Begin typing your search above and press return to search.

250 సీసీటీవీలు, 100 మంది అనుమానితులు.. చివరకు యువతి చెప్పిందంతా అబద్ధమేనట

వివరాల్లోకి వెళితే.. మార్చి 23న కొంపల్లి సమీపంలోని రైలు బ్రిడ్జి వద్ద తీవ్ర గాయాలతో పడి ఉన్న యువతిని స్థానికులు గుర్తించారు.

By:  Tupaki Desk   |   18 April 2025 5:53 PM IST
250 సీసీటీవీలు, 100 మంది అనుమానితులు.. చివరకు యువతి చెప్పిందంతా అబద్ధమేనట
X

కొన్ని రోజుల కిందట హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైలులో జరిగినట్లుగా భావించిన అత్యాచార యత్నం కేసులో ఊహించని ట్విస్ట్ ఎదురైంది. బాధితురాలు చెప్పిన కథ అబద్ధమని తేలడంతో పోలీసులు సైతం షాక్ తిన్నారు. రైలు నుండి దూకడానికి అసలు కారణం వేరే ఉందని పోలీసుల విచారణలో స్పష్టం అయింది. మొదట బాధితురాలిగా చెప్పబడిన యువతి, పోలీసుల విచారణలో అసలు నిజం వెల్లడించడంతో అంతా అవాక్కయ్యారు.

పోలీసుల వివరాల ప్రకారం.. ఆ యువతి రైలులో ప్రయాణిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తూ ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడిపోయింది. అయితే ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే పరువుపోతుందని భయంతో తనపై ఒక యువకుడు అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడని, తన నుంచి తప్పించుకునే ప్రయత్నంలోనే తాను రైలు నుంచి దూకేశానని అబద్ధం చెప్పింది.

దీంతో ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు అని కోణాల్లోనూ విచారణ జరిపారు. చివరకు ఆ యువతే పోలీసుల ఎదుట నిజం ఒప్పుకోవడంతో అంతా కంగుతిన్నారు. మొదట అత్యాచార యత్నం జరిగిందని నమ్మిన పోలీసులు, అసలు విషయం తెలుసుకుని అవాక్కయ్యారు.

వివరాల్లోకి వెళితే.. మార్చి 23న కొంపల్లి సమీపంలోని రైలు బ్రిడ్జి వద్ద తీవ్ర గాయాలతో పడి ఉన్న యువతిని స్థానికులు గుర్తించారు. తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే స్పందించి ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స తర్వాత కోలుకున్న యువతిని పోలీసులు ప్రశ్నించగా, తనది అనంతపురం జిల్లా అని మేడ్చల్‌లోని ఒక ప్రైవేట్ సంస్థలో జాబ్ చేస్తున్నట్లు తెలిపింది.

మార్చి 23న మొబైల్ ఫోన్ రిపేర్ నిమిత్తం సికింద్రాబాద్ వెళ్లి తిరిగి మేడ్చల్ కు ఎంఎంటీఎస్ రైలులో బయలు దేరినట్లు తెలిపింది. సికింద్రాబాద్ స్టేషన్‌లో మహిళల కోచ్‌లో ఎక్కిన తర్వాత, అల్వాల్‌లో మరో ఇద్దరు మహిళలు దిగిపోగా, తాను ఒంటరిగా ఉండడం చూసి ఒక యువకుడు తనపై అత్యాచారయత్నానికి ప్రయత్నించినట్లు ఆమె పోలీసులకు చెప్పింది. ఆ యువకుడి నుంచి తప్పించుకోవడానికి గట్టిగా కేకలు వేసినా ఎవరూ లేకపోవడంతో తప్పని పరిస్థితుల్లో రైలు నుంచి దూకానని కథ అల్లింది.

ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. అయితే, ఆ యువతి నిందితుడిని గుర్తుపట్టలేనని చెప్పింది. తాను ఎక్కిన స్టేషన్ మాత్రం చెప్పగలనంటూ కేసును మరింత క్లిష్టంగా మార్చింది. దీంతో పోలీసులు 250 సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. 100 మంది అనుమానితులను ప్రశ్నించారు. చివరకు ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారించినా ఆమె చెప్పిన కథకు పొంతన కుదరలేదు. దీంతో పోలీసులు తమ స్టైల్లో విచారణ జరుపగా అసలు నిజం ఒప్పుకుంది. బాధ్యతారాహిత్యంగా సోషల్ మీడియా పిచ్చిలో ఇలా చేయడం వల్ల ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో ఈ ఘటన తెలుపుతుంది.