Begin typing your search above and press return to search.

హైదరాబాద్ మెట్రో మైలురాయి: 50 కోట్ల మంది ప్రయాణికులు

మొత్తంగా ఐదు దశల్లో 69.2 కిలోమీటర్ల దూరాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.

By:  Tupaki Desk   |   3 May 2024 4:01 AM GMT
హైదరాబాద్ మెట్రో మైలురాయి: 50 కోట్ల మంది ప్రయాణికులు
X

హైదరాబాద్ మెట్రో చారిత్రక మైలురాయిని దాటింది. మెట్రో ప్రారంభమైన ఆరున్నరేళ్ల కాలంలో 50 కోట్ల మంది ప్రయాణాల్ని పూర్తి చేసింది. చారిత్రక మైలురాయిని దాటిన సందర్భంగా కస్టమర్.. గ్రీన్ మైల్ లాయల్టీ క్లబ్ ను శుక్రవారం ప్రారంభించనున్నారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రస్థానాన్ని చూస్తే.. 2017 నవంబరు 29న ప్రారంభించిన మెట్రోలో తొలుత మియాపూర్ నుంచి అమీర్ పేట, అమీర్ పేట - నాగోల్ మార్గాల్లోనే సేవల్ని అందించారు. మొత్తంగా ఐదు దశల్లో 69.2 కిలోమీటర్ల దూరాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.

కారిడార్ 1లో భాగమైన మియాపూర్ - ఎల్బీనగర్ మార్గంలో రోజువారీగా 2.5 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ఇదే స్థాయి రద్దీ నాగోల్ - రాయదుర్గం మార్గంలోనూ ఉంటోంది. కారిడార్ 2 అయిన జేబీఎస్ - ఎంజీబీఎస్ వరకు ఉన్న రూట్ లో సగం మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఈ కారిడార్ కు ఆదరణ తక్కువగా ఉంది. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ఇప్పుడు రోజువారీగా ఐదు లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. అయితే.. వీరిలో 1.5 మంది ప్రయాణికులు ఐటీ ఉద్యోగులేనని చెబుతున్నారు. విద్యార్థుల సంఖ్య మరో 1.2 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నట్లుగా చెబుతున్నారు.

నిజానికి మెట్రో రైళ్లు ఇటీవల కాలంలో కిటకిటలాడుతున్నాయి. అవసరానికి తగిన మెట్రో రైళ్లు అందుబాటులోకి లేని పరిస్థితి. రద్దీకి అనుగుణంగా కొత్త బోగీల్ని పట్టాల మీదకు ఎక్కించని నేపథ్యంలో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే.. ఆపరేషనల్ ఖర్చుల్ని అదుపులోకి ఉంచుకునేందుకు వీలుగా రద్దీకి తగ్గట్లుగా బోగీల్ని పెంచటం లేదన్న విమర్శ ఉంది.

గతంలో కేసీఆర్ ప్రభుత్వం మెట్రో రైళ్ల రద్దీకి అనుగుణంగా అదనపు బోగీలతో నడిపిస్తామని చెప్పినప్పటికీ.. అలాంటిదేమీ జరగలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత మెట్రో రైలు విస్తరణ కార్యక్రమం వేగవంతం చేసింది.

ఎయిర్ పోర్టు మెట్రో ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని.. రికార్డు వ్యవధిలో పూర్తి చేయాలని భావిస్తోంది. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా మెట్రో బోగీల్ని పెంచటం.. కొత్త మార్గాలకు మెట్రోను విస్తరించే అంశం మీద ఫోకస్ చేస్తే.. రానున్న రోజుల్లో మరిన్ని మైలురాళ్లకు అవకాశం ఉందని చెప్పక తప్పదు.