Begin typing your search above and press return to search.

వావ్ అనాల్సిందే: రద్దీలో ఢిల్లీని దాటేసిన హైదరాబాద్!

దేశ రాజధాని ఢిల్లీ కంటే హైదరాబాద్ ఎయిర్ పోర్టు కేంద్రంగా అంతర్జాతీయ ప్రయాణికుల రద్దీ.. విమానాల రాకపోకలు అంతకంతకూ ఎక్కువ అవుతున్న వైనం ఆసక్తికరంగా మారింది.

By:  Tupaki Desk   |   19 Dec 2023 12:30 PM GMT
వావ్ అనాల్సిందే: రద్దీలో ఢిల్లీని దాటేసిన హైదరాబాద్!
X

రద్దీలో ఢిల్లీని దాటేయటం ఏమిటి? స్వీట్ న్యూస్ అని పేర్కొనటం ఏమిటి? అసలు ఏమైనా సంబంధం ఉందా? అన్న సందేహం కలగొచ్చు. కాకుంటే.. ఇక్కడ రద్దీ అంటే నెగిటివ్ కాదు పాజిటివ్. ఇక్కడ ప్రస్తావిస్తున్న రద్దీ.. ట్రాఫిక్ రద్దీ కాదు.. విమానప్రయాణాల్లో పెరిగిన ప్రయాణికుల రద్దీ. తాజాగా విడుదలైన ఒక రిపోర్టు ఆసక్తికరంగా మారింది. దేశ రాజధాని ఢిల్లీ కంటే హైదరాబాద్ ఎయిర్ పోర్టు కేంద్రంగా అంతర్జాతీయ ప్రయాణికుల రద్దీ.. విమానాల రాకపోకలు అంతకంతకూ ఎక్కువ అవుతున్న వైనం ఆసక్తికరంగా మారింది.

గత నెలల హైదరాబాద్ ఎయిర్ పోర్టు నుంచి 20.32 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. 2022 నవంబరుతో పోలిస్తే ప్రయాణికుల సంఖ్య 16 శాతం ఎక్కువ. అంతేకాదు ఒక్క నవంబరులో హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు 14,462 విమానాలు వచ్చి వెళ్లాయి. ఇదే గణాంకాల్ని 2022తో పోల్చి చూస్తే.. 17 శాతం ఎక్కువగా ఉండటం గమనార్హం. అదే సమయంలో ఢిల్లీ ఎయిర పోర్టులో రద్దీని 2022తోపోలిస్తే ఈ నవంబరులో నమోదైన గణాంకాలు సింగిల్ డిజిట్ లో ఉండటం.. అది కూడా హైదరాబాద్ గణాంకాలతో పోలిస్తే వెనుకబడి ఉండటం గమనార్హం.

2022 నవంబరుతో పోలిస్తే ఈ నవంబరులో ఢిల్లీ ఎయిర పోర్టునుంచి ప్రయాణికుల రాకపోకల్లో 7 శాతం వ్రద్ది నమోదైతే.. విమాన రాకపోకల్లో కేవలం ఒక్క శాతమే పెరుగుదల ఉండటం గమనార్హం. ఈ ఆర్థిక సంవత్సరం (2023 ఏప్రిల్ నుంచి 2024 మార్చి 31వరకు) లో నవంబరు చివరి నాటికి హైదరాబాద్ ఎయిర్ పోర్టు నుంచి 1.63 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. దాదాపు 1.13 లక్షల విమానాలు ఎయిర్ పోర్టుకు వచ్చి వెళ్లాయి. 2022లో ఇదే కాలంతో పోల్చి చూస్తే.. ప్రయాణికుల రాకపోకల్లో పెరుగుదల 22 శాతం పెరిగితే..విమానాల రాకపోకల్లో 12 శాతంబ పెరుగుదల నమోదైంది.

అదే సమయంలో ఢిల్లీ గణాంకాలతో పోల్చి చూసినప్పుడు ఇదే సమయానికి ప్రయాణికుల రాకపోకలు 15 శాతం.. విమానాల రాకపోకలు 4 శాతం మేరే పెరగటం గమనార్హం. ఇదంతా చూస్తే.. దేశ రాజధాని ఢిల్లీతో పోలిస్తే.. హైదరాబాద్ కు వస్తున్న అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు అర్థమవుతుంది. మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే.. నవంబరు 25 ఒక్క రోజే హైదరాబాద్ ఎయిర్ పోర్టు నుంచి రికార్డు స్థాయిలో 75 వేల మంది రాకపోకలు సాగించినట్లుగా పేర్కొన్నారు.

అంతేకాదు.. దేశంలోనే మరే ఎయిర్ పోర్టులో లేని విధంగా హైదరాబాద్ ఎయిర్ పోర్టులో స్మార్ట్ ట్రాలీ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని ప్రకారం స్మార్ట్ ట్రాలీ మీద ఉండే స్క్రీన్ ద్వారా ప్రయాణికులు తాము వెళ్లాల్సిన విమాన వేళలు.. గేట్ నెంబరు.. ఇతర వివరాలు తెలుసుకునే వీలుంది.