హైదరాబాద్ టు అమెరికా లక్షల మంది ప్రయాణిస్తున్నారు కానీ...!
అవును... యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు వరుసగా విమానాలు నడుపుతున్న న్యూ ఢిల్లీ, ముంబై తర్వాత స్థానాల్లో హైదరాబాద్ ఉందని చెబుతున్నారు!
By: Tupaki Desk | 27 July 2025 3:41 PM ISTభారతదేశం నుండి అమెరికాకు అత్యధిక విమాన ట్రాఫిక్ ఉన్న నగరాల్లో హైదరాబాద్ మూడవ స్థానంలో ఉంది. ఈ విషయాన్ని అంతర్జాతీయ వాయు రవాణా సంఘం (ఐఏటీఏ) నుండి సేకరించిన డేటా స్పష్టం చేస్తుంది. ఈ క్రమంలో ఇక్కడ నుంచి వార్షిక విమాన ప్రయాణీకుల సంఖ్య 10 లక్షలకు పైగా ఉందని చెబుతున్నారు. అయినప్పటికీ అమెరికాకు హైదరాబాద్ నుంచి నేరుగా విమానాలు లేవు.
అవును... యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు వరుసగా విమానాలు నడుపుతున్న న్యూఢిల్లీ, ముంబై తర్వాత స్థానాల్లో హైదరాబాద్ ఉందని చెబుతున్నారు! ఇదే సమయంలో.. న్యూఢిల్లీ నుండి అమెరికాకు విమాన ట్రాఫిక్ లో కనీసం 40% రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి అమెరికాకు డైరెక్ట్ ఫ్లైట్స్ అవసరంపై చర్చకు తెరలేచిందని అంటున్నారు!
వాస్తవానికి కరోనా మహమ్మారికంటే ముందు హైదరాబాద్ కు చికాగోతో డైరెక్ట్ కనెక్టివిటీ ఉండేది! అయితే... అనంతరం పరిణామల నేపథ్యంలో ఎయిరిండియా ఈ నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఆ సమయంలో 350 సీట్ల సామర్థ్యం గల విమానాల్లో వారానికి రెండుసార్లు 90% కంటే ఎక్కువ ఆక్యుపేషన్ ఉండేదని చెబుతున్నారు.
ప్రధానంగా... ఇటీవలి సంవత్సరాలలో హైదరాబాద్ లో ఐటీ బూమ్ తో.. శాన్ ఫ్రాన్సిస్కో, బోస్టన్, ఇతర రంగాలకు విపరీతమైన డిమాండ్ ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. ఎయిర్ లైన్ ఆపరేటర్లు దీనిని పరిగణనలోకి తీసుకోవాలని.. ఈ మార్గంలో విమానాలను అత్యవసరంగా ప్రారంభించడం గురించి ఆలోచించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఐఏటీఏ డేటా ప్రకారం... 2019లో హైదరాబాద్ - యుఎస్ మధ్య 8.5 లక్షల మంది ప్రయాణించారు! అయితే కోవిడ్ మహమ్మారి కారణంగా తర్వాత కాలంలో ఈ సంఖ్య సుమారు 3 లక్షలకంటే తక్కువకు పడిపోయింది! అయితే... 2023-24 నాటికి ఆ సంఖ్య 10.2 లక్షలకు చేరుకుంది!
ఈ నేపథ్యంలో విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపార ప్రయాణికులు, అమెరికాలో ఉన్న ఎన్నారైల కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువుల నుంచి ఈ సందర్భంగా... హైదరాబాద్ నుంచి అమెరికాకు డైరెక్ట్ ఫ్లైట్ డిమాండ్ పెరుగుతుందని అంటున్నారు. ఈ నిర్ణయం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు. దీనివల్ల ప్రయాణ సమయము, ప్రయాస తగ్గుతాయని చెబుతున్నారు!
