వీర్యానికి రూ.వెయ్యి.. అండానికి రూ.20వేలు
విశ్వసనీయ సమాచారంతో సదరు క్లినిక్ ను టాస్కు ఫోర్సు టీం తనిఖీలు చేపట్టగా.. షాకింగ్ అంశాలు వెలుగు చూశాయి.
By: Tupaki Desk | 28 July 2025 2:15 PM ISTహైదరాబాద్ మహానగరంలో మరో చీకటి భాగోతం వెలుగు చూసింది. దేశ వ్యాప్తంగా నెట్ వర్కు ఉండటమే కాదు.. వివిధ ప్రాంతాలకు హైదరాబాద్ కేంద్రంగా వీర్యం.. అండాల్ని సరఫరా చేస్తున్న దుర్మార్గాన్ని టాస్క్ ఫోర్సు టీం బట్టబయలు చేసింది. సికింద్రాబాద్ లోని గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఇండియన్ స్పెర్మ్ టెక్ క్లినిక్ చేస్తున్న తప్పుడు పనులు బయటకు వచ్చాయి.
విశ్వసనీయ సమాచారంతో సదరు క్లినిక్ ను టాస్కు ఫోర్సు టీం తనిఖీలు చేపట్టగా.. షాకింగ్ అంశాలు వెలుగు చూశాయి. 20 మంది నుంచి సేకరించిన వీర్యం నమూనాల్ని.. రికార్డుల్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సెంటర్ లో పని చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని ప్రశ్నించగా.. పలు అంశాలు వెలుగు చూశాయి. అక్రమ పద్దతుల్లో తాము సేకరించిన వీర్య కణాల్ని దేశంలోని వివిధ నగరాలకు సరఫరా చేస్తున్న వైనాన్ని గుర్తించారు.
వీర్యం ఇచ్చే మగాళ్లకు రూ.800 నుంచి రూ.1200 వరకు ఇస్తున్నట్లుగా తేల్చారు. అదే సమయంలో మహిళల అండాల్ని దానం చేసే వారికి రూ.20 నుంచి రూ.25 వేల వరకు ఇస్తున్నట్లుగా తేల్చారు. పురుషులకు ఫోర్న్ వీడియోలు చూపించి వీర్యం సేకరిస్తున్నట్లుగా గుర్తించారు. ఈ తరహా సేకరణకు సంబంధించి ఎలాంటి చట్టపరమైన అనుమతులు లేకుండానే ఈ పాడు పని చేస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు.
వీరి వాదనకు భిన్నంగా తమకు అన్ని అనుమతులు ఉన్నట్లుగా సదరు సంస్థ యజమాన్యం చెబుతుండటం గమనార్హం. తాము సేకరించిన అండాలు.. వీర్య కణాల్ని గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఉన్న తమ హెడ్డాఫీసుకు పంపుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో అక్కడకు తమ టీంలను పంపించి.. లోతుగా దర్యాప్తు నిర్వహిస్తే మరిన్ని విషయాలు వెలుగు చూస్తాయని భావిస్తున్నారు. ఏమైనా.. తప్పుడు పద్దతుల్లో మహిళల అండాల్ని.. పురుషుల వీర్య కణాల్ని సేకరిస్తున్న తీరు ఇప్పుడు సంచనలంగా మారింది.
