హై..డర్‌బాద్.. ఊహించని ప్రళయం!
భాగ్యనగరంలో ఊహించని ప్రళయం చోటు చేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం వరకు వాతావరణం అంతా బాగానే ఉంది.
By: Tupaki Desk | 19 April 2025 9:01 AM ISTభాగ్యనగరంలో ఊహించని ప్రళయం చోటు చేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం వరకు వాతావరణం అంతా బాగానే ఉంది. అయితే..అనూహ్యంగా వచ్చిన మార్పుతో హైదరాబాద్ కాస్తా.. హైడర్‌బాద్‌గా మారిపోయింది. ఉద్యోగాలు ముగించుకుని ఇళ్లకు వచ్చేవారు.. పాఠశాలలకు వెళ్లి ఇంటికి తిరిగి చేరుకునే చిన్నారులు మారిన వాతావరణం కారణంగా.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంతేకాదు.. భారీగా వీచిన ప్రళయ గాలులకు.. ఒణికి పోయారు. ఒక్క హైదరాబాద్‌లోనే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాతావరణం ఒక్కసారిగా మారి.. ప్రజలను భయ కంపితులను చేసింది.
హైదరాబాద్‌లో కుంభవృష్టికి తోడు.. చెట్లు ఎక్కడికక్కడ కూలిపోయాయి. మరోవైపు ప్రధాన రహదార్లపై కురిసిన వర్షాలతో మ్యాన్‌హోల్స్ పొంగి పొర్లాయి. రహదారులు.. చెరువులను తలపించాయి. ఎక్కడికక్కడ విరిగి రహదారిపై పడిన చెట్ల కారణంగా ట్రాఫిక్ కిలోమీటర్ల మేర నిలిచిపోయింది. వేసవి కాలం కావడంతో.. ఎలాంటి రక్షణ పరికరాలు లేని ద్విచక్ర వాహన దారులు నిండు కుండలా కురిసిన వర్షంలో అలానే తడుస్తూ ఉండిపోయారు. సోమాజిగూడ, పంజాగుట్ట, అమీర్‌పేట్ , ఖైరతాబాద్‌లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రంగంలోకి దిగిన పోలీసులు ఎక్కడికక్కడ రోడ్లపై పడిన చెట్లు నరికించే పనిని చేపట్టారు.
రాష్ట్ర వ్యాప్తంగా..
రాష్ట్ర వ్యాప్తంగా కూడా.. వాతావరణం మారిపోయి.. ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో చాలా చోట్ల ఆస్తి , ప్రాణ నష్టం కూడా జరిగినట్టు తెలుస్తోంది. సిద్దిపేట, కామారెడ్డి, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్ జిల్లాలలో కుండపోత వర్షం ఉక్కిరి బిక్కిరి చేసింది. ముఖ్యంగా సన్నాలు సాగు చేసి.. పోగులు పెట్టిన రైతులు లబోదిబో మన్నారు. ఇక, సాగు పంటలు నీటమునిగాయి. పలు జిల్లాల్లో పిడుగులు పడి.. మూగ జీవాలు పదుల సంఖ్యలో మృతి చెండాయి. తెలంగాణలోని కొన్ని జిల్లాలలో భారీ వర్షానికి అవకాశం ఉందని.. అప్రమత్తంగా ఉండాలని వాతావరణ విభాగం అంచనా వేసింది.
మంత్రి సమీక్ష..
మరోవైపు హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలు, కురుస్తున్న వర్షాలపై మంత్రిపొన్నం ప్రభాకర్ హుటాహుటిన అధికారులతో సమీక్షించారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ క్లియరెన్స్‌పై దృష్టి పెట్టాలని..లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆయన సూచించారు. మ్యాన్ హోల్స్ ఉన్న చోట పెద్ద పెద్ద జెండాలతో జాగ్రత్తలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.