Begin typing your search above and press return to search.

65 ఏళ్ల క్రితమే లేఔట్.. కానీ, పార్క్ ఔట్.. హైడ్రాతో సమస్య సెటిల్

గత ఏడాది ఇదే రోజుల్లో హైదరాబాద్ లో హైడ్రా పేరిట ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం.

By:  Tupaki Desk   |   30 Jun 2025 9:25 AM IST
65 ఏళ్ల క్రితమే లేఔట్.. కానీ, పార్క్ ఔట్.. హైడ్రాతో సమస్య సెటిల్
X

ఎప్పుడో 1961లో... అంటే దాదాపు 65 ఏళ్ల కిందట.. అప్పటికింకా హైదరాబాద్ అమీర్ పేట కూడా పూర్తిగా డెవలప్ కాలేదు.. ఆ సమయంలో ఈ ప్రాంతానికి దగ్గరలో ఓ లే ఔట్.. ఓ విధంగా చూస్తే ఇది ప్రొగ్రెసివ్ అడుగే. కానీ, అంతా బాగున్నా పార్క్ కు ఉద్దేశించిన స్థలం మాత్రం ఆక్రమించేశారు. అప్పటినుంచి పరిష్కారం మాత్రం దొరకలేదు. ఎట్టకేలకు ఇప్పుడు మోక్షం లభించింది. అది కూడా హైడ్రా చొరవతో కావడం గమనార్హం.

గత ఏడాది ఇదే రోజుల్లో హైదరాబాద్ లో హైడ్రా పేరిట ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. చెరువుల ఆక్రమణలను నిరోధించడం, అక్రమ కట్టడాల కూల్చివేత లక్ష్యాలతో హైడ్రా హడల్ పుట్టించింది. చాలామంది సామాన్యులు కూడా తమ సమస్యలను హైడ్రాకు చెప్పుకొంటే పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నారు. దీనికోసం హైడ్రా నిర్వహితున్న ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తున్నారు. హైదరాబాద్ మధురానగర్ ఎల్లారెడ్డిగూడలోని ఓ పార్కు స్థలం ఆక్రమణ విషయం కూడా ఇలానే పరిష్కారమైంది.

అమీర్ పేట, మధురానరగర్ సమీపంలో ఉంటుంది ఎల్లారెడ్డిగూడ. ఇక్కడ 1961లో 5 ఎకరాల్లో సాయిసారథినగర్ ఏర్పాటైంది. 35 ప్లాట్ల లేఔట్ లో 1,533 గజాలను పార్కు స్థలంగా చూపారు. దాదాపు 13 కుంటలు అన్నమాట. అయితే, లే ఔట్ వేసిన నారాయణ ప్రసాద్ వారసులు పార్కు స్థలంలో షెడ్ వేశారు. గతంలోని అధికారులను మేనేజ్ చేసి ఇంటి నంబరు తెచ్చుకున్నారు.

ఈ లేఔట్ లో రోడ్లు వేసినా.. పార్కు స్థలం మాత్రం ఆక్రమణలోనే ఉండడంతో జీహెచ్ఎంసీకి స్థానికులు ఫిర్యాదులు చేశారు. వారు పట్టించుకోకపోవడంతో చివరకు హైడ్రాను ఆశ్రయించారు. అన్ని అంశాలను క్షుణ్నంగా పరిశీలించిన హైడ్రా... పూర్తి విచారణ చేపట్టింది. సాయిసారథి నగర్ లోని ఆక్రమణలను కూల్చివేసింది.