Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఇంటికి మంచినీటి ట్యాంకర్.. బోర్ ఏమైంది?

ఆదివారం సాయంత్రం ఒక పోస్టు వైరల్ గా మారింది. అందరూ ఆసక్తిగా దాన్ని చదివారు

By:  Tupaki Desk   |   18 March 2024 3:55 AM GMT
కేసీఆర్ ఇంటికి మంచినీటి ట్యాంకర్.. బోర్ ఏమైంది?
X

ఆదివారం సాయంత్రం ఒక పోస్టు వైరల్ గా మారింది. అందరూ ఆసక్తిగా దాన్ని చదివారు. కొందరు తెలిసిన వారికి షేర్ చేశారు. మరికొందరు దీని గురి తెలియగానే ఆశ్చర్యపోయారు. ఎందుకంటే.. పదేళ్లు ప్రభుత్వాన్ని నడిపిన తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటికి వాటర్ బోర్డు నుంచి ఒక వాటర్ ట్యాంకర్ పంపాల్సి రావటం. గతంలో ఎప్పుడూ అలాంటి పరిస్థితి చోటు చేసుకోలేదు. అలాంటిది ఆదివారం మాత్రం ఒక మంచినీటి ట్యాంకర్ ను పంపాల్సి వచ్చింది.

బంజారాహిల్స్ లోని నంది నగర్ లో కేసీఆర్ నివాసం ఉంది. ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత ఫాం హౌస్ కు వెళ్లిపోయిన కేసీఆర్.. అక్కడి బాత్రూంలో జారి పడిన తర్వాత ఆసుపత్రిలో చేరటం.. అక్కడ నుంచి డిశ్చార్జి అయిన తర్వాత ఎక్కువగా నందినగర్ నివాసంలోనే ఉంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఆ ఇంటి వ్యవహారాలు చూసే వ్యక్తులు బంజారాహిల్స్ లోని జలమండలి తట్టిఖాన సెక్ష్న్ ఆఫీసుకు ఫోన్ చేసి ఒక మంచినీటి ట్యాంకర్ ను పంపాలని కోరారు.

దీంతో జలమండలి మేనేజర్ రాంబాబు 5వేల లీటర్ల ట్యాంకర్ ను ఇంటికి పంపారు.దీనికి సంబంధించిన సమాచారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే.. నీటి కొరత లేదని సరఫరా సక్రమంగా సాగుతుందని వాటర్ బోర్డు అధికారులు చెబుతున్నా.. వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉందంటున్నారు. నగరంలోని చాలా ప్రాంతాల్లో తీవ్రమైన నీటి ఎద్దడి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. దీనికి కారణం గత ఏడాది వర్షాలు సరిగా పడకపోవటం ఒక కారణమైతే.. ఈ ఏడాది వేసవి ముందుగానే వచ్చేసింది.

దీనికి తోడు జలమండలి నుంచి నీటి సరఫరా సరిగా సాగటం లేదన్న విమర్శ వినిపిస్తోంది. మొత్తంగా హైదరాబాద్ మహానగర భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. దీంతో పలు బోర్లు ఎండిపోయాయి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటి బోరే ఎండిపోయిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇదో రెడ్ సిగ్నల్ అని.. ప్రభుత్వం మేల్కొనాలని.. వెంటనే రియాక్టు కావాలని చెబుతున్నారు. మహానగర నీటి సరఫరా మీద ప్రత్యేకంగా ఫోకస్ చేయకుంటే మరిన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది.