అమీ తుమీ.. బీజేపీ వర్సెస్ ఎంఐఎం!
హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి.. రంగం రెడీ అయిపోయింది. ఎవరెవరు బరిలో ఉన్నారన్నది కూడా స్పష్టత వచ్చేసింది.
By: Tupaki Desk | 6 April 2025 7:00 AM ISTహైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి.. రంగం రెడీ అయిపోయింది. ఎవరెవరు బరిలో ఉన్నారన్నది కూడా స్పష్టత వచ్చేసింది. నామినేషన్ల ఘట్టం పూర్తి కావడంతో ఎంఐఎం, బీజేపీలు బరిలో పోరాడేందుకు సిద్ధమయ్యాయని స్పష్టమైంది. బీజేపీ తరఫున గౌతమ్ రావు, ఎంఐఎం తరఫున మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండి బరిలో తలపడుతున్నారు. ఇక, బీఆర్ ఎస్‌కు పోటీ చేయాలని ఉన్నప్పటికీ.. ఎంఐఎం ఈ సీటును కోరినట్టు తెలుస్తోంది.
మరోవైపు.. అధికార పార్టీ కాంగ్రెస్‌కు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌లో పెద్దగా సీట్లు లేవు. దీంతో ఆ పార్టీ దూరంగా ఉండిపోయింది. దీంతో ఎంఐఎం, బీజేపీల మద్యే తీవ్ర పోరాటం జరగనుంది. ఇక, ఈ నెల 25న జరగనున్న పోలింగ్‌లో హైదరాబాద్ పరిధిలోని 81 మంది కార్పొరేటర్‌లు, 29 మంది ఎక్స్‌అఫిషియో సభ్యులు మొత్తంగా 112 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రస్తుతం బీజేపీ, ఎంఐఎంల అభ్యర్థులతో పాటు.. మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కూడా.. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచారు.
అయితే.. స్వతంత్రులను బుజ్జగించే అవకాశం ఉందని తెలుస్తోంది. చివరకు ఎంఐఎం, బీజేపీల మధ్యే పోరాటం సాగనుంది. బీజేపీకి 44 మంది కార్పొరేటర్ల మద్దతు ఉంది. బీఆర్ ఎస్‌కు ఉన్న సభ్యులుతమకు అనుకూలంగా వేస్తారని ఎంఐఎం ఆశలు పెట్టుకుంది. దీంతో ఇరు పక్షాల మధ్య పోటీ తీవ్రంగా సాగే అవకాశం కనిపిస్తోంది. ఎవరు విజయం దక్కించుకున్నా.. తక్కువ, స్వల్ప సంఖ్యలో మెజారిటీతోనే విజయం దక్కించుకునేందుకు అవకాశం కనిపిస్తోంది.
వక్ఫ్ ప్రభావం?
ఎంఐఎం ఫోకస్ అంతా.. ఇప్పుడు వక్ఫ్ బిల్లుపైనే ఉంది. పార్లమెంటులో తాజాగా ఆమోదం పొందిన ఈ సవరణ బిల్లుతో మైనారిటీలకు పెను ముప్పు ఉందని.. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ చెబుతున్న విష యం తెలిసిందే. ఈ నేపథ్యంలో వక్ఫ్ బిల్లుపై ఆయన ప్రచారం చేసేందుకు అవకాశం కనిపిస్తోంది. కార్పొరేషన్‌లోనూ ముస్లిం మైనారిటీ ఓట్లు ఎక్కువగా ఉండడంతో .. బీజేపీకి అనుకూలంగా ఉండే పరిస్థితి ఉండదని.. అవసరమైతే.. క్రాస్ ఓటింగ్ జరిగినా జరగొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
