Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో రాత్రుల్లు పగులుతున్న అద్దాలు.. ఇవి ఎవరు పనులు?

అవును... బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ లలో రెచ్చిపోతున్న ఆకతాయిలు.. రాళ్లతో దాడి చేసి అద్దాలను ధ్వంసం చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   19 April 2024 7:20 AM GMT
హైదరాబాద్  లో రాత్రుల్లు పగులుతున్న అద్దాలు.. ఇవి ఎవరు పనులు?
X

హైదరాబాద్ లో రాత్రిపూట ఆకతాయిలు రెచ్చిపోతున్నారు! ఇందులో భాగంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాల్లోని వాణిజ్య సముదాయాలే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నారు! ఇందులో భాగంగా... ఆర్కే సినీ ఫ్లెక్స్, వాన్ హుస్సేన్ స్టోర్, అండర్ ఆర్మర్ స్టోర్ తో పాటు పలు వాణిజ్య సముదాయల అద్దాలను పగలగొట్టారు. రాత్రుళ్లు ఒకే సమయంలో ఘటనలు జరుగుతున్నాయని అంటున్నారు.

అవును... బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ లలో రెచ్చిపోతున్న ఆకతాయిలు.. రాళ్లతో దాడి చేసి అద్దాలను ధ్వంసం చేస్తున్నారు. దీంతో కొంతమంది కావాలనే ఈ పనికి పాలపడుతున్నారంటూ దుకాణాల నిర్వాహకులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ సమయంలో పోలీసులకు ఫిర్యాదులు చేశారు. సుమారు నెల రోజులుగా జరుగుతున్న ఈ తతంగంపై పోలీసులు ఒకేసారి కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ సమయంలో నిందితులను గుర్తించేందుకు సీసీ కెమెరాలను జల్లెడపడుతున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలో సుమారు నెలరోజులుగా వరుసగా జరుగుతున్న దాడులను పరిశీలిస్తే... గత నెల 20న రాత్రి 7 గంటల ప్రాంతంలో బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 2లోని బ్రూక్స్‌ బ్రదర్‌ స్టోర్‌ అద్దాలు ఒక్కసారిగా పగిలిపోయాయి. ఆ తర్వాత గంట వ్యవధిలో స్థానిక వాన్‌ హుస్సేన్‌ స్టోర్‌ అద్దాలు వరుసగా పగిలిపోవడం గమనార్హం.

ఇదే సమయంలో ఆ పక్కనే ఉన్న వైట్‌ క్రో స్టోర్‌ అద్దాలు, గాడ్‌ ఫ్రే ఫిలిప్స్‌ 24 సెవన్‌ గ్రాసరీ స్టోర్‌ కు సంబంధించిన అద్దాలు పగిలిపోయి.. గ్లాసు ముక్కలు చిందర వందరగా పడిపోయాయి. ఈ క్రమంలో ఒక వ్యక్తికి స్వల్ప గాయం కూడా అయ్యింది. అది అక్కడితో ఆగలేదు.. ఆ మరుసటి రోజు రాత్రి అదే రోడ్డులోని ఆర్‌ కే సినీప్లెక్స్‌ లోని గ్రౌండ్‌ ఫ్లోర్‌ లో ఉన్న అద్దాలను రాళ్లతో ధ్వంసం చేశారు.

ఈ క్రమంలో ఈ నెల 4న రాత్రి బంజారాహిల్స్‌ లోని అదే రోడ్ నెంబర్ లో గల సూర్య సిల్క్‌ టెక్స్‌ క్రియేషన్‌ స్టోర్‌ అద్దాలు, 5న స్థానిక అండర్‌ ఆర్మర్‌ స్టోర్‌ లోని అద్దలూ ముక్కముక్కలయ్యాయి. ఇలా సుమారు 10కి పైగా ఘటనలు జరిగాయి. దీంతో స్టోర్ మేనేజర్లు బంజారాహిల్స్ లోని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సమయంలో 8 కేసులు నమోదు చేసిన పోలీసులు ఇప్పటికే ఇద్దరు క్యాబ్‌ డ్రైవర్లను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది!