Begin typing your search above and press return to search.

హైడ్రా బాధితులకు ‘డబుల్’ ఊరట.. జూలై 19 కట్-ఆఫ్!

భాగ్యనగరంలోని చెరువుల పునరుద్ధరణలో భాగంగా ఇళ్లు కోల్పోయిన పేదల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మానవీయమైనది.

By:  Tupaki Desk   |   2 May 2026 1:58 PM IST
హైడ్రా బాధితులకు ‘డబుల్’ ఊరట.. జూలై 19 కట్-ఆఫ్!
X

భాగ్యనగరంలోని చెరువుల పునరుద్ధరణలో భాగంగా ఇళ్లు కోల్పోయిన పేదల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మానవీయమైనది. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతూనే, పేదలకు అన్యాయం జరగకూడదన్న సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

గ్రేటర్ హైదరాబాద్ చెరువుల పునరుద్ధరణ పనుల వల్ల నివాసం కోల్పోయిన పేద కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న క్రమంలో ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు డబుల్ ఇళ్లను అందించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ నిర్ణయంపై సామాన్యుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. పేదలకు అండగా ఉంటూనే, కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలన్నది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం.

టెక్నాలజీతో పారదర్శకత

అర్హులను గుర్తించడంలో అవకతవకలు జరగకుండా హైడ్రా అత్యాధునిక సాంకేతికతను వాడుతోంది. జూలై 19, 2024 కు ముందు చెరువు పరిసరాల్లో నివాసం ఉన్న వారిని శాటిలైట్ చిత్రాలు, గూగుల్ మ్యాప్స్, తదితరాల ఆధారంగా గుర్తిస్తున్నారు. పేదల పేరుతో చేసే దుష్ప్రచారానికి తావు లేకుండా, పక్కా ఆధారాలతో అర్హత కలిగిన పేద కుటుంబాల జాబితా సిద్ధం చేస్తున్నారు. కేవలం డిజిటల్ ఆధారాలే కాకుండా, క్షేత్రస్థాయిలో సర్వేలు కూడా నిర్వహించి లబ్ధిదారులకు గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

బాధితులతో ముఖాముఖి

ఇటీవల హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మాదాపూర్‌లోని సున్నం చెరువు, రామంతపూర్ చెరువు బాధితులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నల్గొండ, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ వంటి జిల్లాల నుంచి వలస వచ్చిన కార్మికులు, చెత్త ఏరే వారు తమ బాధలను కమిషనర్‌కు వివరించారు. బాధితులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్న కమిషనర్, అర్హులైన ప్రతి ఒక్కరికీ శాశ్వత నివాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

హైడ్రా పనితీరుకు ప్రశంసలు

హైదరాబాద్‌లో చెరువులను కబ్జాల నుంచి విముక్తి చేసి, వేల ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడడంలో హైడ్రా విజయవంతమైంది. చెరువుల పునరుద్ధరణలో హైడ్రా తీసుకుంటున్న విధానాలను చెన్నై అధికారులు ప్రశంసించడం విశేషం. కబ్జాదారులపై కఠినంగా వ్యవహరిస్తూనే, నిజమైన పేదలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఈ చర్యల ద్వారా స్పష్టం అవుతోంది.

హైడ్రా చర్యలు కేవలం కూల్చివేతలకు మాత్రమే పరిమితం కాకుండా.., పేదల పునరావాసంపై దృష్టి సారించడం అభినందనీయం. అభివృద్ధి పేరిట పేదలను రోడ్డున పడేయకుండా, వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ద్వారా శాశ్వత గూడు కల్పించడం ప్రభుత్వ చిత్తశుద్ధిని చాటుతోంది. ఒకవైపు చెరువులను కాపాడుకుంటూనే, మరోవైపు పేదలకు అండగా నిలవడం భాగ్యనగర భవిష్యత్తుకు శుభసూచకం.