Begin typing your search above and press return to search.

కొండాపూర్ పబ్ లో డ్రగ్స్ గబ్బు.. ఈసారి 8 మందికి పాజిటివ్

డ్రగ్స్ పరీక్షల్లో పాజిటివ్ గా తేలిన వారిపై ఎన్డీపీఎస్ యాక్టు కింద కేసులు నమోదు చేశారు. అలానే నిబంధనలు ఉల్లంఘించిన పబ్ యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకోనున్నట్లు చెబుతున్నారు.

By:  Garuda Media   |   4 April 2026 12:27 AM IST
కొండాపూర్ పబ్ లో డ్రగ్స్ గబ్బు.. ఈసారి 8 మందికి పాజిటివ్
X

హైదరాబాద్ మహానగరంలో మరోసారి డ్రగ్స్ దందా బహిర్గతమైంది. హైదరాబాద్ ఐటీ కారిడార్ లో అత్యంత కీలకమైన కొండాపూర్ లో ఒక పబ్ లో డ్రగ్స్ వినియోగంపై అందిన పక్కా సమాచారంతో ఈగిల్ టీం తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా మొత్తం 64 మందికి పరీక్షలు జరపగా.. అందులో ఎనిమిది మందికి పాజిటివ్ వచ్చినట్లుగ తేలింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని క్వాక్ అరీనా పబ్ పై ఈగిల్ పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున ఆకస్మిక తనిఖీలు నిర్వహిచారు. పబ్ లో డ్రగ్స్ వినియోగం జరుగుతుందన్న పక్కా సమాచారంతో మెరుపు తనిఖీలు చేపట్టారు.

తనిఖీలు జరిపిన సమయంలో పబ్ లో ‘బ్లాక్ కాఫీ’ పేరుతో ఒక మ్యూజిక్ ఈవెంట్ జరుగుతోంది. ఈ ఈవెంట్ కోసం విదేశాలకు చెందిన ఒక అంతర్జాతీయ డీజేను రప్పించినట్లు చెబుతున్నారు. ఇక్కడే మరో ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించాలి. సాధారణంగా హైదరాబాద్ మహానగరంలోని ఏ పబ్ అయినా సోమవారం నుంచి శుక్రవారం వరకు అర్థరాత్రి 12 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచాలి. శని.. ఆదివారాల్లో మాత్రం అర్థరాత్రి ఒంటి గంట వరకు తెరిచే వీలుంది. తాజాగా ఈగిల్ టీం తనిఖీలు నిర్వహించే వేళ అర్థరాత్రి ఒంటి గంట నుంచి మూడు గంటల మధ్యలో జరిగినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక వివరాల్ని పోలీసులు వెల్లడించలేదు.

ఈ తనిఖీల్లో ప్రముఖ నటి హేమ పట్టుబడ్డారంటూ కొన్ని చానళ్లు హడావుడి చేయగా.. తాను డ్రగ్స్ తీసుకోలేదని.. తాను పబ్ కు వెళ్లిన మాట వాస్తవమేనని.. తాను డ్రగ్స్ సేవించలేదని.. తనకు యూరిన్ టెస్టు చేశారని.. అందులో నెగిటివ్ టెస్టు వచ్చిందని చెబుతూ.. దానికి సంబంధించిన రిజల్ట్ స్క్రిప్ ను చూపించారు. తాను శనివారం కూడా మరోసారి టెస్టు చేయించుకొని తాను తప్పు చేయలేదన్న విషయాన్ని మరోసారి నిరూపించుకుంటానని చెప్పటం గమనార్హం.

డ్రగ్స్ పరీక్షల్లో పాజిటివ్ గా తేలిన వారిపై ఎన్డీపీఎస్ యాక్టు కింద కేసులు నమోదు చేశారు. అలానే నిబంధనలు ఉల్లంఘించిన పబ్ యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకోనున్నట్లు చెబుతున్నారు. పాజిటివ్ వచ్చిన ఎనిమిది మందిలో ఏపీకి చెందిన ఒక మహిళా ఐఏఎస్ అధికారి కొడుకు ఉన్నట్లుగా చెబుతున్నా.. పోలీసులు ఆ విషయాన్ని ఇప్పటివరకు అధికారికంగా ధ్రువీకరించలేదు. ఇక్కడే ఇంకో విషయాన్ని చెప్పాలి. ఇదే పబ్ లో గత ఏడాది డిసెంబరు 2025లోనూ తనిఖీలు జరపటం.. అప్పుడు కూడా ఎనిమిది మంది డ్రగ్స్ సేవించినట్లుగా పోలీసులు వెల్లడించారు. తాజా తనిఖీలకు సంబంధించిన వివరాల్ని మాత్రం వెల్లడించలేదు.

డ్రగ్స్ పరీక్షలో పాజిటివ్ వచ్చినట్లుగా తేలిన వారు గంజాయితో పాటు బెంజోడియాజిపైన్ లాంటి మత్తుపదార్థాల్ని సేవించినట్లుగా చెబుతున్నారు. గతంలో ఈ పబ్ లో డ్రగ్స్ వినియోగం జరిగిన సమయంలోనూ కఠిన చర్యలు తీసుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. తాజా పరిణామాల్లో లైసెన్సు రద్దు చేసే వీలుందన్న మాట వినిపిస్తోంది. ఇంతకూ ఈ పబ్ ఎవరిది? దీని యజమాని ఎవరు? అన్న దానిపై అధికారిక సమాచారం లేకున్నా.. పోలీసు వర్గాలనుంచి అందుతున్న అనధికారిక సమాచారం ప్రకారం రాజా శ్రీకర్ పబ్ వ్యవస్థాపకుడిగా చెబుతున్నారు. కునాల్ కుక్రేజా మరో వ్యవస్థాపక భాగస్వామిగా పేర్కొంటున్నారు. వీరితో పాటు రాకేష్ గుప్తా.. చాణక్య రెడ్డి.. అభినవ్.. సాయి క్రిష్ణ.. సన్నీ లాంటి వారు కూడా భాగస్వాములుగా చెబుతున్నారు. ఈ వివరాలకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.