Begin typing your search above and press return to search.

పూజ కోసం పూజారికి రూ.10 పంపి రూ 5.99 లక్షలు దోచేశారు!

తాజాగా హైదరాబాద్ లోని ఒక పూజారిని ‘పూజ’ పేరుతో దారుణంగా మోసం చేసిన వైనం వింటే షాక్ కు గురి కావాల్సిందే.

By:  Garuda Media   |   25 Aug 2025 4:32 PM IST
పూజ కోసం పూజారికి రూ.10 పంపి రూ 5.99 లక్షలు దోచేశారు!
X

ఇవాళ చేసింది రేపు చేయకపోవటం. సీజన్ కు తగ్గట్లు.. ట్రెండ్ కు సూట్ అయ్యే కాన్సెప్టులతో మోసం చేసే విషయంలో సైబర్ నేరగాళ్ల తర్వాతే ఎవరైనా. ఎప్పటికప్పుడు కొత్త తరహాలో మోసం చేసే వారు.. తాజాగా హైదరాబాద్ లోని ఒక పూజారిని ‘పూజ’ పేరుతో దారుణంగా మోసం చేసిన వైనం వింటే షాక్ కు గురి కావాల్సిందే. హైదరాబాద్ లోని పాతబస్తీకి చెందిన పురానాపూల్ పూజారిని సైబర్ నేరస్తులు ఎలా ట్రాప్ చేశారన్నది చూస్తే..

సికింద్రాబాద్ మిలిటరీ ఆఫీసు నుంచి తాము ఫోన్ చేస్తున్నట్లుగా పూజారికి గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేశారు. కల్నల్ సారు ఆరోగ్యం బాగోలేదని.. ఆయన కోసం పూజలు చేయాలని కోరారు. మొత్తం 11 రోజుల పూజ కోసం 21 మంది పురోహితుల అవసరం ఉందని పేర్కొన్నారు. పూజల కోసం అడ్వాన్స్ కింద రూ.3 లక్షలు చెల్లిస్తామని ఎర వేశారు వీరి ట్రాప్ గురించి తెలియని పురోహితుడు.. వారి మాటల్ని పూర్తిగా నమ్మేశారు

అడ్వాన్సుగా రూ.10 పంపిన సైబర్ నేరగాళ్లు.. వీడియో కాల్ చేసి మిగిలిన డబ్బులు పంపుతామని నమ్మించారు. కార్డు.. పిన్ వివరాల్ని సేకరించి.. పురోహితుడు పంపిన సమాచారంతో ఆయన అకౌంట్ నుంచి విడతల వారీగా రూ.5.99 లక్షలు దోచేశారు. తాను దారుణంగా మోసపోయిన వైనాన్ని గుర్తించి వెంటనే 1930కి కాల్ చేసి సమాచారాన్ని ఇచ్చారు. అనంతరం హైదరాబాద్ సీసీఎస్ కు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏ చిన్న అవకాశం లభించినా దోచేందుకు సిద్ధంగా ఉన్న సైబర్ నేరగాళ్ల విషయంలో అందరూ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం తాజా ఉదంతం చెప్పకనే చెప్పేస్తుందని చెప్పాలి.