గంజాయి కేసులో సంచలన విషయాలు.. ఇంజనీరింగ్, మెడికల్ విద్యార్థులే టార్గెట్
గంజాయి విక్రయించి ఏడాది కాలంలోనే జరీనా కోటిన్నర రూపాయలను సంపాదించినట్లు అధికారులు చెబుతున్నారు.
By: Tupaki Desk | 8 Aug 2025 8:01 PM ISTహైదరాబాద్ మెడిసిటీ మెడికల్ కాలేజీ గంజాయి కేసులో షాకింగ్ విషయాలు వెలుగుచూస్తున్నాయి. మూడేళ్లుగా ఆ కళాశాలకు చెందిన వందల మంది విద్యార్థులు గంజాయి సేవిస్తున్నట్లు ఈగల్ దర్యాప్తు బృందం విచారణలో వెల్లడైంది. నగరంలోని ఇంజనీరింగ్, మెడికల్ విద్యార్థులే లక్ష్యంగా పక్క రాష్ట్రం నుంచి గంజాయి తీసుకువస్తున్నారని గుర్తించారు. కొందరు మెడికోలు మూడేళ్లుగా నిత్యం గంజాయి సేవిస్తున్నారని, 32 మంది గంజాయికి పూర్తిగా బానిసలు అయ్యారని ఈగల్ అధికారులు చెబుతున్నారు.
గంజాయికి అలవాటు పడిన విద్యార్థులు ప్రతి రోజు క్యాంపస్ నుంచి సికింద్రాబాద్ వస్తున్నారని, సీనియర్లే జూనియర్లను ఈ ఊబిలోకి దించుతున్నారని ఈగల్ అధికారులు తెలిపారు. జూనియర్లకు గంజాయి అలవాటు చేసి వారితో సీనియర్లు తెప్పించుకుంటున్నారని చెబుతున్నారు. ఇక గంజాయి మాఫియా ను పక్క రాష్ట్రంలోని బీదర్ నుంచి నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. బీదర్ కు చెందిన జరీనా నుంచి గంజాయి తీసుకువస్తున్న అరాఫత్ స్థానికంగా విక్రయిస్తున్నట్లు వెల్లడైంది. ఈ కేసులో జరీనాను పోలీసులు అరెస్టు చేశారు.
గంజాయి విక్రయించి ఏడాది కాలంలోనే జరీనా కోటిన్నర రూపాయలను సంపాదించినట్లు అధికారులు చెబుతున్నారు. హైదరాబాదులో జరీనాకు 51 మంది సభ్యుల ముఠా ఉన్నట్లు గుర్తించారు. ఈ 51 మందిని డ్రగ్ పెడ్డర్లగా నియమించుకొని గంజాయి దందా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులను టార్గెట్ చేసుకుని ఈ దందా నడుపుతుండటంతో ఈగల్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి కింగ్ పిన్ జరీనాను అదుపులోకి తీసుకున్నా, ఇంకా కొందరు విద్యార్థులు, డ్రగ్ పెడ్లర్లను అదుపులోకి తీసుకోవాల్సివుందని అంటున్నారు.
