Begin typing your search above and press return to search.

నెలకు రూ.32 వేల జీతం.. రూ.459 కోట్ల సంపాదన

నెలకు రూ.32 వేల జీతంతో పనిచేసే యువకుడు రూ.459 కోట్లను సంపాదించగలడా? ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాకపోవచ్చు. కానీ, ఏపీ లిక్కర్ స్కాంలో కీలక వ్యక్తిగా భావిస్తున్న హైదరాబాదీ మాత్రం ఐదేళ్లలో రూ.459 కోట్లు పోగేసినట్లు సిట్ గుర్తించినట్లు కథనాలు వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   23 May 2025 3:43 PM IST
నెలకు రూ.32 వేల జీతం.. రూ.459 కోట్ల సంపాదన
X

నెలకు రూ.32 వేల జీతంతో పనిచేసే యువకుడు రూ.459 కోట్లను సంపాదించగలడా? ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాకపోవచ్చు. కానీ, ఏపీ లిక్కర్ స్కాంలో కీలక వ్యక్తిగా భావిస్తున్న హైదరాబాదీ మాత్రం ఐదేళ్లలో రూ.459 కోట్లు పోగేసినట్లు సిట్ గుర్తించినట్లు కథనాలు వస్తున్నాయి. స్కాంలో కీలక పాత్ర పోషించిన అతడిని విచారించేందుకు పోలీసులు వెళ్లగా అప్పటికే ఆ యువకుడు పారిపోయినట్లు చెబుతున్నారు. లిక్కర్ స్కాంలో ఇప్పటికే ఎన్నో రకాల దందాలు వెలుగుచూశాయి. తాజాగా తెరపైకి వచ్చిన ఈ కోణంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.

హైదరాబాద్ నగరానికి చెందిన వరుణ్ కుమార్ అనే యువకుడిని అడ్డుపెట్టుకుని లిక్కర్ స్కాంలో వందల కోట్లు అక్రమంగా ఆర్జించినట్లు తాజాగా వెలుగుచూసింది. పత్రికల్లో వస్తున్న కథనాల ప్రకారం ఓ కాఫీ షాపులో నెలకు రూ.32 వేల వేతనానికి పనిచేసిన వరుణ్ గత ప్రభుత్వం అధికారంలో ఉండగా, ఓ డిస్టలరీ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా ఉద్యోగంలో చేరినట్లు చెబుతున్నారు. ఆ తర్వాత ఆ డిస్టలరీకి ఏపీ ఇన్ చార్జిగా మారి ఐదేళ్లలో వందల కోట్లు కొల్లిగొట్టినట్లు సిట్ దర్యాప్తులో తేలిందని ప్రచారం జరుగుతోంది. ఐదేళ్లలో వరుణ్ పేరిట రూ.459 కోట్లు లావాదేవీలు జరగగా, అందులో ఎక్కువ మొత్తం అప్పటి ప్రభుత్వ పెద్దలకు ముట్టిందని అనుమానిస్తున్నారు.

స్కాం వెలుగులోకి వచ్చిన తర్వాత వరుణ్ విదేశాలకు పారిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. 2016లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన వరుణ్ ఉద్యోగాణ్వేషణలో చతికిలపడి బంజారాహిల్స్ లోని ఒక కాఫీ షాపులో రూ.32 వేల జీతానికి చిరుద్యోగంలో చేరినట్లు చెబుతున్నారు. అమెరికాలో స్థిరపడిన డాక్టర్ రమేశ్ రెడ్డి అనే ఎన్ఆర్ఐ 2019 ఎన్నికల ముందు హైదరాబాద్ వచ్చినప్పుడు వరుణ్ పరిచయమయ్యాడని అంటున్నారు. రమేశ్ రెడ్డి పరిచయంతో తాను అమెరికా వెళ్లవచ్చని వరుణ్ భావించగా, ఎన్నికల తర్వాత ఓ రోజు రమేశ్ రెడ్డి నుంచి అనూహ్యంగా ఫోన్ వచ్చినట్లు చెబుతున్నారు. ఒక మద్యం కంపెనీలో మద్యం ఉద్యోగం ఉందని, వెంటనే ఢిల్లీ రావాలంటూ డాక్టర్ రమేశ్ సూచించినట్లు చెబుతున్నారు. అలా ఢిల్లీ వెళ్లిన వరుణ్ పాండిచ్చేరిలో మద్యం ఉత్పత్తి చేసే లీలా డిస్టలరీలో ఉద్యోగానికి కుదిరాడు. అప్పటికే వైసీపీ ప్రభుత్వం కొలువుదీరడం, లీలా డిస్టలరీస్ ను ఆ పార్టీకి చెందిన వ్యక్తులు కొందరు స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు.

మరోవైపు రమేశ్ రెడ్డి ద్వారా లీలా డిస్టలరీస్ సంస్థలో ఉద్యోగంలో చేరిన వరుణ్ ను ఆ కంపెనీ ఏపీ ఇన్చార్జిగా నియమించినట్లు చెబుతున్నారు. అంతేకాకుండా వరుణ్ ద్వారా వందల కోట్ల విలువైన మద్యం విక్రయాలు చేయించారని అంటున్నారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్ లోని ఆఫీసు తెరచి, మద్యం ఉత్పత్తి నుంచి రిటైల్ విక్రయాల వరకు మద్యం మాఫియా అన్నీ తమ చేతుల్లోకి తీసుకున్నట్లు సిట్ దర్యాప్తులో తేలింది. వరుణ్ పర్యవేక్షణలో ఉన్న డిస్టలరీ ద్వారా వందల కోట్ల మద్యం వ్యాపారం చేసి ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి ద్వారా వరుణ్ కమీషన్ చెల్లించినట్లు సిట్ పోలీసులు చెబుతున్నారు. మద్యం స్కాంపై ప్రభుత్వం దర్యాప్తు మొదలుపెట్టిన వెంటనే వరుణ్ విదేశాలకు పారిపోయాడు. తొలుత అతడు అమెరికా వెళ్లి ఉంటాడని పోలీసులు అనుమానించినా, సాంకేతిక అంశాల ఆధారంగా దర్యాప్తు చేయగా ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నాడని గుర్తించారు. దీంతో వరుణ్ ను రాష్ట్రానికి రప్పించేందుకు సిట్ అధికారులు హైరానా పడుతున్నారు. అతడిని అదుపులోకి తీసుకుంటే స్కాంపై మరింత స్పష్టత వస్తుందని అంటున్నారు.