Begin typing your search above and press return to search.

మా నాన్నపై ఎల్లో మీడియా అసత్య ప్రచారం చేస్తోంది: బొల్ల గిరిబాబు

రాజకీయ ప్రయోజనాలు.. వ్యక్తిగత కక్షలతోనే తమ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని ‘ఎల్లో మీడియా’ నిరాధారమైన ఆరోపణలు గుప్పిస్తోందని ఆయన మండిపడ్డారు.

By:  A.N.Kumar   |   4 Jun 2026 11:02 AM IST
మా నాన్నపై ఎల్లో మీడియా అసత్య ప్రచారం చేస్తోంది: బొల్ల గిరిబాబు
X

ఇటీవల హైదరాబాద్ నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన ఒక భూ వివాదం వ్యవహారంలో తన తండ్రి, ప్రముఖ నేత బొల్ల బ్రహ్మనాయుడుపై కొన్ని మీడియా సంస్థలు కావాలనే బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని ఆయన కుమారుడు బొల్ల గిరిబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ ప్రయోజనాలు.. వ్యక్తిగత కక్షలతోనే తమ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని ‘ఎల్లో మీడియా’ నిరాధారమైన ఆరోపణలు గుప్పిస్తోందని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ వాస్తవాలను వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న వారి తీరును తీవ్రంగా ఖండించారు.

ఆ భూ వివాదంతో మా తండ్రికి ఎలాంటి సంబంధం లేదు

హైదరాబాద్‌లో వివాదాస్పదంగా మారిన సదరు భూమితోగానీ, అక్కడ జరిగిన లావాదేవీలతోగానీ తన తండ్రి బొల్ల బ్రహ్మనాయుడుకు ఎలాంటి ప్రత్యక్ష లేదా పరోక్ష సంబంధం లేదని గిరిబాబు స్పష్టం చేశారు. "నిజానిజాలు పూర్తిగా తెలుసుకోకుండా కనీస బాధ్యత లేకుండా కొన్ని మీడియా సంస్థలు ఏకపక్షంగా కథనాలను ప్రసారం చేయడం అత్యంత బాధాకరం. రాజకీయంగా మా తండ్రి ఎదుగుదలను ఓర్వలేకనే కొందరు కుట్రపూరితంగా ఈ తప్పుడు ప్రచారానికి తెరలేపారు " అని గిరిబాబు ఆరోపించారు.

మోసాన్ని వెలుగులోకి తెచ్చింది మేమే..!

ఈ వివాదానికి సంబంధించిన అసలు నేపథ్యాన్ని గిరిబాబు ఈ సందర్భంగా మీడియాకు వివరించారు. తమ కుటుంబానికి చెందిన కొందరు బంధువులు సదరు భూమిని కొనుగోలు చేయాలని భావించిన తరుణంలోనే అసలు మోసం బయటపడిందని ఆయన వెల్లడించారు. భూమి కొనుగోలు ప్రక్రియలో భాగంగా దానికి సంబంధించిన డాక్యుమెంట్లను నిశితంగా పరిశీలించినప్పుడు భారీ అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. పత్రాలలో మోసం జరిగినట్లు నిర్ధారణకు వచ్చిన వెంటనే, పూర్తి వివరాలు ఆధారాలను సేకరించి బాధ్యతాయుతంగా సంబంధిత ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ల్యాండ్ మాఫియా లేదా మోసగాళ్ల గుట్టును రట్టు చేయడంలో తమ కుటుంబ సభ్యులే కీలక పాత్ర పోషించారని ఆయన స్పష్టం చేశారు.

బాధితులనే నిందితులుగా చిత్రీకరిస్తున్నారు

అక్రమాలను గుర్తించి వాటిని చట్టానికి పట్టిచ్చిన తమ కుటుంబంపైనే ఇప్పుడు తిప్పి కొట్టే ప్రయత్నం చేయడం దుర్మార్గమని గిరిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మోసాన్ని బయటపెట్టినందుకు గానూ కొందరు అక్రమార్కులు, వారికి కొమ్ముకాస్తున్న మీడియా సంస్థలు కలిసి తమపై బురదజల్లుతున్నాయని ధ్వజమెత్తారు. నిజాయితీగా వ్యవహరించిన వారినే నిందితులుగా చూపేలా కథనాలు అల్లడం వెనుక పెద్ద రాజకీయ కుట్ర దాగి ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

చట్టపరమైన చర్యలకు వెనుకాడం : గిరిబాబు హెచ్చరిక

నిజాలు ఎల్లకాలం దాగి ఉండవని త్వరలోనే పూర్తి వాస్తవాలు ప్రజల ముందుకు వస్తాయని బొల్ల గిరిబాబు ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై చట్టపరమైన విచారణ జరుగుతోందని.. ఆ విచారణలో అన్ని అంశాలు నిష్పక్షపాతంగా బయటకు వస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా ఎల్లో మీడియా సాగిస్తున్న ఈ అసత్య ప్రచారాలను, నిరాధార ఆరోపణలను ప్రజలు ఎవరూ నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం తమ కుటుంబ ప్రతిష్ఠకు, గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్న వారిపై అసత్యాలు ప్రచారం చేస్తున్న వారిపై అవసరమైతే కోర్టు ద్వారా కఠినమైన చట్టపరమైన , క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని గిరిబాబు స్పష్టం చేశారు.