ప్రభుత్వ ఆధ్వర్యంలోకి హైదరాబాద్ మెట్రో.. నెట్టింట ఇంట్రెస్టింగ్ కామెంట్స్
వచ్చే నెల నుంచి తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో హైదరాబాద్ మెట్రో పనిచేస్తుందని కథనాలు వస్తున్నాయి.
By: Tupaki Political Desk | 25 Feb 2026 12:00 AM ISTహైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)లో నిర్వహిస్తున్న మెట్రోను ఇక పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఫేజ్-2 పనులు సక్రమంగా సాగాలంటే ఫేజ్-1 ప్రాజెక్టును ప్రైవేటు నిర్వహణ నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్న నిపుణుల సూచనలతో ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. వచ్చేనెల నుంచి తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో హైదరాబాద్ మెట్రో పనిచేస్తుందని కథనాలు వస్తున్నాయి.
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలను ప్రస్తుతం ఎల్ అండ్ టీ సంస్థ చూస్తోంది. ఆ సంస్థకు చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించి మెట్రో రైలు ప్రాజెక్టును ప్రభుత్వ అజమాయిషీలోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెలలో డబ్బు చెల్లించి మార్చి నుంచి ప్రభుత్వ నిర్వహణలోకి తీసుకువచ్చేలా అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు. మెట్రోను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకునేందుకు అవసరమైన నిధులను ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం రుణంగా సేకరిస్తున్నట్లు చెబుతున్నారు. మరో మూడు రోజుల్లో రుణ ప్రక్రియ పూర్తవుతుందని కూడా వ్యాఖ్యానిస్తున్నారు.
కాగా, మెట్రో రైలు ఆపరేషన్స్ చూస్తున్న కియోలిస్ సంస్థ కాలపరిమితి ఈ ఏడాది నవంబరు 27 వరకు ఉందని అంటున్నారు. స్వాధీన ప్రక్రియ తర్వాత మరో ఏడాది పాటు కియోలిన్ సంస్థకే ఆపరేషన్స్ బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోందని అంటున్నారు. మెట్రో రైలు స్వాధీనం కోసం ప్రభుత్వం ఇప్పటికే కార్యదర్శుల కమిటీని నియమించినట్లు చెబుతున్నారు. ఈ కమిటీ సూచన మేరకు రెండో దశ ప్రాజెక్టు కోసం తొలి దశను స్వాధీనం చేసుకోడానికి ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం. పెరుగుతున్న నగర జనాభా, విస్తరణకు అనుగుణంగా మెట్రో రైలు సర్వీసులు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెబుతున్నారు.
ఫేజ్-1 ఎల్ అండ్ టీ యాజమాన్యంలో ఉంటే ఫేజ్ - 2 ప్రాజెక్టు పట్టాలెక్కడం కష్టమని అధికారులు భావించారు. రెండు ప్రాజెక్టులు ఉంటే ఆదాయం పంచుకునే విషయంలో తేడాలు వచ్చే అవకాశం ఉందన్న కారణంగా ఒకే సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ మెట్రో ఉండాలని అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. కాగా, మెట్రో నిర్వహణ బాధ్యతలు ప్రభుత్వం తీసుకుంటుందన్న ప్రచారంపై నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. మెట్రోలో కూడా రిజర్వేషన్లు అమలు చేస్తారా? అంటూ సరదా వ్యాఖ్యనాలను జోడిస్తున్నారు. ఈ కొత్త ప్రయోగంతో మెట్రో భవిష్యత్ ఏమవుతుందోనంటూ మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. మొత్తానికి హైదరాబాద్ మెట్రో పబ్లిక్ ప్రాపర్టీగా మారడంపై నెట్టింట ఆసక్తికర చర్చ జరుగుతోంది.
