Begin typing your search above and press return to search.

ఈ మహా నగరానికి ఏమైంది?

ఒకప్పుడు.. చలికాలంలో గజగజ వణికించే చలి.. సాయంత్రం ఐదు గంటలకే చీకటి

By:  Tupaki Desk   |   6 May 2024 11:30 AM GMT
ఈ మహా నగరానికి ఏమైంది?
X

ఒకప్పుడు.. చలికాలంలో గజగజ వణికించే చలి.. సాయంత్రం ఐదు గంటలకే చీకటి.. రాత్రయితే రగ్గు లేకుండా పడుకోలేని పరిస్థితి.. వానాకాలం సమయానికి తగ్గట్లు వర్షాలు.. ఇక వేసవికి వస్తే.. ఎంత ఎండ ఉన్నా.. జిడ్డు పట్టదు. సాయంత్రానికి మరింత ఆహ్లాదం.. కానీ, ఇప్పుడు గదిలో ఉన్నా ఎండ పిండేస్తోంది. బయటకు వెళ్తే వడగాలి ఈడ్చి కొడుతోంది. చరిత్రలో లేనంతగా ఉష్ణోగ్రతలు రికార్డులు దాటేస్తోంది. ఎందుకిలా..? ఈ మహా నగరానికి ఏమైంది?

ఆ పాత హైదరాబాద్ కలేనా?

ఓ 30 ఏళ్ల కిందట హైదరాబాద్ అంటే కూల్ కూల్… చెన్నైను వదిలి తమిళనాడు మాజీ సీఎం జయలలిత వంటివారే ఇక్కడ ఫామ్ హౌస్ కట్టుకున్నారంటే ఎలాంటి వాతావరణం ఉండేదో తెలిసిపోతుంది. 1990ల మొదట్లో ఇప్పటి మహా రద్దీ ప్రాంతం అమీర్ పేట ఒక సాధారణ ప్రదేశం. కేబీఆర్ పార్క్ కు అతి దగ్గరగా ఉండే ఈ ప్రదేశంలో చలికాలంలో రాత్రయితే ఇక్కడ 10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన సందర్భాలూ ఉన్నాయంటారు. కానీ, ఇప్పుడతంతా తారుమారు. ఎంతటి చలికాలమైనా 17 డిగ్రీలపైనే ఉంటోంది. ఇక వేసవి విషయానికి వస్తే ప్రస్తుత ఎండాకాలంలో చరిత్రలో తొలిసారి అత్యధిక ఉష్ణోగ్రత 43.6 డిగ్రీలు నమోదైంది. వాస్తవానికి కరోనాకు ముందు గ్రేటర్‌లో 2015, 2018, 2019లో పలు మార్లు పగటి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల మార్క్‌ను చేరాయి. అదికూడా సీజన్‌ మొత్తంలో గరిష్ఠంగా ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే. ఇప్పుడు నికరంగా 43 మీద ఉంటోంది.

జనం పెరిగారు.. కాలుష్యం కాటేస్తోంది

హైదరాబాద్ మహా నగరం నుంచి విశ్వ నగరం అవుతోంది. జనాభా ఎప్పుడో కోటి దాటేసింద. 10 లక్షల మంది ఐటీ ఉద్యోగులకు ముఖ్య కేంద్రం. ఇక వలస జీవులు, మధ్య తరగతి ఉద్యోగులకు లెక్కేలేదు. అయితే, ఇదంతా పాజిటివ్ యాంగిల్. కానీ, నగరంలో ప్రమాదకర కాలుష్య పదార్థాలు విపరీతంగా పెరిగిపోయాయని ఓ అధ్యయనం తేల్చింది. దీంతోనే ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయని పేర్కొంది. హైదరాబాద్‌ లోని 80శాతం ప్రాంతం అత్యంత కాలుష్య కారకంగా మారిందని స్పష్టమైంది. దీంతో శ్వాస, ఊపిరితిత్తుల సమస్యలు పెరుగున్నట్లు తేలింది. వాహనాలు, పరిశ్రమలు ఇబ్బడిముబ్బడిగా పెరగడం, పట్టణ ప్రణాళికలో లోపాలే ఈ దుస్థితికి కారణమని స్పష్టమైంది.