి పెరిగి ఈ దారుణం జరిగిందని ప్రచారం మొదలుపెట్టాయి. అయితే దీనిని కృష్ణ చైతన్య తండ్రి ఖండించారు. తన కుమారుడిపై ఎలాంటి పని ఒత్తిడి లేదని.. విధి నిర్వహణలో హైడ్రా అధికారులు పూర్తి సహకరిస్తున్నారని చెప్పారు.
అసలు గందరగోళం ఎక్కడ?
ఒకవైపు కమిషనర్ రంగనాథ్ చెప్పిన ఆర్థికసమస్యల వాదన.. మరోవైపు తండ్రి ఖండన.. ఈ రెండింటి మధ్య ఉన్న తేడానే ఈ కేసును మరింత సంక్లిష్టంగా మార్చింది. మీడియాలో రకరకాల కథనాలు రావడంతో రంగనాథ్ స్వయంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడాల్సి వచ్చినట్టు సమాచారం. కుటుంబ సభ్యులతో నేరుగా చర్చల కన్నా మీడియా ద్వారానే వివరణ ఇచ్చిన కారణంగానే ఇరుపక్షాల మాటల్లో తేడా కనిపిస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కృష్ణ చైతన్య ఆత్మహత్యాయత్నం వెనుక నిజమైన కారణం ఏంటన్నది ఇప్పటికీ స్పష్టంగా బయటపడలేదు. అధికారిక దర్యాప్తు పూర్తయ్యేవరకూ ఊహాగానాలు, రాజకీయ ఆరోపనలు కొనసాగుతూనే ఉంటాయి. ఈ ఘటనలో నిజం ఏదైనా ఒక యువకుడి ప్రాణాలతో చెలగాటం ఆడిన పరిస్థితులు బయటకు రావాల్సిందేనన్న డిమాండ్ మాత్రం బలంగా వినిపిస్తోంది.
