Begin typing your search above and press return to search.

మొన్న ఎకరం రూ.కోటి.. ఇప్పుడు మోకిలా వేలంలో గజం లక్ష

సోమవారం హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రభుత్వ భూముల వేలంలో మరో రికార్డు క్రియేట్ అయ్యింది

By:  Tupaki Desk   |   8 Aug 2023 5:42 AM GMT
మొన్న ఎకరం రూ.కోటి.. ఇప్పుడు మోకిలా వేలంలో గజం లక్ష
X

హైదరాబాద్ మహానగరం ఎక్కడకు వెళుతోంది? రియల్ ఎస్టేట్ ఏమవుతుంది? మహానగరి అన్నతర్వాత సంపన్న.. ధనిక.. మధ్యతరగతి.. పేద.. ఇలా అన్నీ వర్గాల సమూహమే కావాలే తప్పించి.. కేవలం డబ్బున్నోళ్లకే అయితే కష్టం. గడిచిన వారంలో చోటు చేసుకున్న పరిణామాల్ని చూస్తుంటే.. ఎక్కడో ఏదో తేడా కొడుతున్న భావన కలుగక మానదు. మొన్నటికి మొన్న కోకాపేటలో ప్రభుత్వ భూముల్ని వేలం వేయగా.. ఎకరం వంద కోట్ల రూపాయిల్ని దాటేయటం చూసిన వారు ముక్కున వేలేసుకున్నారు. ఇంత భారీ ధరకు భూమి అమ్ముడు కావటమా? అన్నది ప్రశ్నగా మారింది.

ఇదిలా ఉంటే.. సోమవారం హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రభుత్వ భూముల వేలంలో మరో రికార్డు క్రియేట్ అయ్యింది. నగర శివారు.. ఐటీ కారిడార్ కు ఒక పక్కగా ఉండే మోకిలలో గజం భూమి ధర రూ.లక్ష దాటేసిన వైనం షాకింగ్ గా మారింది. టౌన్ షిప్ అన్నది పెద్దగా లేకుండా.. కనుచూపు మేర ఖాళీగా ఉండే భూముల్లో.. గజం భూమి ధర రూ.లక్ష దాటేసిన వైనంతో రియల్ ఎస్టేట్ వర్గాలు సైతం ఉలిక్కిపడుతున్నాయి.

వ్యాపారులకే షాకింగ్ గా మారిన ధరలు.. సామాన్యులకు మరింత ఇబ్బందిగా మారాయి. నగర శివారులోనే గజం భూమి ధర రూ.లక్ష దాటితే పరిస్థితేంటి? అన్నది ప్రశ్నగా మారింది. ఈ ధరల జోరు చూస్తున్నప్పుడు ఇది బలుపా? వాపా? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. మోకిలలో తాజాగా జరిగిన వేలంలో 50 ప్లాట్లను వేలం వేయగా.. మరో రెండు వారాల్లో మరో 200 ప్లాట్లు (ఖాళీ స్థలాలు) వేలం వేయనున్నారు. హైప్ క్రియేట్ చేసేందుకు కొందరు జట్టుగా మారి ఇలా ధరల్ని పెంచేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

తాజా వేలంలో చదరపు గజం గరిష్ఠంగా రూ.1.05 లక్షల ధర పలగ్గా.. కనిష్ఠంగా రూ.72 వేలకు అమ్ముడైంది. సరాసరిన మొత్తం ప్లాట్లకు గజం రూ.80,397కు అమ్ముడైంది. నార్సింగ్ - శంకర్ పల్లి రోడ్డుకు 2 కిలోమీటర్ల దూరంలో ఉండే మోకిలాలో హెచ్ఎండీఏకు 165 ఎకరాల భూమి ఉంది. తొలి విడతలో 15,800 చదరపు గజాల్లోని 50 ప్లాట్లు అమ్మారు. అప్ సెట్ ధర రూ.25వేలుగా నిర్ణయించగా.. నిర్ణయించిన ధరకంటే మూడు.. నాలుగు రెట్లు ఎక్కువ ధరకు అమ్ముడయ్యాయి. మొత్తం 50 ఫ్లాట్లకు రూ.40కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం ఆశిస్తే.. అంతకుమూడు రెట్లు అధికంగా రూ.121.4 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది.

ఇంత భారీ ఎత్తున ధరలు పెరగటం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువంటున్నారు. మహానగరి సంపన్న వర్గాలకు మాత్రమే తప్పించి.. మిగిలిన వారికి బతికే అవకాశం లేని విధంగా మారితే నష్టమంటున్నారు. ఇంతేసి డబ్బులు పెట్టి కొన్న భూముల్లో కట్టే నిర్మాణాలు మరింత ఖరీదుగా మారతాయని.. అదే జరిగితే.. సామాన్య.. మధ్యతరగి.. ఎగువ మధ్యతరగతి వారికి ఇబ్బందికరంగా మారటం ఖాయమంటున్నారు.