Begin typing your search above and press return to search.

అక్కా.. కాస్త హైదరాబాద్ వీడియోలు చూడు! కవితను ఆడేసుకుంటున్న నెటిజన్లు

మంగళవారం కురిసిన వర్షానికి హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌తోపాటు పలు కీలక ప్రాంతాలు చెరువులను తలపించాయి.

By:  Tupaki Political Desk   |   10 Jun 2026 1:21 PM IST
అక్కా.. కాస్త హైదరాబాద్ వీడియోలు చూడు! కవితను ఆడేసుకుంటున్న నెటిజన్లు
X

హైదరాబాద్‌లో నిన్న కురిసిన భారీ వర్షంతో నగరం అతలాకుతలమైంది. రోడ్లన్నీ జలమయం కావడం, డ్రైనేజీలు పొంగిపొర్లడంతో వాహనదారులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే, ఈ వర్షం ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య సోషల్ మీడియా వేదికగా రాజకీయ రచ్చకు దారితీసింది. ముఖ్యంగా టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవితను టార్గెట్ చేస్తూ ఏపీకి చెందిన నెటిజన్లు పెద్ద ఎత్తున ట్రోలింగ్‌కు దిగారు.

వారం క్రితం కవిత కామెంట్స్

వారం రోజుల క్రితం ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘పవన్ కళ్యాణ్ గారూ.. తెలంగాణ గురించి పక్కన పెట్టి, ముందు మీ సెక్రటేరియట్‌లోకి నీళ్లు రాకుండా చూసుకోండి’ అంటూ ఆమె ఎద్దేవా చేశారు. అమరావతి, ఏపీ మౌలిక వసతులపై ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు అప్పట్లో ఏపీ కూటమి శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. సరిగ్గా వారం తిరగక ముందే హైదరాబాద్‌లో సీన్ రివర్స్ కావడంతో ఏపీ నెటిజన్లకు గట్టి ఆయుధం దొరికినట్లయిందని అంటున్నారు.

మీమ్స్, వీడియోల జాతర

మంగళవారం కురిసిన వర్షానికి హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌తోపాటు పలు కీలక ప్రాంతాలు చెరువులను తలపించాయి. ఈ దృశ్యాలను రికార్డ్ చేసిన నెటిజన్లు, కవిత పాత వీడియోలను జత చేస్తూ సోషల్ మీడియాలో మీమ్స్ వరద పారిస్తున్నారు. 'చెరువులా మారిన రోడ్లు' వీడియోలను పోస్టు చేస్తూ కవితను ట్యాగ్ చేస్తున్నారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ పరిసరాల్లో మోకాళ్లోతు నీటిలో కార్లు, బైకులు కొట్టుకుపోతున్న విజువల్స్‌ను షేర్ చేస్తూ.. "గంట వర్షానికే గ్లోబల్ సిటీ పరిస్థితి ఇదీ.. నువ్వు ఏపీ గురించి మాట్లాడతావా అక్కా?" అంటూ నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు.

‘ముందు మీ వెనకాల ఉన్న చెరువును చూసుకోండి కవితమ్మ’ అంటూ హైదరాబాద్ జలమయమైన ఫొటోలను టాగ్ చేస్తూ క్రియేట్ చేసిన మీమ్స్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్నాయి. ‘అక్కకు ఎవరైనా హైదరాబాద్ మునిగిన వీడియోలు చూపించండి’ అనే ట్యాగ్‌లైన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై విపరీతంగా సర్క్యులేట్ అవుతోందని చెబుతున్నారు. ఈ ట్రోలింగ్ కేవలం నెటిజన్లకే పరిమితం కాకుండా, పొలిటికల్ సర్కిల్స్‌లోనూ హాట్ టాపిక్‌గా మారింది. అమరావతిని, ఏపీ ప్రభుత్వాన్ని తక్కువ చేసి మాట్లాడే ప్రయత్నంలో కవిత సెల్ఫ్ గోల్ చేసుకున్నారా? అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ అంతర్జాతీయ నగరం అని చెప్పుకునే నాయకులు, ఇక్కడి డ్రైనేజీ వ్యవస్థను ఎందుకు సరిచేయలేకపోయారంటూ ఏపీ నెటిజన్లు సూటిగా ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి వారం క్రితం కవిత విసిరిన విమర్శల బాణం.. ఇప్పుడు హైదరాబాద్ వర్షం రూపంలో ఆమెకే రివర్స్ లో అటాక్ చేసిందని వ్యాఖ్యానిస్తున్నారు.