Begin typing your search above and press return to search.

తప్పు ఎవరిది? హైదరాబాద్ లో హిట్ అండ్ రన్.. అమెరికా ఐటీ ఉద్యోగి ఫోటో!

అయ్యో అనిపించే కష్టం.. శత్రువు కూడా ఇలాంటి ఇబ్బంది ఎదురు కాకూడదనే పరిస్థితిని అమెరికాలోని ఒక ఐటీ ఇంజినీర్ ఎదుర్కొంటున్నాడు.

By:  Tupaki Desk   |   26 Jan 2024 5:01 AM GMT
తప్పు ఎవరిది? హైదరాబాద్ లో హిట్ అండ్ రన్.. అమెరికా ఐటీ ఉద్యోగి ఫోటో!
X

అయ్యో అనిపించే కష్టం.. శత్రువు కూడా ఇలాంటి ఇబ్బంది ఎదురు కాకూడదనే పరిస్థితిని అమెరికాలోని ఒక ఐటీ ఇంజినీర్ ఎదుర్కొంటున్నాడు. మూడు రోజుల క్రితం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో మితిమీరిన వేగంతో కారు దూసుకెళ్లి ఒక బౌన్సర్ ప్రాణాల్ని తీసిన వైనం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున అలజడి చెలరేగింది. బాధితుడి కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట డెడ్ బాడీతో ధర్నా చేయటం తెలిసిందే. స్నేహితుడితో బైక్ మీద వెళుతున్న బౌన్సర్ తారక్ రామ్ ను వాయు వేగంతో వెళుతున్న కారు ఢీ కొట్టి వెళ్లిపోవటం తెలిసిందే.

ఈ కేసులో కారు నడిపిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు రుత్విక్ రెడ్డి. అతడితో పాటు మరో నలుగురిని పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ ప్రమాదానికి ప్రధాన కారణమైన వ్యక్తికి సంబంధించిన ఫోటో ఈరోజు మీడియాలో ప్రముఖంగా పబ్లిష్ అయ్యింది. ఈ క్రమంలో పెద్ద తప్పు జరిగింది. ప్రమాదానికి కారణమైన వ్యక్తి కి సంబంధించిన ఫోటోలకు బదులుగా వేరే వ్యక్తి ఫోటోలు మీడియాలో పబ్లిష్ అయ్యాయి.

సదరు వ్యక్తి అమెరికాలో ఐటీ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. తనకు ఏ మాత్రం సంబంధం లేని కేసుకు సంబంధించి తన ఫోటో ప్రముఖంగా పబ్లిష్ కావటంపై సదరు వ్యక్తి (సత్యనారాయణ రెడ్డి) ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న వ్యక్తికి సంబంధించిన ఫోటోలు ఒక సంచలన కేసుకు సంబంధించిన నిందితుడి ఫోటోలుగా పబ్లిష్ కావటం ఎలా జరిగిందన్నది ఇప్పుడు చర్చగా మారింది. మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. పోలీసుల వైపు నుంచి ఈ తప్పు జరిగినట్లుగాతెలుస్తోంది. అయితే.. అసలీ పొరపాటు ఎలా జరిగిందన్న దానిపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. కాకుంటే.. సంబంధం లేని కేసుకు సంబంధించి నిందితుడిగా ఫోటోలు వైరల్ కావటం అమెరికాలోని సత్యనారాయణ రెడ్డిని.. ఇండియాలోని ఆయన కుటుంబ సభ్యుల్ని వేదనకు గురి చేస్తున్నాయి.