Begin typing your search above and press return to search.

చెడిపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులకు జీహెచ్ఎంసీ రివార్డు ప్రోగ్రాం

వినూత్న ప్రోగ్రాంకు తెర తీసింది జీహెచ్ఎంసీ. హైదరాబాద్ మహానగర పరిధిలోని పౌరులు ఎవరైనా సరే.. జీహెచ్ఎంసీ షురూ చేసిన ఈ వినూత్న కార్యక్రమంలో భాగస్వాములు కావొచ్చు.

By:  Garuda Media   |   23 April 2026 10:23 AM IST
చెడిపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులకు జీహెచ్ఎంసీ రివార్డు ప్రోగ్రాం
X

వినూత్న ప్రోగ్రాంకు తెర తీసింది జీహెచ్ఎంసీ. హైదరాబాద్ మహానగర పరిధిలోని పౌరులు ఎవరైనా సరే.. జీహెచ్ఎంసీ షురూ చేసిన ఈ వినూత్న కార్యక్రమంలో భాగస్వాములు కావొచ్చు. ఎలక్ట్రానిక్ వ్యర్థాల నుంచి పర్యావరణాన్ని పరిరక్షించటమే లక్ష్యంగా స్టార్ట్ చేసిన ఈ ప్రోగ్రాం ద్వారా.. రివార్డు అందే ప్రోగ్రాంకు తెర తీశారు.ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలోని పలు మొబైల్ షాపుల్లో డ్రాప్ బాక్సుల్ని ఏర్పాటు చేశారు. ఇందులో పని చేయని మొబైల్ ఫోన్లను వాటిలో వేసి క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే.. రివార్డు పాయింట్లు పొందేలా ఏర్పాట్లు చేసిన వైనం ఆసక్తికరంగా మారింది.ఈ రోజు నుంచి ఈ ప్రోగ్రాం ప్రారంభం కానుంది.

అసలేం చేస్తారు? ఏం చేయాలి?

ఎలక్ట్రానిక్ వ్యర్థాల సేకరణకు జీహెచ్ఎంసీ ఈ ఏడాది ఆరంభంలోనూ ఒక ప్రోగ్రాం చేపట్టారు. ఇందులో భాగంగా పలుచోట్ల ఎలక్ట్రానిక్ వ్యర్థాల్ని కలెక్టు చేసే కేంద్రాల్ని ఏర్పాటు చేసినప్పటికి.. కేవలం 100 టన్నుల వ్యర్థాలను మాత్రమే సేకరించగలిగింది. ఈ సందర్భంగా పలువురు చెడిపోయిన తమ వస్తువుల్ని ఉచితంగా ఎందుకు ఇవ్వాలన్న ప్రశ్న పలువురి నోటి నుంచి వచ్చింది.

అదే పాతసామాన్లు కొనే వారికి ఇస్తే.. ఎంతో కొంత డబ్బు వస్తుంది కదా? అన్న ప్రశ్న తలెత్తింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ కార్యక్రమానికి కొత్త తరహా ఎత్తుగడతో మళ్లీ ప్రజల ముందుకు తీసుకొచ్చారు. ఈ విధానంలో పాడైన ఎలక్ట్రికల్ వస్తువును జీహెచ్ఎంసీకి అందిస్తే.. రివార్డు పాయింట్లు జమ అయ్యే విధానాన్ని తీసుకొచ్చారు. మొబైల్ షాపుల్లో ఏర్పాటు చేసే డ్రాప్ బాక్సుల్లో మొబైళ్లు వేసి.. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయటం ద్వారా రివార్డు పాయింట్లు పొందొచ్చు. అందుకు భిన్నంగా ఫ్రిజ్.. ఏసీ.. టీవీ..ఇలాంటి పెద్ద వస్తువులను ఇవ్వాలనుకుంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అడ్రెస్ చెబితే.. ఎర్త్ సైన్స్.. రీసైట్రొనిక్స.. ప్యూర్ ఎర్త్.. జెడ్ ఎన్విరో.. గ్రీన్ ఎన్విరో లాంటి సంస్థల సిబ్బందే నేరుగా ఇంటికి వచ్చి పికప్ చేసేలా తాజా కార్యక్రమంలో మార్పు చేశారు.

క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి.. వివరాలు నమోదు చేస్తే.. అటు రివార్డు పాయింట్లతో పాటు..ఇటు జీహెచ్ఎంసీ సిబ్బంది వాటిని సేకరిస్తారు. ఇక.. రివార్డు పాయింట్లను ప్రస్తుతం అయితే స్వయం సహాయక సంఘాలు.. స్వచ్ఛంద సంస్థలు తయారుచేసిన వస్తువులు కొనుగోలు చేసే సమయంలో పాయింట్లను ఖర్చు చేసే ఏర్పాటు చేశారు.రానున్న రోజుల్లో ఈ రివార్డు పాయింట్లను.. ఎలక్ట్రానిక్ షాపుల్లోనూ ఖర్చు చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

దీనికి సంబంధించినే విధివిధానాల రూపకల్పనతో పాటు.. వివిధ వ్యాపార సంస్థల్ని తమతో భాగస్వామ్యం అయ్యేలా అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రస్తుతానికి 30చోట్ల డ్రాప్ బాక్సుల్ని ఏర్పాటు చేశారు. మొత్తంగా ఒక మంచి కార్యక్రమానికి జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టిందని చెప్పాలి. అయితే.. ఈ తరహా కార్యక్రమాల్ని హైదరాబాద్ మహానగర పరిధిలోని సైబరాబాద్ నగరపాలక సంస్థ.. మల్కాజిగిరి నగర పాలక సంస్థలు సైతం అందిపుచ్చుకుంటే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.