పోరాడి ఓడిన `హైదరాబాద్` బీజేపీ.. ఆ పార్టీ నేతలూ.. ఓటేయలేదు!
హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ లో బీజేపీ పోరాడి ఓడింది.
By: Tupaki Desk | 25 April 2025 3:56 PM ISTహైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ లో బీజేపీ పోరాడి ఓడింది. అదే సమయంలో చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేసి.. ముందు నుంచి చాలా భరోసాతో ఉన్న ఎంఐఎం.. సునాయాసంగా విజయం దక్కించుకుంది. అయితే.. బీజేపీకి అనుకూలంగా మొత్తం 28 ఓట్లు పడాల్సి ఉండగా.. కేవలం 25 మాత్రమే పడ్డాయి. అయితే.. వీరిలోనూ.. ముగ్గురు సొంత పార్టీ నాయకుడికి ఓటేయలేదని తెలుస్తోంది.
గత బుధవారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తంగా.. 112 మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకున్నారు. వీరిలో 31 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఇతర ఎక్స్ అఫిషియో సభ్యులు ఉన్నారు. వీరిలోనూ ఒక్క బీజేపీకి చెందిన వారే ఆరుగురు ఉన్నారు. మిగిలిన 22 మంది బీజేపీ కార్పొరేటర్లతో కలుపుకుంటే.. ఆ పార్టీ తరఫున ఎమ్మెల్సీగా బరిలో నిలిచిన గౌతం రావుకు 28 ఓట్లు గ్యారెంటీగా వచ్చి తీరాలి.
కానీ.. శుక్రవారం ఉదయం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో గౌతం రావుకు కేవలం 25 ఓట్లు మాత్రమే పడ్డాయి. అంటే.. మరో మూడు ఓట్లు పడలేదు. వీరిలో రాజాసింగ్ ఓటేయలేదని భావిస్తున్నారు. ఇక, మరో ఇద్దరు ఎవరు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇక, ఫలితాల ప్రకారం చూసుకుంటే.. ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హాసన్ కు మొత్తం 112 ఓట్లలో 63 ఓట్లు ఆయన సొంతమయ్యాయి.
అయితే.. బీఆర్ ఎస్ కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులు ఏడుగురు కూడా పోలింగ్‌కు దూరంగా ఉన్నారు. మిగిలిన వారిలో కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా.. కొందరు పోలింగ్‌కు హాజరు కాలేదు. ఈ పరిణామాలతో ఓటింగ్ శాతం తగ్గినా.. బీజేపీకి పడాల్సిన ఓట్లు కూడా.. పడకపోగా.. 3 ఓట్లు తగ్గడం.. కమలం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
