Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో కేవలం పావువంతు కంటే తక్కువ జనానికి సొంత ఇల్లు..

భాగ్యనగరంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరి కల ‘సొంత ఇల్లు’. కానీ తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే వెల్లడించిన ఈ గణాంకాలు చూస్తుంటే, ఆ కల సామాన్యుడికి ఎంతటి 'అందని ద్రాక్ష'గా మారిందో అర్థం అవుతోంది.

By:  Tupaki Political Desk   |   21 April 2026 2:00 PM IST
హైదరాబాద్ లో కేవలం పావువంతు కంటే తక్కువ జనానికి సొంత ఇల్లు..
X

భాగ్యనగరంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరి కల ‘సొంత ఇల్లు’. కానీ తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే వెల్లడించిన ఈ గణాంకాలు చూస్తుంటే, ఆ కల సామాన్యుడికి ఎంతటి 'అందని ద్రాక్ష'గా మారిందో అర్థం అవుతోంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ ప్రపంచ పటంలో ఐటీ, ఫార్మా హబ్‌గా వెలుగొందుతోంది. అయితే, ఈ నగరం వెనుక మరో చేదు నిజం దాగుంది. ఇక్కడ నివసించే ప్రతి నలుగురిలో ముగ్గురికి సొంత ఇల్లు లేదు. తాజాగా వెలువడిన సామాజిక ఆర్థిక సర్వే నివేదిక ప్రకారం, హైదరాబాద్‌లో కేవలం 23.08 శాతం కుటుంబాలకు మాత్రమే సొంత ఇళ్లు ఉన్నాయి. అంటే నగరంలోని మెజారిటీ జనాభా తమ సంపాదనలో సింహభాగాన్ని ప్రతి నెలా అద్దెల రూపంలోనే ఖర్చు చేస్తోంది.

శివారు జిల్లాల్లోనూ ఇదే సెగ!

హైదరాబాద్ నగరం విస్తరిస్తున్న కొద్దీ శివారు జిల్లాలైన మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంటోంది. కానీ, అక్కడ కూడా గృహ యాజమాన్యం ఆశాజనకంగా లేదు. ఇక్కడ సొంత ఇల్లు ఉన్నవారు కేవలం 35.26 శాతమే. ఈ జిల్లాలో 35.56 శాతం మందికి మాత్రమే సొంత గూడు ఉంది. ఐటీ కారిడార్, అంతర్జాతీయ కంపెనీలు ఈ జిల్లాల్లోనే ఉన్నప్పటికీ, పెరిగిన భూముల ధరలు సామాన్యుడిని అద్దె ఇళ్లకే పరిమితం చేస్తున్నాయి.

నారాయణపేట టాప్!

నగరాలకు భిన్నంగా గ్రామీణ జిల్లాల్లో సొంత ఇంటి శాతం గణనీయంగా ఉంది. నారాయణపేటలో 68.88 శాతంతో ఈ జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. దక్షిణ తెలంగాణ జిల్లాలైన వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో 65 శాతం మందికి సొంత ఇళ్లు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో భూమి లభ్యత ఎక్కువగా ఉండడం, వంశపారంపర్యంగా వచ్చే ఇళ్లు ఉండడం వల్ల అక్కడ గృహ యాజమాన్యం ఎక్కువగా కనిపిస్తోంది.

సొంత ఇల్లు ఎందుకు అందని ద్రాక్ష..?

హైదరాబాద్‌లో గృహ యాజమాన్యం తక్కువగా ఉండేందుకు ప్రధాన కారణాలు.. ఐదేళ్లలో హైదరాబాద్‌లో స్థిరాస్తి ధరలు రెట్టింపయ్యాయి. ఒక సాధారణ మధ్య తరగతి ఉద్యోగి తన జీవితకాల సంపాదనతో నగరంలో ప్లాట్ లేదా ఫ్లాట్ కొనడం కష్టంగా మారింది. ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చే వారు స్థిరపడడం కంటే అద్దె ఇళ్లలోనే ఉండేందుకు మొగ్గు చూపుతున్నారు. నగరంలో ఇళ్లు ఉన్నవారు కూడా వాటిని నివాసం కోసం కాకుండా, కేవలం పెట్టుబడి కోసం కొని అద్దె కడుతున్నారు. దీనివల్ల ఒకరికే నాలుగైదు ఇళ్లు ఉండగా, వేల మందికి ఒక్కటి కూడా లేని పరిస్థితి ఏర్పడింది.

ప్రభుత్వం ముందున్న సవాలు

ఈ నివేదిక ప్రభుత్వానికి ఒక స్పష్టమైన హెచ్చరిక చేస్తోంది. పట్టణ ప్రాంతాల్లో పేద, మధ్య తరగతి వర్గాల కోసం ప్రభుత్వం 'అఫోర్డబుల్ హౌసింగ్' పథకాలను వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. నగరం వెలుపల రవాణా సౌకర్యాలను మెరుగుపరిస్తే, జనం దూరం వెళ్లైనా సొంత ఇళ్లు కొనుక్కునే అవకాశం ఉంటుంది.

ఒకప్పుడు ‘సొంత ఇల్లు’ అనేది ప్రతి కుటుంబానికి ఒక ప్రాథమిక అవసరం. కానీ నేడు హైదరాబాద్ వంటి నగరాల్లో అది ఒక లగ్జరీగా మారిపోయింది. 77 శాతం మంది అద్దె ఇళ్లలో ఉండడం అనేది ఆర్థిక అసమానతలకు అద్దం పడుతోంది. ప్రభుత్వం కేవలం ధనికుల కోసమే కాకుండా, సామాన్యుల సొంత ఇంటి కల నెరవేర్చే దిశగా విధానాలు రూపొందించినప్పుడే సమగ్ర అభివృద్ధి సాధ్యం అవుతుంది.