హైదరాబాద్ లో ఫెరారీ బీభత్సకాండ..
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
By: A.N.Kumar | 22 Feb 2026 6:19 PM ISTహైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్ నెం.45 వద్ద వేగంగా ప్రయాణిస్తున్న ఫెరారీ కారు అదుపుతప్పి డివైడర్‌పైకి దూసుకెళ్లి, మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఆ ప్రభావంతో కారు రోడ్డుకు అవతలివైపు వెళ్లి ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీకొట్టడంతో భారీ ప్రమాదం జరిగింది.
ఈ ఘటనలో ఫెరారీ కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న కార్లు ఒకదానికొకటి ఢీకొనడంతో మొత్తం మూడు కార్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మరికొన్ని ద్విచక్ర వాహనాలు కూడా ఈ ప్రమాదంలో నష్టపోయినట్లు సమాచారం.
ప్రమాదం జరిగిన వెంటనే ఫెరారీ కారులో ఎయిర్‌బ్యాగులు ఓపెన్ కావడంతో అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. అయితే స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మరోవైపు గాయపడిన పలువురిని స్థానికులు సమీప ఆసుపత్రులకు తరలించారు.
ప్రమాద సమయంలో కారు అతివేగంతో నడిపినట్లు ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. ప్రమాదం కారణంగా రోడ్ నెం.45లో భారీ ట్రాఫిక్ జాం ఏర్పడి, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
ప్రమాదానికి గురైన ఫెరారీ కారు వెంకట రాజారెడ్డి పేరుతో రిజిస్టర్ అయి ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, ప్రమాదానికి గల అసలు కారణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈ ఘటన మరోసారి నగరంలో అతివేగ డ్రైవింగ్ ప్రమాదకరమని గుర్తుచేసింది. రోడ్డు భద్రతా నియమాలు పాటించడం ద్వారా ఇలాంటి ప్రమాదాలను నివారించవచ్చని పోలీసులు సూచిస్తున్నారు.
