Begin typing your search above and press return to search.

భాగ్యన‌గ‌రాన్ని ముంచెత్తిన భారీ వ‌ర్షం.. జ‌నాల బాధ‌లెలా ఉన్నాయంటే!

అత్యంత కీల‌క‌మైన ఐటీ ప్రాంతంగా గుర్తింపు పొందిన బయో డైవర్సిటీ కూడలి, ఖాజాగూడ చౌరస్తా, గచ్చిబౌలి పిస్తా హౌస్‌ల వద్ద ప‌రిస్థితి మ‌రింత దారుణంగా త‌యారైంది.

By:  Tupaki Desk   |   28 Sep 2023 9:56 AM GMT
భాగ్యన‌గ‌రాన్ని ముంచెత్తిన భారీ వ‌ర్షం.. జ‌నాల బాధ‌లెలా ఉన్నాయంటే!
X

భాగ్య‌న‌గ‌రం.. చిన్న చినుకు ప‌డితే చాలు... అభాగ్య న‌గ‌రంగా మారిపోతోంద‌నే కామెంట్లు నెటిజ‌న్ల నుంచి జోరుగా వినిపిస్తున్నాయి. బుధ‌వారం హైద‌రాబాద్ లో ఒక‌వైపు గ‌ణ‌ప‌తి న‌వ‌రాత్రుల ముగింపు వేడుక‌ల కోసం.. న‌గ‌రం మొత్తం హ‌డావుడి మొద‌లైంది. ఇంకో వైపు...అనూహ్యంగా ఆకాశానికి చిల్లు ప‌డిందా అన్న‌ట్టుగా జోరు వ‌ర్షం ముంచెత్తింది. అంతే.. న‌గ‌రంలోని అన్ని ప్రాంతాల్లోనూ మోకాల్లోతు నీళ్లు నిండిపోయాయి.

సుమారు గంట సేపు ఎడ‌తెగ‌కుండా కురిసిన వ‌ర్షం.. హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌కు న‌ర‌కం చూపించింద‌నే చెప్పాలి. ఎక్క‌డిక‌క్క‌డ ట్రాఫిక్ ఆగిపోయింది. మ‌రోవైపు సాహ‌సం చేసి ముందుకు వెళ్లాల‌ని అనుకున్నా.. ఎక్క‌డ నాలా ఉందో.. ఎక్క‌డ రోడ్డుందో కూడా తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. జ‌న‌స‌మ్మ‌ర్థ ప్రాంతాలైన పంజాగుట్ట‌, జూబ్లి హిల్స్‌, బంజారా హిల్స్‌, మెహ‌దీప‌ట్నం, టోలీచౌకి, సోమాజిగూడ‌, మాదాపూర్‌, షేక్‌పేట, ఖాజాగూడ చౌరస్తా, చాదర్‌ఘాట్‌, అమీర్‌పేట ప్రాంతాల్లో ఎటుచూసినా వాహనాలే కనిపించాయి.

మాదాపూర్‌, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ ప్రాంతాల్లో అయితే.. కిలో మీట‌ర్ల కొద్దీ వాహ‌నాలు రోడ్ల మీద‌నే నిలిచిపోయాయి. శిల్పారామం నుంచి సోమాజిగూడ మధ్య దాదాపు 12 కిలోమీటర్ల ప్రయాణానికి 2 గంటలకు పైగానే సమయం పట్ట‌డం, రోడ్లు నిలువెత్తు నీటిలో మునిగిపోవ‌డంతో వాహ‌న చోద‌కులు న‌ర‌కం చ‌విచూశారు. మాదాపూర్‌ నుంచి సైబర్‌ టవర్స్‌, బాటా షోరూం, గచ్చిబౌలి డాగ్స్‌ పార్కు చౌరస్తాలో ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది.

అత్యంత కీల‌క‌మైన ఐటీ ప్రాంతంగా గుర్తింపు పొందిన బయో డైవర్సిటీ కూడలి, ఖాజాగూడ చౌరస్తా, గచ్చిబౌలి పిస్తా హౌస్‌ల వద్ద ప‌రిస్థితి మ‌రింత దారుణంగా త‌యారైంది. ఐటీ ఉద్యోగులు ప‌ని ముగించుకుని ఇంటికి వెళ్లే స‌మ‌యం కావ‌డంతో లక్షలాది వాహనాలు రోడ్ల మీద‌కు చేరాయి. దీంతో కిలోమీటరు ప్రయాణానికి గంటల కొద్దీ సమయం ప‌ట్టిందని నెటిజ‌న్లు నిప్పులు చెరిగారు.

షేక్‌పేట ఓవ‌ర్ బ్రిడ్జిపై నుంచి మెహదీపట్నం వెళ్లే మార్గంలోని బృందావన్‌ కాలనీ దగ్గర బుల్కాపూర్‌ నాలా పొంగి పొర్లింది. దీంతో ఈ మార్గంలో వాహ‌నాలు ఎక్క‌డిక‌క్క‌డే గంట‌ల కొద్దీ నిలిచిపోయాయి. మొత్తంగా బుధ‌వారం కురిసిన భారీ వ‌ర్షం భాగ్య‌న‌గరం ప్ర‌జ‌ల‌కు న‌రకం చూపించింద‌నే చెప్పాలి.