ఇన్ స్టా పరిచయం.. ఫారిన్ నుంచి హైదరాబాద్ కు వచ్చి మోసపోయింది
ఇదిలా ఉండగా హైదరాబాద్ లోని బాచుపల్లికి చెందిన ఇంటీరియర్ డిజైనర్ చందు అనే యువకుడు పరిచయమయ్యాడు. అది కాస్తా ప్రేమగా మారింది.
By: Garuda Media | 2 July 2026 12:38 PM ISTసోషల్ మీడియా పరిచయం.. అది కాస్తా ప్రేమగా మారటం.. పెళ్లి వరకు వెళ్లటం.. కొన్ని సక్సెస్ స్టోరీలు ఉండొచ్చు కానీ ఆన్ లైన్ ప్రేమలకు సంబంధించి చూస్తే.. మోసాలే ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఎలాంటి పరిచయం లేని అపరిచితుడ్ని ఆన్ లైన్ లో నమ్మటం.. స్నేహం చేయటం.. అతడి మీద నమ్మకంతో అతడి వద్దకు వచ్చి మోసపోయిన ఉదంతాలెన్నో. తాజాగా హైదరాబాద్ లో చోటు చేసుకున్న ఉదంతం గురించి తెలిస్తే నోట మాట రాదంతే.
ఖమ్మం జిల్లాకు చెందిన యువతి విదేశాల్లో వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. ఆమెకు తండ్రి లేడు. తల్లే అన్నీ తానై అన్నట్లు వ్యవహరిస్తూ ఆమెను చదివిస్తోంది. ఇదిలా ఉండగా హైదరాబాద్ లోని బాచుపల్లికి చెందిన ఇంటీరియర్ డిజైనర్ చందు అనే యువకుడు పరిచయమయ్యాడు. అది కాస్తా ప్రేమగా మారింది. అతడి మాటల్ని నమ్మిన ఆ యువతి ఇంట్లో వారికి చెప్పకుండా విదేశాల నుంచి హైదరాబాద్ కు వచ్చేసింది.
అనంతరం చందును తన స్నేహితుడిగా పేర్కొంటూ తల్లికి పరిచయం చేసింది. కొత్త వ్యాపారం చేద్దామని మాయమాటలు చెప్పిన ఆ యువకుడు ఆమెను నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేశాడు. అతడ్ని నమ్మిన ఆ యువతి తల్లి వద్ద నుంచి రూ.34 లక్షలు ఇచ్చింది. త్వరలో పెళ్లి చేసుకుంటామన్న ఉద్దేశంతో అమీర్ పేట హోటల్ లో ఉన్న అతడి వద్దకు వెళ్లింది. ఆ సమయంలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఎలాంటి సమాచారం లేకుండా విదేశాల నుంచి రావటం.. స్నేహితుడికి రూ.34 లక్షలు అప్పుగా ఇప్పించటంతో అనుమానించిన తల్లి ఆమెపై ఒత్తిడి చేయసాగింది. ఇదే క్రమంలో చందు వద్ద పెళ్లి గురించి పదే పదే బాధితురాలు అడగటంతో అతను ముఖం చాటేశాడు. ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వకపోవటం.. పెళ్లి పేరుతో చేసిన మోసాన్ని గుర్తించిన ఆ యువతి పోలీసుల్ని ఆశ్రయించారు. ఇదే క్రమంలో మరో షాకింగ్ నిజం వెలుగు చూసింది. సదరు యువకుడికి అప్పటికే పెళ్లైందన్న షాకింగ్ నిజాన్ని తెలుసుకుంది. దీంతో.. అతను చేసిన మోసాన్ని నిలదీసే ప్రయత్నం చేయగా.. ఆమెపై దాడికి పాల్పడి.. బెదిరింపులకు దిగాడు. దీంతో పంజాగుట్ట పోలీసుల్ని బాధిత యువతి ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు చందును అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఆన్ లైన్ పరిచయాల విషయంలో అప్రమత్తంగా ఉండకుండా పక్కాగా మోసపోవటం ఖాయమన్న మాట పోలీసుల నోట వినిపిస్తోంది
