హైదరాబాద్ స్పా మసాజ్ సెంటర్లపై కొరఢా
హైదరాబాద్ నగరంలోని స్పా మసాజ్ సెంటర్లపై సైబరాబాద్ పోలీసులు కొరడా ఝుళిపించారు.
By: Tupaki Desk | 5 July 2025 11:49 AM ISTహైదరాబాద్ నగరంలోని స్పా మసాజ్ సెంటర్లపై సైబరాబాద్ పోలీసులు కొరడా ఝుళిపించారు. ఇటీవల స్పాల పేరుతో పెరిగిపోతున్న అనైతిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు కఠిన నిబంధనలను విధించారు. ప్రజల భద్రత, ముఖ్యంగా మహిళల రక్షణను దృష్టిలో ఉంచుకొని ఈ కీలక నిర్ణయం తీసుకున్నామని అధికారులు వెల్లడించారు. కొత్త నిబంధనల ప్రకారం.., ఇకపై స్పా సెంటర్లు ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు మాత్రమే పనిచేయాలి. ఈ సమయాలకు విరుద్ధంగా కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు స్పష్టం చేశారు.
స్పా సెంటర్ల నిర్వహణ విషయంలో పోలీసులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నివాస ప్రాంతాల్లో (రెసిడెన్షియల్ ఏరియాలు) స్పా సెంటర్లను నిర్వహించరాదు. వ్యాపార ప్రాంతాల్లో మాత్రమే వీటిని నడపాల్సి ఉంటుందని పేర్కొన్నారు. స్పాల్లో పనిచేసే ఉద్యోగులకు అర్హతలు తప్పనిసరి అని పోలీసులు నొక్కి చెప్పారు. ఫిజియోథెరపిస్టులు, అకుప్రెషర్ నిపుణులు వంటి అర్హతలతో ఉన్నవారే స్పాల్లో పనిచేయాలని సూచించారు. స్పాల పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు దారితీయకూడదని హెచ్చరించారు.
- పత్రాలు, సమాచార ప్రదర్శన తప్పనిసరి:
పారదర్శకతను పెంచేందుకు ప్రతి స్పాలో వారి లైసెన్స్ నంబర్, ఫీజు రకాలు, కేంద్రం పేరు వంటి వివరాలను స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలి. అంతేకాకుండా, ప్రతి కస్టమర్ వివరాలు, ఉద్యోగుల పూర్తి వివరాలతో కూడిన రిజిస్టర్‌ను తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు.
- సీసీటీవీ కెమెరాలు తప్పనిసరి:
అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించి, మహిళలు, పిల్లల భద్రతను కాపాడేందుకు స్పాల ప్రధాన ద్వారం, రెసెప్షన్, ఇతర సాధారణ ప్రదేశాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు (CCTV) ఉండాలని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.
-మానవ అక్రమ రవాణాపై కఠిన చర్యలు:
ఈ కొత్త మార్గదర్శకాలు ప్రధానంగా మానవ అక్రమ రవాణా (హ్యూమన్ ట్రాఫికింగ్) నివారణకు.. మహిళల రక్షణకు తీసుకొచ్చినవని పోలీసులు తెలిపారు. స్పాల పేరుతో జరిగే అసాంఘిక చర్యలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతామని స్పష్టం చేశారు. ఇటీవల పోర్న్ వీక్షణను నేరంగా ప్రకటించిన ప్రభుత్వం, ప్రజల మధ్య వాయురూఢమైన దృష్టికోణాలను తగ్గించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. లైంగిక వేధింపుల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, పోలీసులు ఈ చర్యలతో శృంగార ప్రేరణతో వ్యవహరిస్తున్న స్పాలపై కఠినంగా వ్యవహరించబోతున్నారని స్పష్టంగా తెలియజేశారు.
మొత్తం మీద "స్పా" పేరుతో జరిగే చీకటి చట్టాలకు చెక్ పెట్టేందుకు ఈ 9 AM – 9 PM నియమాలు పోలీసు విభాగం నుంచి సానుకూల స్పందనను పొందుతున్నాయి. ఈ చర్యలు హైదరాబాద్‌లో ప్రజల భద్రతకు దోహదపడతాయని ఆశిస్తున్నారు.