చలానా కోసం పోలీసు ఆరాటం.. కింద పడిన వాహనదారుడిపై ఆర్టీసీ బస్సు!
ట్రాఫిక్ నియంత్రణ కంటే చలానాలు వడ్డించేందుకే ఎక్కువ ఆసక్తిని ప్రదర్శించే హైదరాబాద్ నగర పోలీసుల తీరుకు ఒక ప్రాణం బలైంది.
By: Tupaki Desk | 14 April 2025 9:01 AM ISTట్రాఫిక్ నియంత్రణ కంటే చలానాలు వడ్డించేందుకే ఎక్కువ ఆసక్తిని ప్రదర్శించే హైదరాబాద్ నగర పోలీసుల తీరుకు ఒక ప్రాణం బలైంది. పోలీసులు నిర్వహిస్తున్న తనిఖీల్లో భాగంగా ఒక వాహనదారుడ్ని ఆపేందుకు పోలీసులు ప్రయత్నించటం.. వారి నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నించిన ద్విచక్ర వాహనదారులు తన ప్రాణాల్ని పోగొట్టుకున్న దురద్రష్టకర సంఘటన బాలానగర్ లో చోటు చేసుకుంది. షాకింగ్ గా మారిన ఈ ఉదంతాన్ని చూసిన ప్రత్యక్ష సాక్ష్యులు తీవ్రఆగ్రహానికి గురి కావటమే కాదు.. పోలీసులతో పెద్ద ఎత్తున వాగ్వాదానికి దిగటంతో పరిస్థితి ఆందోళనకరంగా మారిది.
బాలానగర్ ట్రాఫిక్ పోలీసులు ఆదివారం తనిఖీల్ని నిర్వహించారు. ఈ క్రమంలో టూవీలర్ మీద వెళుతున్న ఒక వ్యక్తిని ఆపేందుకు ప్రయత్నించారు. అతను తప్పించుకొని వెళ్లే ప్రయత్నం చేయగా.. వెంట పడిన పోలీసులు అతడ్ని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అదుపు తప్పిన వాహనం కారణంగా ద్విచక్ర వాహనదారులు కిండ పడిపోయాడు.
అదే సమయంలో వచ్చిన ఆర్టీసీ బస్సు అతడి తల మీద నుంచి వెళ్లిపోవటంతో సదరు వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే సదరు వ్యక్తి మరణించారంటూ స్థానిక ప్రజలు సీరియస్ అయ్యారు. పోలీసుల తీరుకు నిరసనగా వాహనదారులు ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో.. జీడిమెట్ల నుంచి బాలానగర్ మార్గంలో తీవ్రమైన ట్రాఫిక్ జాం అయ్యింది.
పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు పోలీసులు లాఠీలకు పని చెప్పటంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. చలానాలు వేయొద్దని చెప్పట్లేదు కానీ.. మరీ ఇంతలా వెంటపడి.. వేటాడాల్సిన అవసరం ఏమిటి? అన్నది ప్రశ్న. ఇప్పుడున్న టెక్నాలజీలో అలా తప్పించుకునే వాహనదారుడి వాహన నెంబరును ట్రేస్ చేసి నోటీసులు పంపొచ్చు. కానీ.. ఆవేశంతో పోలీసులు చేసే చేష్టలకు పోయిన ప్రాణం ఏం చేసినా.. ఎంత చలానా కట్టినా వెనక్కి రాదు కదా?
