నలుగురు ఎమ్మెల్యేలు..10వేల కోట్ల భూమి..కోర్టులో ఒకే పిల్..ఏంటి కథ?
హైదరాబాద్‌లో గచ్చిబౌలి శివారులో ఉంది ఖాజాగూడ ప్రాంతం. ప్రధాన వాణిజ్య, నివాస ప్రాంతం ఇది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం పరిధిలోకి వస్తుంది.
By: Tupaki Desk | 17 Jun 2025 9:30 AM ISTహైదరాబాద్‌లో భూమి ఎక్కడైనా ఇప్పుడు బంగారమే..! వంద గజాలు ఉన్నవారూ కోటీశ్వరులే అన్నట్లుంది పరిస్థితి..! అయితే, అత్యంత ఖరీదైన ఓ ప్రాంతంలో 27 ఎకరాల భూమి ఆక్రమణకు గురైందనే ఆరోపణలతో నలుగురు ఎమ్మెల్యేలు హైకోర్టుకు వెళ్లారు. వీరంతా అధికార పార్టీకి చెందినవారు కావడం గమనార్హమైతే.. వీరిలో ఒక్కరి నియోజకవర్గ పరిధిలోనూ ఆ భూమి లేకపోవడం మరో కీలక విషయం. ఇక ఆక్రమణకు గురైన భూమి విలువ ఎంత ఉంటుందో తెలిస్తే మరింత ఆశ‍్చర్యపోవడం ఖాయం. దీనికి సంబంధించిన వివరాలు ఇలా..
హైదరాబాద్‌లో గచ్చిబౌలి శివారులో ఉంది ఖాజాగూడ ప్రాంతం. ప్రధాన వాణిజ్య, నివాస ప్రాంతం ఇది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం పరిధిలోకి వస్తుంది. కాగా, ఖాజాగూడలో ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందంటూ నలుగురు ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి (మహబూబ్‌నగర్), రాజేశ్ రెడ్డి (నాగర్‌కర్నూల్), అనిరుధ్‌రెడ్డి (జడ్చర్ల), మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళీనాయక్ తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు. కాగా, మురళీనాయక్ తప్ప మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందినవారు. మురళీనాయక్‌ది మహబూబాబాద్ జిల్లా. వీరు దాఖలు చేసిన పిల్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఖాజాగూడలోని సర్వే నంబర్ 119, 122లో ఉన్న 27.18 ఎకరాల భూమిని ఆక్రమణకు గురైందని.. సర్వే నంబర్ మార్చి పోరంబోకు భూమిని ఆక్రమించారని సీనియర్ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. ఈ భూమి విలువ రూ.10 వేల కోట్లు ఉంటుందని తెలిపారు.
చెరువు ఫుల్ ట్యాంక్‌లోనివే..
రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా ఉన్న అధికారి 2023లో నిరభ్యంతర పత్రం జారీ చేశారని, నిర్మాణాలకు జీహెచ్‌ఎంసీ అనుమతి ఇచ్చిందని న్యాయవాది పేర్కొన్నారు. ఈ ప్రదేశంలో 8 టవర్లు నిర్మాణంలో ఉన్నాయని, ఒక్కోదాంట్లో 47 అంతస్తులు నిర్మిస్తున్నారని వివరించారు. ఇవన్నీ ఖాజాగూడ చెరువు ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టీఎల్) లో ఉన్నాయని తెలిపారు. దీంతోపాటు ఓ ప్రైవేటు పాఠశాలకు 150 మీటర్ల పరిధిలోనే రెడీమిక్స్ ప్లాంట్ ఉండడంతో పర్యావరణం కలుషితమై విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆక్రమణకు గురైన భూమిని స్వాధీనం చేసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. వాదనల అనంతరం.. ప్రభుత్వం, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, హైడ్రాకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.
