సైబర్ నేరాలకు సహకరించింది బ్యాంకు సిబ్బందే.. దేశ వ్యాప్తంగా హైదరాబాద్ పోలీసుల ఆపరేషన్ లో సంచలన నిజాలు..
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాలతో 16 ప్రత్యేక బృందాలు ఈ భారీ ఆపరేషన్‌లో నిర్వహించాయి.
By: Tupaki Political Desk | 20 April 2026 10:45 AM ISTకంచె చేనుమేసే సామెత గుర్తుంది కదా.. చేనును కాపాల్సిన కంచె మొత్తం చేనును కబలించిన తీరు జరిగిన ఒక ఘటన దేశంలో చర్చకు దారి తీసింది. ఆర్థిక వ్యవస్థను కొల్లగొట్టాలని భావించిన కొందరు వ్యక్తులు.. ఆర్థిక వ్యవస్థకు మూలమైన బ్యాంకుల్లో ఉద్యోగులుగా చేరి సైబర్ మోసగాళ్లతో కుమ్మక్కై జనం డబ్బును పక్కదారి పట్టించేందుకు సహకరించారు. డబ్బులు దాచుకునే బ్యాంకుల అధికారులే సైబర్ నేరగాళ్లతో చేతులు కలపడం అనేది అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయం. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారే మోసాలకు సహకరించడం సామాన్య ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తోంది. హైదరాబాద్ పోలీసులు చేపట్టిన ఈ ‘ఆపరేషన్ ఆక్టోపస్ - 2.0’తో సంచలన విషయాలు వెలుగు చూశాయి.
150 కోట్ల కుంభకోణం!
సైబర్ నేరగాళ్లు మన కళ్లకు కనిపించకుండా దోచుకుంటుంటే, వారికి తెరవెనుక ఉండి మార్గం సుగమం చేస్తున్నది ఎవరో తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దేశవ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాల్లో నిర్వహించిన మెరుపు సోదాల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సామాన్యుల ఖాతాలను రక్షించాల్సిన బ్యాంకు అధికారులే, కేవలం కమీషన్ల కోసం నేరగాళ్లకు ‘రెడ్ కార్పెట్’ పరిచారని ఈ ఆపరేషన్ నిరూపించింది.
ఆపరేషన్ ఆక్టోపస్ - 2.0లో 52 మంది అరెస్టు
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాలతో 16 ప్రత్యేక బృందాలు ఈ భారీ ఆపరేషన్‌లో నిర్వహించాయి. మొత్తం 52 మందిని అరెస్టు చేయగా, వారిలో 32 మంది బ్యాంకు అధికారులు ఉండడం ఈ కేసులోని తీవ్రతను చాటిచెబుతోంది. ఈ కుంభకోణం కేవలం హైదరాబాద్‌కో లేదంటే తెలంగాణకో పరిమితం కాలేదు. అస్సాం నుంచి గుజరాత్ వరకు, ఢిల్లీ నుంచి కర్ణాటక వరకు 9 రాష్ట్రాల్లో ఈ మూలాలు విస్తరించి ఉన్నాయి.
మోసానికి ‘మూలస్తంభం’
సైబర్ నేరగాళ్లకు అత్యంత అవసరమైనది ‘మనీ ట్రయల్’ దొరక్కుండా ఉండేలా చూసుకోవడం. ఇక్కడే బ్యాంకర్లు వారికి సహాయం చేశారు. కేవైసీ నిబంధనలను తుంగలో తొక్కి, తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో లేదంటే అమాయకుల పేర్లతో 'మ్యూల్ అకౌంట్స్' తెరిచారు. భారీ మొత్తంలో డబ్బు ఖాతాల్లోకి వచ్చి వెంటనే బదిలీ అవుతున్నా, అనుమానాస్పద లావాదేవీల నివేదికలను పై అధికారులకు పంపకుండా నేరగాళ్లను కాపాడారు. డిజిటల్ అరెస్ట్ అయిన వారిలో ఎక్కువ మంది వాణిజ్య, ప్రైవేట్ బ్యాంకులకు చెందిన వారే. వీరు నేరగాళ్లకు లీడ్స్ ఇవ్వడం, లేదంటే బాధితుల నుంచి వచ్చిన డబ్బును వెంటనే 'క్రిప్టో' రూపంలోకి మార్చేందుకు సహకరించేవారని విచారణలో తేలింది.
850 కేసులు!
దర్యాప్తులో తేలిన గణాంకాలు చూస్తుంటే ఈ ముఠా ఎంతటి ప్రమాదకరమో అర్థం చేసుకోవచ్చు. నేరస్థులు సుమారు 350 బ్యాంకు ఖాతాలను అక్రమంగా నిర్వహించారు. ఈ ఖాతాలకు దేశవ్యాప్తంగా నమోదైన 850కి పైగా సైబర్ కేసులతో సంబంధం ఉంది. ఇప్పటి వరకు ఈ నెట్‌వర్క్ ద్వారా దాదాపు రూ. 150 కోట్ల మేర మోసాలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. బాధితుల నుంచి వచ్చిన డబ్బును ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు మెరుపు వేగంతో మళ్లిస్తూ.., చివరికి విదేశాల్లో ఉన్న ప్రధాన సూత్రధారులకు చేరవేసేవారు.
ఈ కేసులో 15 మంది 'మ్యూల్ కస్టమర్లను' కూడా పోలీసులు పట్టుకున్నారు. వీరు తమ బ్యాంకు ఖాతాలను, ఏటీఎం కార్డులను, పాస్‌వర్డ్‌లను సైబర్ నేరగాళ్లకు అద్దెకు ఇస్తుంటారు. ప్రతి నెలా కొంత డబ్బుకు ఆశపడి తమ ఖాతాలను నేరాలకు అప్పగించడం ద్వారా వీరు కూడా శిక్షార్హులని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
హైదరాబాద్ పోలీసులు చేపట్టిన ఈ ఆపరేషన్ సైబర్ నేరగాళ్ల వెన్నులో వణుకు పుట్టించింది. ‘బ్యాంకు ఖాతా లేకుండా సైబర్ నేరం చేయడం అసాధ్యం’ అనే సూత్రాన్ని పోలీసులు బలంగా నమ్ముతున్నారు. అందుకే నేరుగా బ్యాంకర్లపైనే ఫోకస్ పెట్టి వ్యవస్థలో ఉన్న లోపాలను ఎత్తి చూపారు. బ్యాంకులు తమ సిబ్బంది ప్రవర్తనపై నిరంతర నిఘా ఉంచాలని, ముఖ్యంగా కార్పొరేట్, బల్క్ అకౌంట్స్ విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఈ ఘటన హెచ్చరిస్తోంది.
