Begin typing your search above and press return to search.

హైదరాబాద్ కు మరకలాంటి మాటను చెప్పిన తాజా నివేదిక!

తాజాగా విడుదలైన నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో నివేదికలో చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించి మొత్తం 19 నగరాల్లో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉండటం ఆందోళన కలిగించే అంశంగా చెప్పాలి.

By:  Tupaki Desk   |   8 Dec 2023 4:30 PM GMT
హైదరాబాద్ కు మరకలాంటి మాటను చెప్పిన తాజా నివేదిక!
X

హైదరాబాద్ మహానగరం అన్నంతనే ఐటీకి కేరాఫ్ అడ్రస్ అని.. గ్లోబల్ సిటీ అని.. మోస్ట్ హ్యాపనింగ్ సిటీ అని.. ఇలా బోలెడన్ని విశేషాలు.. విశేషణాలతో చెబుతుండటం తెలిసిందే. అయితే.. ఈ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బ తీసే అంశం ఒకటి తాజాగా విడుదలైన ఒక రిపోర్టులో పేర్కొన్నారు. దేశంలోని మిగిలిన మహానగరాల్లో పోలిస్తే.. హైదరాబాద్ మహానగరానికి చెందిన వారిలో ఒక పాడు రోగం ఉందన్న విషయం బయటకు వచ్చింది. అదే.. చైల్డ్ పో*ర్నోగ్రఫీ.

తాజాగా విడుదలైన నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో నివేదికలో చైల్డ్ పో*ర్నోగ్రఫీకి సంబంధించి మొత్తం 19 నగరాల్లో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉండటం ఆందోళన కలిగించే అంశంగా చెప్పాలి. గ్లోబల్ సిటీగా పేర్కొంటున్న హైదరాబాద్ లో అత్యదికంగా చైల్డ్ పో*ర్నోగ్రఫీ కేసులు నమోదైన విషయాన్ని తాజాగా విడుదలైన డేటీ స్పష్టం చేస్తోంది. దేశంలోని 19 నగరాల్లో మొత్తం 52 కేసులు నమోదైతే.. అందులో అత్యధికంగా హైదరాబాద్ లోనే 22 కేసులు నమోదు కావటం గమనార్హం.

హైదరాబాద్ తర్వాత జైపూర్ పది కేసులతో రెండో స్థానంలో ఉండగా..ఆరు కేసులతో చెన్నై మూడో స్థానంలో.. నాలుగు కేసులతో బెంగళూరు.. నాలుగు కేసులతో ఫూణె ఐదో స్థానంలో ఉన్నాయి. కొచ్చి(2).. ముంబయి (2).. నాగపూర్ (1).. అహ్మదాబాద్ (1).. ఢిల్లీ (1) నగరాలు ఉన్నాయి. దేశంలోని ఇతర మహానగరాలతో పోలిస్తే.. హైదరాబాద్ లో ఈ దారుణ చేష్ట విస్మయానికి గురి చేస్తోంది. 2021లో చైల్డ్ పో*ర్నోగ్రఫీని వీక్షిస్తున్న 16 మంది మీద కేసులు నమోదు చేయమని అప్పట్లో నేషనల్ క్రైం రికార్డ్ బ్యూరో హైదరాబాద్ పోలీసుల్ని ఆదేశించింది.

మొబైల్.. ల్యాప్ టాప్.. ట్యాబ్.. ఇలా ఏదైనా సరే.. చైల్డ్ పో*ర్నోగ్రఫీని వీక్షించే వారిని.. జాతీయస్థాయిలోని సైబర్ క్రైం పోలీసులు మానిటర్ చేస్తుంటారు. ఇలాంటి విపరీత మనస్తత్వం ఉన్న వారి ఆచూకీని గుర్తించి.. కేసులు బుక్ చేస్తుంటారు. చైల్డ్ పో*ర్నోగ్రఫీ అతి పెద్ద నేరమన్న విషయం చాలామందికి తెలీదు. ఇంటర్నెట్ లో చైల్డ్ పో*ర్నోగ్రఫీని చూసినా.. దాని కోసం వెతికినా అధికారులు చర్యలు తీసుకుంటారు. దీనికి సంబంధించిన హెచ్చరిక ఇప్పటికే వచ్చింది. అయినప్పటికీ కొందరు విపరీత మనస్తత్వం ఉన్న వారు ఇలాంటి పాడు పనులు చేస్తుంటారు. విన్నంతనే వికారం కలిగించే ఈ నేరాలు దేశంలోని మిగిలిన నగరాలతో పోల్చినప్పుడు హైదరాబాద్ ముందుండటం ఆందోళనకు గురి చేసే అంశంగా చెప్పాలి.