Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో అద్దెలు.. అక్కడే అంతలా పెరిగిపోతున్నాయా?

సంపన్నుడికి ఏ మహానగరమైనా ఓకే. మధ్యతరగతి జీవి సైతం కిందా మీదా పడి సర్దుకుంటాడు. కానీ.. పేదోడికి మాత్రమే తెగ ఇబ్బంది.

By:  Tupaki Desk   |   3 Sept 2025 12:00 PM IST
Soaring Rents in Hyderabad’s IT Corridor
X

సంపన్నుడికి ఏ మహానగరమైనా ఓకే. మధ్యతరగతి జీవి సైతం కిందా మీదా పడి సర్దుకుంటాడు. కానీ.. పేదోడికి మాత్రమే తెగ ఇబ్బంది. ఒకప్పుడు ఎవరైనా సరే.. హైదరాబాద్ లో బతికేసేందుకు వీలుగా పరిస్థితులు ఉండేవి. అల్పాదాయం వారు సైతం జీవించే వెసులుబాటు ఉండేది. ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితులు హైదరాబాద్ లో చోటు చేసుకున్నాయి. అయితే.. ఈ పరిస్థితి హైదరాబాద్ మొత్తం ఉందా? అంటే లేదనే చెప్పాలి. హైదరాబాద్ మహానగరానికి గుండెకాయలా మారిన ఐటీ కారిడార్ లో ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారాయి.

ఐటీ కారిడార్ పరిధిలో ఉన్న మాదాపూర్.. హైటెక్ సిటీ.. గచ్చిబౌలి.. కొండాపూర్.. నానక్ రాంగూడ.. ఇలా ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అద్దెలు అకాశాన్ని అంటేస్తున్నాయి. ఒకప్పుడు ఈ ప్రాంతాల్లో సింగిల్ బెడ్రూం అంటే రూ.5నుంచి రూ.10 వేలు ఉండేవి. ఇప్పుడు ఏకంగా ఐరూ.25 వేలు దాటేసిన పరిస్థితి. ఇక.. టూబీహెచ్ అయితే ఏకంగా రూ.35 వేల నుంచి రూ.45 వేల వరకు అద్దెలు వెళ్లిపోయాయి.

ఐటీ కంపెనీలు.. స్టార్టప్ లు ఎక్కువగా ఉండటం.. ఆఫీసుకు వీలైనంత దగ్గరగా ఉండాలన్న ఉద్దేశంతో ఎక్కువ మంది ఐటీ కారిడార్ లో ఉండేందుకు ఇష్టపడుతున్నారు. ఫ్యామిలీతో ఉన్న వారు బడ్జెట్ లో భాగంగా కాస్త దూరంగా ఉంటుంటే.. బ్యాచిలర్స్ మాత్రం పని చేసే కంపెనీకి ఎంత దగ్గరగా ఉంటే అంత బెటర్ అన్న ఆలోచనతో ఉండటంతో.. ఐటీకారిడార్ లో అద్దెలు భగ్గుమంటున్నాయి. ఇక.. పేరున్న గేటెడ్ కమ్యూనిటీల్లో అయితే టూబీహెచ్ కే ఏకంగా రూ.50 వేల వరకు అద్దెలు ఉంటున్నాయి. ట్రిపుల్ బెడ్రూం అయితే మరింత ఎక్కువగా ఉండటం కనిపిస్తోంది.

ఇంత ఎక్కువగా అద్దెలుఉండటానికి కారణం.. పెరిగిన అవసరాలకు అనుగుణంగా కొత్తగా అపార్టుమెంట్లు రాకపోవటం.. షెడ్యూల్ ప్రకారం ఇప్పటికే కొన్నికొత్త అపార్టుమెంట్లు.. వెంచర్లు తమ ఇళ్లను డెలివరీ ఇవ్వాల్సి ఉంది. కానీ.. మార్కెట్ బాగోలేకపోవటంతో ఆలస్యమవుతున్న పరిస్థితి. మార్కెట్ వర్గాల అంచనాల ప్రకారం ఐటీ కారిడార్ లో నిర్మాణంలో ఉన్న వెంచర్లలో అత్యధిక శాతం 2027 సెప్టెంబరు నుంచి 2028 ఆగస్టు మధ్యలో డెలివరీ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ టైంలో పొజిషన్ ఇచ్చే ఇళ్ల సంఖ్య భారీగా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే.. ఈ సమయానికి నగరానికి కొత్తగా వచ్చే వారి సంఖ్య మరింత పెరిగే వీలుంది కాబట్టి.. డిమాండ్ వర్సెస్ సప్లై విషయంలో ఉన్న గ్యాప్ ఇప్పటి మాదిరే కంటిన్యూ అవుతుందని భావిస్తున్నారు.

మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే ఐటీ కారిడార్ లో ఉండే అద్దె ఇళ్లకు సంబంధించి ఆసక్తికర కోణం ఒకటి కనిపిస్తోంది. సాధారణంగా బ్యాచిలర్లకు ఇంటిని అద్దెకు ఇచ్చేందుకు ఆసక్తి చూపరు. కానీ.. ఐటీ కారిడార్ లో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ బ్యాచిలర్లకే అధికప్రాధాన్యత. దీనికి కారణం.. వారైతే.. సింగిల్ బెడ్రూం ఇంట్లో ఇద్దరు నుంచి నలుగురు వరకు ఉండటం.. షేరింగ్ లో భాగంగా అద్దెను భారీగా వసూలు చేసే వెసులుబాటు ఉండటం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. అంతేకాదు.. బ్యాచిలర్ ఐటీ ఉద్యోగులకు ఇళ్లను అద్దెకు ఇస్తే.. నీటి వినియోగం కూడా తక్కువగా ఉంటుందని యజమానులు భావిస్తున్నారు. ఇలాంటి కారణాలతో ఐటీ కారణాలతో అద్దెలు భారీగా దూసుకెళ్లిపోతుంటే.. ఈ ప్రాంతాల్లో సామాన్య ప్రజానీకం బతకలేని పరిస్థితి నెలకొందని చెబుతున్నారు.