జాగ్రత్త: హైదరాబాద్‌లో దారుణ మోసం.. 53 లక్షలు దోపిడీ!
ఈ క్రమంలో వృద్ధుడు తన ఖాతాలోని 53 లక్షల రూపాయలను వారికి బదిలీ చేశారు. అంతే.. ఆ తర్వాత ఫోన్ కట్ అయిది.
By: Tupaki Desk | 5 July 2025 9:49 PM ISTభాగ్య నగరం హైదరాబాద్‌లో ఇటీవల కాలంలో జరిగిన మోసాల్లో ఇది పరాకాష్ట. కొన్నాళ్ల కిందట.. ఓ మహిళను సైబర్ మోసగాడు 5 లక్షల రూపాయలకు టోకరా వేశాడు. ఈ కేసు గురించి అప్పట్లో తీవ్ర చర్చ వచ్చింది. తాజాగా ఓ వృద్ధుడు దాచుకున్న సొమ్మును సైబర్ నేరగాళ్లు దారుణంగా కొట్టేశారు. ఏకంగా 53 లక్షల రూపాయలను వారి ఖాతాల్లోకి బదలాయించుకుని ఎంచక్కా చెక్కేశారు. దీంతో సదరు వృద్ధుడు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
హైదరాబాద్ నడిబొడ్డున నిత్యం ఎంతో సందడిగా ఉండే అమీర్ పేటలో జరిగిన ఈ దారుణం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. 77 ఏళ్ల వృద్ధుడు అమీర్‌పేటలోని ఓ ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారు. గత నెల 18న ఆయనకు ఓ ఫోన్ వచ్చింది. సాధారణ ఫోనేనని భావించిన ఆ వృద్ధుడిని అవతలి వ్యక్తులు.. తాము ఈడీ అధికారులమని పరిచయం చేసుకున్నారు. దీంతో షాక్ కు గురైన పెద్దాయని.. విషయం ఏంటని అడిగారు.
నీమీద మనీ లాండరింగ్ కేసు ఉందని.. నిన్ను డిజిటల్ అరెస్టు చేస్తున్నామని బెదిరించారు. పాపం.. విషయం తెలియని ఆయన.. నిజమేనని అనుకున్నారు. ఆ వెంటనే కూర్చున్న చోట నుంచి లేవద్దన్న ఆదేశాలతో అలానే చేశారు. అరెస్టు వారెంట్ జారీ అయిందని.. బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ చేస్తామని బెదిరించడంతో హడలి పోయారు. అంతేకాదు.. బ్యాంకుల్లో ఉన్న సొమ్మును ఫ్రీజ్ చేస్తున్నామని.. సుప్రీంకోర్టు కూడా తమకు ఆదేశాలు ఇచ్చిందంటూ.. ఫోన్‌లోనే బెదిరించారు.
దీంతో మరింతగాబిక్కచచ్చిపోయిన వృద్ధుడు.. తనను అరెస్టు చేయొద్దని, కేసు పెట్టొద్దని బ్రతిమాలుకు న్నారు. దీంతో మరింత రెచ్చిపోయిన సైబర్ ముఠా ఆయన ఖాతాల్లోని సొమ్మును తమ ఖాతాల్లోకి పంపించేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ క్రమంలో వృద్ధుడు తన ఖాతాలోని 53 లక్షల రూపాయలను వారికి బదిలీ చేశారు. అంతే.. ఆ తర్వాత ఫోన్ కట్ అయిది.
కొన్ని రోజులకు విషయం తెలుసుకున్న ఆయన.. సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదుచేశారు. కానీ, పోయిన నగదు వచ్చే అవకాశం లేదని పోలీసులు చెబుతున్నారు. సో.. ఇప్పటి వరకు హైదరాబాద్‌లో ఇంత పెద్ద మోసం జరగలేదని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు.