పనిమనుషుల నియామకంలో నిర్లక్ష్యం తగదు: హైదరాబాద్ పోలీసుల కీలక అడ్వైజరీ!
ఇళ్లు, ఆఫీసులు, దుకాణాల్లో పనిచేసే పని మనుషుల ద్వారా జరుగుతున్న దొంగతనాలు హైదరాబాద్ నగరంలో ఆందోళనకర స్థాయికి చేరుకున్నాయి.
By: Tupaki Desk | 27 July 2026 8:35 AM ISTఇళ్లు, ఆఫీసులు, దుకాణాల్లో పనిచేసే పని మనుషుల ద్వారా జరుగుతున్న దొంగతనాలు హైదరాబాద్ నగరంలో ఆందోళనకర స్థాయికి చేరుకున్నాయి. బిజీ జీవనశైలి, సరైన ముందస్తు తనిఖీలు లేకపోవడం వంటి కారణాల వల్ల నేరగాళ్లకు ఇళ్లు, ఆఫీసులు సులభమైన లక్ష్యాలుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సిటీ పోలీస్ యంత్రాంగం ప్రజలను అప్రమత్తం చేస్తూ కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. నగరంలో గత రెండేళ్ల కాలంలో మొత్తం 565 సర్వెంట్ థెఫ్ట్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 65 గ్రేవ్ కేసులు కాగా, 500 నాన్ గ్రేవ్ కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పని మనుషుల ఎంపికపై జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను అప్రమత్తం చేస్తూ పోలీసులు చేసిన ప్రకటన ఆసక్తికరంగా మారింది.
ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, ఒంటరిగా ఉండే విద్యార్థులు, వృద్ధులే ప్రధాన బాధితులుగా మారుతున్నారు. ఇళ్లు, ఆఫీసులు, దుకాణాల్లో విలువైన వస్తువులను నిర్లక్ష్యంగా బయట పడేసి వెళ్లడాన్ని గమనిస్తున్న కొందరు పనిమనుషులు సమయం చూసి చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఈ చిన్నపాటి అలసత్వమే నేరగాళ్లకు వరంగా మారుతోందని పోలీసులు విశ్లేషిస్తున్నారు. దీంతో నగరంలో పని మనిషులు చేస్తున్న నేరాలు వందల్లో నమోదు అవుతున్నాయి. ప్రధానంగా సంపన్నులు నివసించే ప్రాంతాల్లో ఈ తరహా చోరీలు, ఆ సమయంలో ఎదురవుతున్న పరిణామాలతో హత్యలు వంటి తీవ్ర నేరాలు చోటుచేసుకుంటున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
హైదరాబాద్ నగరంలో గత రెండేళ్లలో జోన్ల వారీగా నమోదైన కేసులను పరిశీలిస్తే.. జూబ్లీహిల్స్ జోన్‌లో అత్యధికంగా 173 కేసులు వెలుగు చూశాయి. సికింద్రాబాద్ జోన్‌లో 88, ఖైరతాబాద్ జోన్‌లో 77, గొల్కొండలో 70, రాజేంద్రనగర్ లో 63, శంషాబాద్ జోన్‌లో 49, చార్మినార్ జోన్‌లో 45 కేసులు నమోదయ్యాయి. ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చి పనిమనుషుల ముసుగులో పథకం ప్రకారం దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాల బారిన పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ప్రజా భద్రతను పటిష్ఠం చేసే క్రమంలో సిటీ పోలీస్ యంత్రాంగం పలు ముఖ్యమైన సూచనలను ప్రజల ముందుకు తెచ్చింది. ఎవరినైనా పనికి కుదుర్చుకునే ముందే వారి ఆధార్ కార్డు లేదా చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు నకలు, తాజా ఫోటో, శాశ్వత చిరునామా, స్వగ్రామం వివరాలు, ఫోన్ నంబర్లు సేకరించాలని సూచిస్తోంది.
ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా నియామకాలు చేసుకునేటప్పుడు, సదరు ఏజెన్సీకి ప్రభుత్వ గుర్తింపు ఉందో లేదో సరిచూసుకోవాలని పోలీసులు స్పష్టం చేశారు. గతంలో వారు ఎక్కడ పనిచేశారో ఆ యజమానులను సంప్రదించి వివరాలు ధ్రువీకరించుకోవాలని పేర్కొంటోంది. నియామకానికి ముందే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఉచితంగా లభించే పోలీస్ వెరిఫికేషన్ చేయించుకోవడం భద్రతా పరంగా శ్రేయస్కరమని కోరుతోంది. పనిలో చేరిన మొదటి 30 రోజుల పాటు వారి అలవాట్లు, కదలికలను నిశితంగా గమనించడం ద్వారా ఎలాంటి అనుమానాస్పద చర్యలనైనా ముందే గుర్తించవచ్చని స్పష్టం చేస్తోంది.
ముఖ్యంగా ఒంటరిగా ఉండే వృద్ధులు, తరచుగా ప్రయాణాలు చేసే కుటుంబాలు మరింత అప్రమత్తంగా ఉంటూ, ఇంట్లోని నగలు, డబ్బు, ప్రయాణ ప్రణాళికల గురించి పనిమనుషుల ముందు చర్చించకుండా జాగ్రత్త పడాలని కోరుతోంది. గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్ రెసిడెంట్ వెల్పేర్ అసోసియేషన్ ప్రతినిధులు సైతం తమ ప్రాంగణాల్లో పనివారికి ఎంట్రీ రిజిస్టర్లు నిర్వహిస్తూ ప్రవేశ పాస్‌లు ఇవ్వాలని, సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా పర్యవేక్షించాలని సూచించింది. నేర రహిత, సురక్షిత హైదరాబాద్ నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యమే అత్యంత కీలకమని పోలీస్ కమిషనర్ విసీ సజ్జనర్ పిలుపునిచ్చారు.
పని మనుషుల దొంగతనాలు పెరుగుతున్న దృష్ట్యా, ముందస్తు పోలీస్ తనిఖీలు లేని వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ పనిలో చేర్చుకోవద్దని సీపీ స్పష్టం చేశారు. పూర్వాపరాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే ఏ నిర్ణయమైనా తీసుకోవాలని సూచించారు. నివాసాలు, ఆఫీస్లు, దుకాణాల్లో ఏమాత్రం అనుమానాస్పదంగా అనిపించినా, తాళం చెవులు పోయినా లేదా పనిమనిషి చెప్పకుండా మాయమైనా ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా పోలీసులను సంప్రదించాలని సీపీ కోరారు.
