చెంబు పేరు చెప్పి కోటిన్నర కొట్టేశారు.. మోసపోయిన డాక్టరమ్మ!
మోసాలు పలు రకాలనే సంగతి తెలిసిందే. మోసపోయే వాడు ఉన్నంత కాలం మోసం చేసేవాళ్లకు ఈ రోజుల్లో ఏ కొదవా లేదు.
By: Raja Ch | 27 Oct 2025 1:38 PM ISTమోసాలు పలు రకాలనే సంగతి తెలిసిందే. మోసపోయే వాడు ఉన్నంత కాలం మోసం చేసేవాళ్లకు ఈ రోజుల్లో ఏ కొదవా లేదు. ఇక ప్రస్తుతం కాలంలో సైబర్ నేరాలు పెట్రేగి పోతున్న నేపథ్యంలో.. అప్పుడప్పుడూ వినిపించినా బిగ్ నెంబర్స్ తో వినిపించే రైస్ పుల్లింగ్ గురించి చాలా మందికి ఓ అవగాహన ఉండే ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా ఆ పేరు చెప్పి కొందరు కేటుగాళ్లు ఓ లేడీ డాక్టర్ ను బురిడీ కొట్టించారు అనే వార్త వైరల్ గా మారింది.
అవును... మాయా ప్రపంచంలో అప్పుడప్పుడూ వినిపించే పేర్లలో రైస్ పుల్లింగ్ ఒకటనే సంగతి తెలిసిందే. ఈ విషయంలో చాలామంది అత్యాసలకు లోనయ్యో, అమాయకంగా నమ్మో ఏకంగా రూ.కోట్లలో నష్టపోతుంటారు. ఈ క్రమంలో తాజాగా అలాంటి ఘటన మరొకటి జరిగింది. మహిమ గల చెంబు ఉందని చెప్పి హైదరాబాద్ కు చెందిన లేడీ డాక్టర్ ను బురిడీ కొట్టించింది ఓ గ్యాంగ్. ఈ ఘటనలో ముగ్గురు అరెస్ట్ అయ్యారు.
వివరాళ్లోకి వెళ్తే... అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయకు చెందిన కొర్రా బంగార్రాజు, కర్నాటి ప్రసాద్, పెందుర్తికి చెందిన వనుము శ్రీనివాస్ లతో కూడిన ఓ ఓ గ్యాంగ్ ఇటీవల హైదరాబాద్ కు చెందిన ఓ లేడీ డాక్టర్ ను కలిశారు. ఆమెతో.. మహిమ గల చెంబు తమ దగ్గర ఉందంటూ మాయ మాటలు చెప్పారు. ఆ చెంబు ఖరీదు రూ.30 కోట్లు అని నమ్మబలికారు. కారణం ఏదైనా.. ఈ విషయాన్ని ఆమె కూడా నమ్మారు.
దీంతో ఈ ముగ్గురు డాక్టర్ దగ్గర నుంచి విడతలవారీగా రూ.కోటిన్నర వరకు వసూలు చేశారట. కట్ చేస్తే.. డబ్బులు తీసుకున్న కొన్ని రోజుల తర్వాత ఈ ముగ్గురు సదరు డాక్టర్ కు అందుబాటులో లేకుండాపోయారట. ఈ క్రమంలో ఒకటి కాదు రెండు కాదు సుమారు ఆరు నెలలు గడిచిపోయింది. అయినప్పటికీ ఈ ముగ్గురు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఆ డబ్బులూ తిరిగి ఇవ్వలేదు.
అప్పటికి గానీ తాను మోసమోపాయనే విషయం సదరు మహిళా డాక్టర్ కు తెలియలేదు. దీంతో... ఈనెల 19న ఆరిలోవ పోలీసుల్ని ఆమె ఆశ్రయించారు. దీంతో... ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ చెంబు వ్యవహారంలో ఆరిలోవ హెల్త్ సిటీలోని ఓ హోటల్, శ్రీకాంత్ నగర్ లోని ఓ హోటల్ లో లావాదేవీలు జరిగాయని పోలీసులకు ఆధారాలను అందజేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
ఈ నేపథ్యంలో.. ఈ నెల 23న ఆరిలోవ దగ్గర ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు.. అనంతరం విమ్స్ మెయిన్ గేటు దగ్గర మరొకర్ని అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. ఈ సందర్భంగా నిందితుల దగ్గర నుంచి సుమారు రెండున్నర లక్షల రూపాయలతో పాటుగా మొబైల్ ఫోన్లు, ఓ కారును స్వాధీనం చేసుకున్నారు.
