హైదరాబాద్ ఐటీ హబ్ లో జల సంక్షోభం
దేశంలోనే ప్రముఖ ఐటీ హబ్‌గా విలసిల్లుతున్న హైదరాబాద్ మహానగరం ప్రస్తుతం తీవ్రమైన జల సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
By: Tupaki Desk | 5 May 2025 2:20 PM ISTదేశంలోనే ప్రముఖ ఐటీ హబ్‌గా విలసిల్లుతున్న హైదరాబాద్ మహానగరం ప్రస్తుతం తీవ్రమైన జల సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఐటీహబ్ ప్రాంతాలైన కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి వంటి పశ్చిమ ,సెంట్రల్ జోన్లలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. భూగర్భ జలాలు అడుగంటిపోవడం , సరఫరా తగ్గడంతో ఈ ప్రాంతాల ప్రజలు నీటి కోసం ట్యాంకర్లపై ఆధారపడటం అనివార్యమైంది. ఇది ఇంటి ఖర్చులను విపరీతంగా పెంచుతూ పౌరులపై తీవ్ర భారాన్ని మోపుతోంది.
హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) నగరంలోని పలు ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ, గత కొన్ని నెలలుగా డిమాండ్ అసాధారణంగా పెరిగింది. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ ట్యాంకర్ యజమానులు అధిక ధరలు వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం ఐటీ కారిడార్‌తో పాటు పలు ప్రాంతాల్లో వాటర్ ట్యాంకర్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
- 25,000 లీటర్ల ట్యాంకర్ ధర ₹3,500 నుండి ₹4,000 వరకు ఉంది.
- 10,000 లీటర్ల ట్యాంకర్ కోసం ₹1,500 నుండి ₹2,000 వరకు చెల్లించాల్సి వస్తోంది.
ధరల పెరుగుదల ఒక సమస్య అయితే, నీటి సరఫరాలో జాప్యం మరో పెద్ద తలనొప్పిగా మారింది. భారీగా డబ్బు చెల్లించినప్పటికీ, ట్యాంకర్లు సమయానికి రావడం లేదని అనేక ప్రాంతాల నివాసితులు ఫిర్యాదు చేస్తున్నారు. గతంలో రోజుకు 7 నుండి 8 గంటలు ఉండే నగరపాలక సంస్థ నీటి సరఫరా ప్రస్తుతం కేవలం 3 నుండి 4 గంటలకు కుచించుకుపోయింది. దీంతో అనేక కుటుంబాలు తమ ప్రాథమిక అవసరాల కోసం వారానికి ₹2,500 నుండి ₹3,000 వరకు నీటిపైనే ఖర్చు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది.
భారత వాతావరణ శాఖ మే - జూన్ 2025లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేయడంతో, హైదరాబాద్ నగరంలో వడగాలుల ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఐటీ హబ్ సహా నగరవ్యాప్తంగా పెరుగుతున్న నీటి డిమాండ్‌ను తీర్చడానికి.. ప్రజల కష్టాలను తగ్గించడానికి ప్రభుత్వం ఎలాంటి తక్షణ.. దీర్ఘకాలిక చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. బోరుబావులు ఎండిపోవడం, భూగర్భ జలాలు తగ్గిపోవడం వంటి సమస్యలకు శాశ్వత పరిష్కారాలు కనుగొనాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
